హైస్పీడ్ రైల్ కారిడార్: హైదరాబాద్ నుంచి 4 గంటల్లోనే వైజాగ్!
తెలుగు రాష్ట్రాలలో ఇది మొట్ట మొదటి హై స్పీడ్ రైల్ కారిడార్ అవుతుంది. ఈ కారిడార్‌తో రెండు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
హైదరాబాద్‌లో నివసించే విశాఖవాసులకు శుభవార్త. విశాఖ ప్రాంతంవారు, విశాఖపట్నానికి పనిమీద వెళ్ళేవారు ఇక నాలుగు గంటల్లోనే గమ్యాన్ని చేరుకోబోతున్నారు. ప్రస్తుతం రైలులో హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే సుమారుగా 12 గంటల సమయం పడుతోంది(వందే భారత్‌లో 8.30 గం.). అలాంటిది ఆ సమయం ఒక్కసారిగా 8 గంటలు తగ్గి నాలుగు గంటల్లో విశాఖ చేరితే! సమయం, డబ్బు ఎంత ఆదా అవుతాయి! శంషాబాద్-విశాఖపట్నం మధ్య కొత్త రైలుమార్గంకోసం సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారు అయింది.
తెలుగు రాష్ట్రాలలో ఇది మొట్ట మొదటి హై స్పీడ్ రైల్ కారిడార్ అవుతుంది. ఈ కారిడార్‌తో రెండు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. సూర్యాపేట-విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ మార్గంపై ప్రాధమికంగా ఇంజనీరింగ్, ట్రాఫిక్ సర్వే తుది దశకు చేరుకుంది. ఈ సర్వే నివేదికను నవంబర్‌లో రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లు తెలిసింది. శంషాబాద్, రాజమండ్రి విమానాశ్రయాలను అనుసంధానించేలా ఈ ప్రణాళికను రూపొందించారు. ఈ హైస్పీడ్ కారిడార్‌లో రైళ్ళు గంటకు 220 కి.మీ. వేగంతో ప్రయాణించేలా రైలు మార్గాన్ని నిర్మిస్తారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రస్తుతం రెండు రైలు మార్గాలు ఉన్నాయి. మొదటిది - వరంగల్-ఖమ్మం-విజయవాడ మార్గం. ఈ మార్గంలో హైదరాబాద్-వైజాగ్ దూరం 699 కి.మీ. రెండోది - నల్గొండ-గుంటూరు-విజయవాడ మార్గం. ఈ మార్గంలో హైదరాబాద్-వైజాగ్ దూరం 663 కి.మీ. వందే భారత్ తప్పితే ఈ రెండు మార్గాలలో ప్రయాణించే రైళ్ళు గంటకు 110-130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రాబోతున్న హైస్పీడ్ కారిడార్ మార్గం చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట, జగ్గయ్యపేట, విజయవాడల మీదుగా విశాఖపట్నం వెళుతుంది. ఈ మార్గంలో దూరం 619 కి.మీ. ఈ కారిడార్ హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి మార్గానికి సమాంతరంగానే వెళుతుందని తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు రైలు మార్గంలేని నార్కట్ పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వంటి పట్టణాలను ఇది కలపబోతోంది.