రాజస్థాన్‌లోని ఫలోడిలో భారీగా నమోదైన పగటి ఉష్ణోగ్రత..
ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణతాపానికి జనం అల్లాడిపోతున్నారు. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఇంటి నుంచి కాలు బయటకు మోపనివ్వడంలేదు.
ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణతాపానికి జనం అల్లాడిపోతున్నారు. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఇంటి నుంచి కాలు బయటకు మోపనివ్వడంలేదు. వివిధ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం రాజస్థాన్‌లోని ఫలోడిలో పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీలను తాకింది. దేశంలోని చాలా ప్రాంతాలలో వడగాలులు వీస్తున్నాయి.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. జూన్ 1, 2019 నుంచి దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్. మే 19, 2016న ఫలోడిలో భారతదేశం ఆల్ టైం టెంపరేచర్ 51 డిగ్రీలు.
దేశంలోని ఉత్తర మైదానాలు, మధ్య ప్రాంతాలే కాకుండా హిమాచల్ ప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ కొండలపై కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండను లెక్కచేయని ఓటర్లు..
ఉత్తరప్రదేశ్, హర్యానా, దేశ రాజధానితో సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు జరిగిన శనివారం (మే 25) లోక్‌సభ ఆరవ విడత ఎన్నికలు జరిగాయి. ఎండసెగను కూడా లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల ఎండలోనే క్యూలో నిలుచుని తమ వంతు కోసం ఎదురుచూశారు. చాలావరకు పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, వృద్ధులకు కుర్చీలు కనిపించలేదు.
వివిధ ప్రాంతాల్లో నమోదయిన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ (40.5 డిగ్రీలు), అస్సాంలోని సిల్చార్ (40), మరియు లుమ్‌డింగ్ (43), అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్ (40.5), పాసిఘాట్ (39.6)లో ఆల్ టైమ్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అస్సాంలోని తేజ్‌పూర్ (39.5), మజ్బత్ (38.6), ధుబ్రి (38.2), నార్త్ లఖింపూర్ (39.2), మరియు మోహన్‌బారి (38.8)లలో కూడా మే నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
17 చోట్ల ఉష్ణోగ్రత 45 డిగ్రీలు..
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని 17 ప్రాంతాల్లో శనివారం గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారిక సమాచారం.
రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48.8 డిగ్రీల సెల్సియస్, జైసల్మేర్‌లో 48 డిగ్రీలు, బికనీర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ప్రజలు, జంతువులు, పక్షులకు వేడి నుండి ఉపశమనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం జిల్లా కలెక్టర్‌లకు సూచించింది.
ఉత్తర భారతదేశంలో కొనసాగుతోన్న వడగాలులు ...
ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలోని కొండలపై కూడా ఉష్ణోగ్రత ప్రభావం కనిపిస్తుంది.
రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించింది. బయటకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
రాబోయే నాలుగు రోజుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో అధిక రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD తెలిపింది.
సెంట్రల్ వాటర్ కమీషన్ ప్రకారం.. దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వ ఐదేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది అనేక రాష్ట్రాల్లో నీటి కొరతను తీవ్రం చేసింది. ఫలితంగా జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 1998 మరియు 2017 మధ్య 1,66,000 మందికి పైగా ప్రజలు వేడి గాలల ఫలితంగా మరణించారు. 2015 నుంచి 2022 మధ్య మనదేశంలో 3,812 మంది హీట్ వేవ్ కారణంగా మరణించారని, ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే 2,419 మరణాలు సంభవించాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలైలో పార్లమెంటుకు తెలిపింది.