పిజ్జా అవుట్‌లెట్‌లలో పరిశుభ్రతేది?
x
తుప్పు పట్టిన పిజ్జా అవుట్ లెట్ యంత్రం : ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో వెల్లడి

పిజ్జా అవుట్‌లెట్‌లలో పరిశుభ్రతేది?

మీరు పిజ్జాకు ఆర్డరిస్తున్నారా? అయితే ఆగండి అంటున్నారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు...ఎందుకంటే...


తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి హడలెత్తించారు. యువతీ, యువకులు పిజ్జాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాంటి పిజ్జా తయారీలో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు.తెలంగాణ రాష్ట్రంలోని 55 పిజ్జా అవుట్ లెట్ లపై ఏకకాలంలో తెలంగాణ ఆహార భద్రతా విభాగం అధికారులు దాడులు చేసి అపరిశుభ్రపరిస్థితులను కనుగొన్నారు.


దాడులు ఏ ఏ ప్రాంతాల్లో చేశారంటే...
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏకకాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మూకుమ్మడి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్, గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు) రాష్ట్రవ్యాప్త తనిఖీల డ్రైవ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 55 పిజ్జా అవుట్‌లెట్‌లను తనిఖీ చేశారు. రాష్ట్రంలోని 18 పిజ్జా హట్ అవుట్‌లెట్‌లు,
16 డొమినోస్ అవుట్‌లెట్‌లు,21 ఇతర స్థానిక పిజ్జేరియాలు, బేకరీలపై అధికారులు దాడులు చేశారు.



ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో ఏం తేలిందంటే...

- పిజ్జా తయారీ కేంద్రాల్లో పలు లోపాలను పుడ్ సేఫ్టీ అధికారులు కనుగొన్నారు. అపరిశుభ్ర పరిస్థితుల మధ్య పిజ్జాలను చేస్తున్నారని తనిఖీల్లో వెలుగుచూసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎంఎస్ దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ కు చెందిన 8 పిజ్జా హట్ లలో వెజ్, నాన్ వెజ్ కలిపి ప్రిడ్జిలలో నిల్వ చేశారని తనిఖీల్లో తేలింది.
- హన్మకొండ జిల్లా కాజీపేటలో పిజ్జా హట్ లో అపరిశుభ్రమైనయంత్రాలు, పరికరాలు వాడుతున్నారని వెల్లడైంది. వరంగల్ నగరంలోని పిజ్జా హట్ లో పనిచేస్తున్న కార్మికులకు సరైన పరీక్షలు చేయకుండా వైద్యధృవపత్రాలు ఇచ్చారు.
- నిజామాబాద్ నగరంలోని పిజ్జా హట్ లో లైసెన్సు ప్రదర్శించలేదు. ఫ్రీజర్ ఉష్ణోగ్రత సరిగా లేదు. శుభ్రం చేయలేదు.నల్గొండ నగరంలోని పిజ్జా హట్ లో మూతలేని డస్ట్ బిన్లు కనిపించాయి. గడువుతేదీ లేని కాలం చెల్లిన సాస్ బాటిళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
- జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని డొమినోస్ పిజ్జాకు చెందిన పది అవుట్ లెట్లలో లైసెన్సులు ప్రదర్శించలేదు. నిజామాబాద్ డొమినోస్ పిజ్జా హౌస్ లో లైసెన్సు గడవు ముగిసింది. తెగులు నియంత్రణ చర్యలు లేవు. ఉద్యోగులు చేతి తొడుగులు, మాస్కులు ఉపయోగించలేదు.
- హన్మకొండ జిల్లాలోని సుబేదారిలోని డొమినోస్ పిజ్జా అవుట్ లెట్ లో యంత్రాలను శుభ్రం చేయలేదు.రికార్డులు లేవు. తెగులు నియంత్రణ చర్యలను రెన్యువల్ చేయలేదు. సిబ్బంది రికార్డులు కూడా లేవు.కాజీపేటలో పిజ్జా తయారీ కేంద్రంలో మురుగునీరు వాడుతున్నారని వెల్లడైంది.సుబేదారిలో పిజ్జా కాల్చే పరికరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. వరంగల్ అవుట్ లెట్ లో సిబ్బంది చేతి తొడుగులు, ముసుగులు ధరించలేదు.
- నిజమాబాద్ నగరంలోని డొమినోస్ పిజ్జా అవుట్ లెట్ లో లైసెన్సు గడవు ముగిసినా రెన్యువల్ చేయలేదు.సిబ్బంది వైద్య పరీక్షల రికార్డులు లేవు. మహబూబ్ నగర్ లో వెజ్, నాన్ వెజ్ విభజన లేదు.సిబ్బంది వైద్య రికార్డులు, తొడుగులు ధరించలేదు.
- హైదరాబాద్ నగరంలోని పిజ్జా ప్యారడైజ్ లో లైసెన్సు, వైద్య ధృవపత్రాలు లేవు. ఉపయోగించిన నూనె, లేబుల్ లేని పన్నీరు, బ్రెడ్, బంగాళాదుంపల చిప్స్, తప్పుపట్టిన ఓవెన్లు కనిపించాయి. మాస్టర్ వి బేకర్స్ లోనూ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదు.
- మెదక్ పట్టణంలోని పిజ్జాకార్నర్ లో కూరగాయలు పడేసి ఉన్నాయి. ఉపయోగించిన నూనెను పిజ్జా తయారీకి వాడుతున్నారు.హైదరాబాద్ నగరంలోని కోకాపేట, నార్సింగి ప్రాంతాల్లోని లా పినోజ్ పిజ్జా అవుట్ లెట్ లో యంత్రాలను శుభ్రం చేయలేదు.



పిజ్జా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశాలు

అపరిశుభ్రంగా ఉన్న పిజ్జాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు పడేశారు. పిజ్జాల శాంపిళ్లను సేకరించి ఫుడ్ ల్యాబోరేటరీకి పరీక్షకు పంపించారు. పిజ్జాల అవుట్ లెట్లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘనలను వెంటనే సరిదిద్దాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రతా చర్యలు పాటించని పిజ్జా అవుట్ లెట్లపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ చెప్పారు.


Read More
Next Story