ఉద్యోగం ఆశతో యుద్ధంలో ఇరుక్కుపోయిన హైదరాబాద్ కుర్రోళ్లు
x
russia-ukrain war

ఉద్యోగం ఆశతో యుద్ధంలో ఇరుక్కుపోయిన హైదరాబాద్ కుర్రోళ్లు

ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి 12మంది నిరుద్యోగ యువకులను రష్యా తీసుకువెళ్లి మోసగించి వారిని ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధరంగంలో దించిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది.


రష్యాలో ఉద్యోగావకాశాల సాకుతో 12 మంది భారతీయ యువకులను ఏజెంట్లు రష్యా ప్రభుత్వ నిధులతో నడిచే ప్రైవేట్ ఆర్మీ అయిన వాగ్నర్ గ్రూప్‌లో పని చేయడానికి రప్పించి, ఉక్రెయిన్‌ యుద్ధభూమిలో వదిలిపెట్టిన ఘటన సంచలనం రేపింది.తాను హైటెక్ మోసానికి గురయ్యానని, తనను రక్షించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలోని నారాయణ పేట్ జిల్లాకు చెందిన ముహమ్మద్ సూఫియాన్ అతని కుటుంబానికి వీడియో పంపించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. తనను రష్యా బలవంతంగా తమ ఇష్టానికి విరుద్ధంగా ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధరంగంలో దించి పోరాడండని చెప్పిందని ఆర్మీ యూనిఫాంలో ఉన్న సూఫియాన్ ఆవేదనగా చెప్పారు. రష్యాలో ఆర్మీ సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేసేందుకు తమను రిక్రూట్ చేస్తున్నట్లు చెప్పి గత ఏడాది డిసెంబరులో రష్యాకు ఏజెంట్లు పంపించారని ఆయన పేర్కొన్నారు.

భారీ జీతాలు ఇస్తామని ఆశ చూపించి...

దుబాయ్ దేశంలో తాము 30వేల రూపాయల జీతంతో పనిచేస్తున్న తమకు రూ.2 లక్షల వేతనం ఇస్తామని చెప్పి దుబాయ్ దేశానికి ఏజెంట్లు పిలిచారని సూఫియాన్ చెప్పారు. అనంతరం గత ఏడాది నవంబరులో దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకువచ్చి డిసెంబరు నెలలో చెన్నై నుంచి రష్యాకు విజిటర్ వీసాలపై నలుగురిని తరలించారని తీసుకువచ్చారని సూఫియాన్ పేర్కొన్నారు. సెక్యూరిటీ హెల్పర్లుగా మంచి జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమ వద్ద నుంచి ఏజెంట్లు రూ.3.5 లక్షలు తీసుకున్నారని బాధిత కుటుంబ సభ్యుడొకరు ఆరోపించారు. తమను రష్యా దేశానికి చెందిన ప్రైవేటు ఆర్మీ గ్రూప్ అయిన వాగ్నర్ గ్రూప్ లో రిక్రూట్ చేసి ఉక్రెయిన్ యుద్ధంలో తమను ముందుంచారని బాధితుడు సూఫియాన్ ఆవేదనగా చెప్పారు.

సెక్యూరిటీ హెల్పర్ల పేరిట మోసం

మహారాష్ట్రకు చెందిన యూట్యూబర్ మరో 60 మంది యువకులను సెక్యూరిటీ హెల్పర్లుగా నియమిస్తున్నట్లు చెప్పి రష్యన్ భాషలో ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకొని మోసగించారని సూఫియాన్ చెప్పారు. తన సోదరుడు 15 రోజుల క్రితం ఫోన్ లో మాట్లాడుతూ ఉక్రెయిన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోకి తీసుకువెళ్లి, తమ ఇష్టానికి వ్యతిరేకంగా యుద్ధరంగంలో దించారని చెప్పినట్లు అతని సోదరుడు సయ్యద్ సల్మాన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తన సోదరుడు రష్యా సైనికుడి ఫోన్ నుంచి మెసేజ్ పంపించాడని, తన సోదరుడిని కాపాడాలని సల్మాన్ ప్రాధేయపడ్డారు.ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో బాధితులతో సంభాషించలేకపోతున్నామని, కమ్యూనికేషన్ కోసం వాయిస్ మెసేజ్‌లపైనే ఆధారపడుతున్నారని బాధితుల కుటుంబసభ్యులు చెప్పారు.

ఉక్రెయిన్ యుద్ధ భూమికి పంపించారు...

‘‘మేం రష్యా చేరుకున్న తర్వాత, రక్షణ ముసుగులో ఆయుధాలు అందించారు. కొన్ని రోజుల తర్వాత, మమ్మల్ని బలవంతంగా ఆయుధ శిక్షణకు పంపారు. అనంతరం మమ్మల్ని ఉక్రెయిన్ యుద్ధభూమికి పంపించారు’’ అని మోసపోయిన యువకుల్లో ఒకరి సోదరుడు అద్నాన్ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురితో సహా పలువురు భారతీయులున్నారు. ఆర్మీ సహాయకులుగా ఉద్యోగాల సాకుతో తమను తప్పుదారి పట్టించారని బాధిత యువకులు చెబుతున్నారు.బాధితుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సయ్యద్ ఇల్యాస్, హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్‌కు చెందిన మహ్మద్ అస్ఫాన్, కర్ణాటకలోని కల్బుర్గికి చెందిన అబ్దుల్ నయీమ్‌లు కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్బాబ్ హుస్సేన్, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన జహూర్ అహ్మద్, గుజరాత్‌కు చెందిన హమేల్ అశ్విన్ భాయ్‌లు చిక్కుకుపోయారని సమాచారం.

యుద్ధభూమిలో ఒకరి మృతి

గత ఏడాది నవంబర్ నుంచి పది మంది భారతీయులు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో మారియుపోల్, ఖార్కివ్, డోనెట్స్క్, రోస్టోవ్-ఆన్-డాన్‌లతో సహా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. అక్కడ భారతీయుల్లో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన యువకుల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన ముగ్గురు, గుజరాత్‌కు చెందిన ఒకరు, కాశ్మీర్‌కు చెందిన ఇద్దరు, యూపీకి చెందిన ఒకరు ఉన్నారు.రష్యన్ భాషలో రాసిన ఒప్పందాలపై తమ సంతకాలు తీసుకున్నారని అద్నాన్ ఆరోపించారు.

ఉక్రెయిన్ నుంచి 12 మంది యువకులను రప్పించండ : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

ఏజెంట్ల చేతిలో చిక్కి రష్యా-ఉక్రెయిన్ యుద్ధరంగంలో చిక్కుకున్న 12 మంది యువకులను క్షేమంగా భారతదేశానికి రప్పించేందుకు చొరవ తీసుకోవాలని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు,మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ మేర ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు, రష్యాలో భారత రాయబారికి ఒవైసీ లేఖలు రాశారు. ఇద్దరు తెలంగాణ యువకులతోపాటు కర్ణాటక, కశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 12 మంది నిరుద్యోగులకు రష్యాలో బిల్డింగ్ సెక్యూరిటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి వారిని ఉక్రెయిన్ యుద్ధరంగంలో దించారని అసద్ పేర్కొన్నారు. బాధిత యువకులను విడుదల చేయించేందుకు తాను చొరవ తీసుకున్నానని ఎంపీ అసదుద్దీన్ చెప్పారు.

Read More
Next Story