తెలంగాణలో 15 రోజుల పాటు హీట్ వేవ్...జర జాగ్రత్త
x
భగభగ మండుతున్న సూర్యుడు

తెలంగాణలో 15 రోజుల పాటు హీట్ వేవ్...జర జాగ్రత్త

భానుడి భగభగలు,వడగాలుల ప్రభావంతో తెలంగాణ అగ్నిగుండంగా మారింది. రాబోయే 15 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని జారీ చేసిన హెచ్చరికలతో తెలంగాణ సీఎంఓ అప్రమత్తమైంది.


తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 15 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరించింది. రాబోయే నాలుగు రోజులు ఎండలు మండిపోనున్నాయి. ఎండలకు తోడు వేడిగాలుల ప్రభావం వల్ల వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది.

- రాగల 15 రోజుల్లో వర్షాలు చెదురుమదురుగా అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నా, ఉష్ణోగ్రతలు మాత్రం భారీగానే పెరగనున్నాయి. రాగల 15 రోజుల పాటు హీట్ వేవ్ పై వాతావరణ కేంద్రం అధికారుల హెచ్చరికలతో తెలంగాణ సీఎంఓ అప్రమత్తమైంది.
- తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ లో బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత 43.7 డిగ్రీల సెల్షియస్ నమోదైంది. తెలంగాణలోని భద్రాచలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలు మంచినీరు తాగుతూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

భగభగ మండిన భద్రాచలం
తెలంగాణ రాష్ట్రంలోనే గురువారం అత్యధికంగా భద్రాచలంలో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదుతో భద్రచలం పట్టణం భగభగలతో మండిపోయింది. భద్రాద్రి సీతారామల వారి దర్శనం కోసం గురువారం వచ్చిన భక్తులు ఎండకు తట్టుకోలేక అవస్థలు పడ్డారు. నల్గొండ జిల్లాలో 42.5 డిగ్రీలు, ఖమ్మంలో 42.2 డిగ్రీలు, రామగుండంలో 41.4, నిజామాబాద్ లో 41.4, హన్మకొండలో 41.0, మెదక్ లో 40.6, మహబూబ్ నగర్ లో 40.5, హైదరాబాద్ లో 39.9, దుండిగల్ లో 39.5, హకీంపేటలో 39.0, ఆదిలాబాద్ జిల్లాలో 38.8 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

నాలుగు రోజుల పాటు తీవ్ర వేడిగాలులు
తెలంగాణలో గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశముందిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డి ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గురువారం నుంచి నాలుగురోజుల పాటు తెలంగాణలో పొడివాతావరణం ఉన్నందున వేడిగాలులు వీచే అవకాశముందని ఆయన తెలిపారు. ఈ నెల 27వతేదీ నుంచి మే 1వతేదీ వరకు అయిదు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడి జల్లులు కురిసే అవకాశముందని ఆయన తెలిపారు.

ఎల్లో అలర్ట్ జారీ
గురువారం నుంచి అయిదురోజులపాటు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, కామారెడ్డి జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. వేడిగాలులు వీసే జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశామని ధర్మరాజు వివరించారు.

హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ వల్ల ఎండవేడిమి పెరిగింది...
హైదరాబాద్ నగరంలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రత 39 నుంచి 41 డిగ్రీల సెల్షియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్షియస్ ఉంటుందని వాతావరణ కేంద్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశగా వీచే అవకాశం ఉందని, హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్ గా మారడం వల్ల ఎండవేడిమి పెరిగిందని ఆయన చెప్పారు.

ఎండలో బయటకు వెళ్లవద్దు : ఐఎండీ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వేడిగాలుల ప్రభావం వల్ల ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడున్నర గంటల దాకా సూర్యప్రతాపం అధికంగా ఉంటుందని, ప్రజలు ఎండలో బయట తిరగవద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డి ధర్మరాజు సూచించారు. పరిశ్రమల్లో లోపల పనిచేసేవారు కూడా అధికంగా నీరు తాగుతూ నీడపట్టున ఉండాలని ఆయన కోరారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

ఎండవేడిమితో పెరిగిన విద్యుత్ వినియోగం
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఉక్కపోత, ఎండవేడిమి బారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లపై ఆధారపడుతున్నారు. దీంతో గత వారం రోజులుగా అనూహ్యంగా 20 శాతం అదనంగా విద్యుత్ వినియోగం పెరిగిందని హైదరాబాద్ సీపీడీసీఎల్ అధికారులే చెబుతున్నారు.

వడదెబ్బతో కూలీల మృతి
తెలంగాణలో భానుడి భగభగలతో వడదెబ్బ సోకి మరణిస్తున్న కూలీల సంఖ్య పెరుగుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఉపాధి పనులు చేస్తూ లక్ష్మి(55) అనే మహిళ వడదెబ్బకు గురై మరణించింది.సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని కోటినాయక్‌ తండాకు చెందిన దరావత్‌ గోల్యా(70), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బాలరాజ్‌పల్లిలో నాగుల బాలయ్య(50) అనే రైతు ఎండదెబ్బతో మృత్యువాతపడ్డారు. ములుగు జిల్లాకు చెందిన చింతల రాజు కూలీ పనులు చేస్తూ ఎండవేడిమితో మరణించాడు. భూపాలపల్లికి చెందిన కుమ్మరి అనిత (45( వడదెబ్బతో మరణించింది. తెలంగాణ నిప్పుల గుండంలా మారడంతో వడదెబ్బ మృతుల సంఖ్య పెరిగింది.


Read More
Next Story