హైడ్రాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, జన్వాడ ఫాం హౌస్‌పై స్టేకు నిరాకరణ
x

హైడ్రాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, జన్వాడ ఫాం హౌస్‌పై స్టేకు నిరాకరణ

చెరువుల ఆక్రమిత భవనాల కూల్చివేతలపై హైడ్రాకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.


చెరువులు, పార్కుల స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాల కూల్చివేతలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA)కు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాం హౌస్ ను కూల్చవద్దంటూ దాని యజమాని బద్వేలు ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.

- ఫాంహౌస్ కూల్చివేయకుండా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో కూల్చివేతలపై హైడ్రాకు ఊరట లభించినట్లయింది. స్టే ఇవ్వాలన్న ప్రదీప్ రెడ్డి వాదనను హైకోర్టు కొట్టివేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత పై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు కోర్టు ఆదేశించింది.జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ప్రదీప్ రెడ్డి సమర్పించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశించింది.
- హైదరాబాద్ నగరంతోపాటు నగర శివార్లలోని పలు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు కబ్జాల పాలయ్యాయని ఏఏజీ హైకోర్టుకు తెలిపారు. చెరువుల ఆక్రమణలను నివారించేందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు కోర్టుకు ఏఏజీ తెలిపారు. స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చిన తర్వాతే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని కోర్టుకు తెలిపింది. అక్రమ కట్టడాలు, ఆక్రమణలను కూల్చివేయడంపై పలువురు హైడ్రాను ప్రశంసిస్తున్నారు.

హైడ్రా (HYDRA)ఏర్పాటుపై జీఓ 99 జారీ
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను ఏర్పాటు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్టుమెంట్ జీఓఎంఎస్ నంబరు 99 పేరిట జులై 19వతేదీన జారీ చేసింది.

సీఎం అధ్యక్షతన హైడ్రా
సీఎం అధ్యక్షతన ఏర్పాటైన హైడ్రాలో మున్సిపల్ శాఖ మంత్రి, రెవెన్యూశాఖ మంత్రి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల ఇన్ చార్జీ మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సభ్యులుగా, మెంబర్ కన్వీనరుగా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ను నియమించారు.

హైడ్రా సేవలు
హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కోరారు.జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు.

హైడ్రా పరిధి 2వేల కిలోమీటర్లు
జీహెచ్ఎంసీతో పాటు, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకొని మరింత సమర్థంగా హైడ్రా పని చేసేలా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేస్తుంది.

హైడ్రా విధులు ఏమిటంటే...
విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు హైడ్రా ప్రధాన విధులు. ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్తు సరఫరాలో హైడ్రా కీలకంగా వ్యవహరించేలా విధులు అప్పగించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా చూశారు.


Read More
Next Story