
జగిత్యాల సంజయ్ ఇంటి దగ్గర హైఓల్టేజి
కాంగ్రెస్ నేతలు, క్యాడర్ ఒక్కసారిగా మంగళవారం సంజయ్ ఇంటిమీదకు దూసుకుపోయారు
అనుకున్నట్లే జగిత్యాల బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ కుమార్ ఇంటి దగ్గర హైఓల్టేజి డ్రామా మొదలైంది. కాంగ్రెస్ నేతలు, క్యాడర్ ఒక్కసారిగా మంగళవారం సంజయ్ ఇంటిమీదకు దూసుకుపోయారు. అయితే చివరినిముషంలో పోలీసులు అందరినీ అడ్డుకున్నారు. ఫలితంగా పోలీసులు+సంజయ్(BRS defected MLA Sanjay Kumar) మద్దతుదారులకు-కాంగ్రెస్(T Congress leaders) శ్రేణులకు మధ్య పెద్ద గొడవ నడుస్తోంది. ఇంతటి గొడవకు దారితీసిన కారణం ఏమిటంటే మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలని ప్రయత్నిస్తున్న అభ్యర్ధులను ఖరారుచేయటం+బీఫారాల అందజేత.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయటానికి కాంగ్రెస్ నేతలు, క్యాడర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపుకు ఎవరిస్ధాయిలో వాళ్ళు అన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నారు. ఈనేపధ్యంలో టికెట్లు ఎవరికి వస్తుంది, బీఫారాలు ఎవరికి అందుతుంది అనే విషయంలో గొడవ మొదలైంది. కారణం ఏమిటంటే జగిత్యాల మున్సిపాలిటితో పాటు రాయికల్ మున్సిపాలిటిలో ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, అటు ఫిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ అభ్యర్ధుల ఎంపిక, బీఫారాల అందచేత అధికారం తమకే ఉండాలని ఎవరికి వారు పట్టుబట్టడమే.
ఈ నేపధ్యంలోనే జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య వివాదాన్ని సర్దుబాటు చేయటానికి పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జి మంత్రి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఇద్దరి మద్దతుదారులకు టికెట్లు, బీఫారాలు ఇచ్చేట్లుగా ఒప్పందం జరిగింది. జగిత్యాల్, రాయికల్ మున్సిపాలిటీల్లో కలిపి 62 మంది అభ్యర్ధులను కాంగ్రెస్ ఖరారుచేసింది. ఇందులో సంజయ్ వర్గానికి 36 టికెట్లు, జీవన్ వర్గానికి 26 టికెట్లను పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు. జగిత్యాల్ మున్సిపాలిటీలో 30, రాయికల్ మున్సిపాలిటీలో 6గురు అభ్యర్ధులను సంజయ్ మద్దతుదారులకు ఫైనల్ చేసి, బీఫారాలను కూడా పంపింది. అలాగే జగిత్యాల్ మున్సిపాలిటీలో 20, రాయికల్ మున్సిపాలిటీలో 6 మంది అభ్యర్ధులను జీవన్ చెప్పిన వారికే పార్టీ ఖరారు చేసి, బీఫారాలను పంపింది.
దీనివల్ల ఏమైందంటే జీవన్ రెడ్డి మీద సంజయ్ పై చేయి సాధించినట్లయ్యింది. దీంతో జీవన్ తో పాటు ఆయన మద్దతుదారులు భగ్గుమంటున్నారు. పోటీచేయాలని అనుకుంటున్న నేతల గెలుపు ఓటములతో పాటు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని చేయించిన ఫ్లాష్ సర్వే, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్గదర్శకాల ప్రకారమే అభ్యర్ధులను ఎంపిక చేసినట్లు మహేష్, మంత్రి చెప్పిన మాటలను జీవన్ పట్టించుకోవటంలేదు.
అందుకనే సంజయ్ ఇంటితో పాటు ఆయన ఆసుపత్రి మీదకు జీవన్ మద్దతుదారులు దాడికి ప్రయత్నించారు. దాంతో జిగిత్యాల లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. అలాగే కాంగ్రెస్ ఆఫీసు దగ్గర కూడా సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అభ్యర్ధుల ఎంపిక, బీఫారాల పంపిణీలో పంపకాల ప్రసక్తే లేదన్నారు. సంజయ్ తో కలిసి వాటాల బేరానికి తాను అంగీకరించేదిలేదని జీవన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వాటాలకు, పంపిణీలకు అంగీకరిస్తే మొదటినుండి కాంగ్రెస్ నే నమ్ముకున్న మద్దతుదారుల గొంతుకోసినట్లే అని జీవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజమైన కార్యకర్తలను పార్టీ బలిచేస్తోందంటు తీవ్రంగా మండిపోతున్నారు.
ఈ పరిస్ధితుల్లో జీవన్, సంజయ్ వర్గాలకు పంపిణీ చేసిన టికెట్లు, బీఫారాల ప్రకారం నామినేషన్లు దాఖలు అవుతాయా ? లేకపోతే జీవన్ వర్గం తనిష్టం వచ్చినట్లుగా అన్నీ వార్డుల్లోను నామినేషన్లు వేస్తారా ? అన్న విషయంలో ఉత్కంఠ పెరిగిపోతోంది.

