తెలంగాణ కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందా?
x

తెలంగాణ కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందా?

రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ పెద్ద తప్పేచేసింది. జనాభారీత్యా కీలకమైన ఎస్సీల్లోని మాదిగలను పూర్తిగా విస్మరించింది.


రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ పెద్ద తప్పేచేసింది. జనాభారీత్యా అతిపెద్ద సామాజికవర్గాల్లో కీలకమైన ఎస్సీల్లోని మాదిగలను పూర్తిగా విస్మరించింది. ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. తెలంగాణా కాంగ్రెస్ చరిత్రలోనే మొదటిసారి ఇంతపెద్ద తప్పుచేసింది. దీనికి కారణాలను ఇపుడు వెతకటం కూడా అనవసరమే అయినా ఫలితం ఎలాగుండబోతోందనే విషయమే ఆసక్తిగా మారింది. ఎందుకంటే మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 14 చోట్ల అభ్యర్ధులను ప్రకటించేసింది, వాళ్ళు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మిగిలిన ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్ధుల ప్రకటనను పెండింగులో ఉంచింది. ఈ నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటీ బాగా ఎక్కువగా ఉండటంతో ఎవరిని ఎంపికచేయాలో అర్ధంకాక వాయిదాలు వేస్తోంది.

రాష్ట్రం ఏదైనా ఏ జిల్లా అయినా ఎస్సీల రిజర్వేషన్ ప్రకారం వారికి కేటాయించాల్సిన టికెట్లు ఇచ్చితీరాల్సిందే. అయితే ఎస్సీ అనేది విస్తృతమైన పదం. ఇందులో మాదిగలు, మాలలుంటారు. మళ్ళీ మాదిగలు, మాలల్లో ఉపకులలాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి ఎన్నిక ఏదైనా మాదిగలని, మాలలని, ఉపకులాలని జాగ్రత్తగా అభ్యర్ధులకు ఎంపికచేస్తుంటాయి పార్టీలు. రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి జనాభాలో కొన్ని ప్రాంతాల్లో మాదిగలు ఎక్కువగా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో మాలలు ఎక్కువగా ఉంటారు. ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణాలో మాదిగల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. నియోజకవర్గం, జిల్లాని తేడాలేకుండా మాలలతో పోల్చితే మాదిగలదే జనాభాలో డామినేషన్.

మాదిగల జనాభా ఎంత ?

తెలంగాణా మొత్తంమీద ఎస్సీలు సుమారు 95 లక్షలున్నారు. ఇందులో మాదిగలు 70 లక్షలుంటే మిగిలిన 25 లక్షలమంది మాలలు. జనాభా సంఖ్యను తీసుకుంటే మాలలకన్నా మాదిగల జనాభా ఎంతఎక్కువో తెలిసిపోతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన మాదిగలకు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు. సమైక్య రాష్ట్రంలో కావచ్చు లేదా ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత కూడా కావచ్చు తెలంగాణాలో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో మాదిగలకు ఒక్కసీటు కూడా కేటాయించకపోవటం ఇదే మొదటిసారి. జనాభా రీత్యా ఇంతపెద్ద సామాజికవర్గాన్ని విస్మరించటం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పనే చెప్పాలి. ఇంతపెద్ద తప్పును కాంగ్రెస్ పెద్దలు తెలిసి ఎందుకు చేశారో వాళ్ళే చెప్పాలి. మూడుపార్లమెంటు స్ధానాలు పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్లో మాలలకే కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. పెద్దపల్లిలో గడ్డం వంశీ, వరంగల్లో కడియం కావ్య, నాగర్ కర్నూలులో మల్లు రవి పోటీ చేస్తున్నారు.

ఇతర పార్టీలను తీసుకంటే బీఆర్ఎస్ మాదిగలకు రెండు టికెట్లిస్తే, బీజేపీ కూడా మాదిగలకు రెండు టికెట్లిచ్చింది. రెండుపార్టీలు కూడా పెద్దపల్లిలో మాత్రమే మాలలకు టికెట్లిచ్చాయి. జనాభా దామాషా ప్రకారం కాంగ్రెస్ కూడా ప్రతి ఎన్నికలోను మాదిగలకు రెండు టికెట్లిచ్చి, మాలలకు ఒక టికెట్ ఇస్తుండేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో కూడా కాంగ్రెస్ మాదిగలకు 10 టికెట్లిచ్చి, మాలలకు తొమ్మిది టికెట్లు కేటాయించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు పోటీచేయబోతున్న ముగ్గురు మాలఅభ్యర్ధులు కూడా ఆర్ధికంగా గట్టిస్ధితిలో ఉన్నవారే. మాదిగల్లోని అసంతృప్టి కారణంగా టికెట్ల విషయంలో అధిష్టానం పునరాలోచించే అవకాశముంది. అయితే అప్పుడేమవుతుందంటే రెండో తప్పుచేసినట్లవుతుంది. మాదిగలకు టికెట్ ఇవ్వకపోవటం మొదటితప్పని ఇంతకుముందే అనుకున్నాం. ఇపుడు మాల అభ్యర్ధిని మార్చి మాదిగలకు కేటాయిస్తే టికెట్ కోల్పోయిన మాలలు అంగీకరించరు. అప్పుడు మాలలు పార్టీకి ఎదురు తిరుగుతారు. అంటే అభ్యర్ధిని మార్చితే పార్టీ రెండో తప్పుచేసినట్లవుతుంది.

కాంగ్రెస్ తప్పుచేసింది

ఇదే విషయమై ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో ప్రజాసంఘాల ఛైర్మన్ గా చేసిన ప్రముఖ ఎస్సీ నేత గజ్జల కాంతం ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు మాదిగలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పెద్ద తప్పుచేసిందన్నారు. కాంగ్రెస్ చరిత్రలో తెలంగాణాలో మాదిగలకు టికెట్ కేటాయించకపోవటం ఇదే మొదటిసారన్నారు. అధిష్టానం నిర్ణయంపై మాదిగల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోతోందని చెప్పారు. ఈ విషయంపైనే రేవంత్ రెడ్డితో తాము భేటీ అయ్యామని చెప్పారు. ఏ కారణంతో మాదిగలకు టికెట్ కేటాయించలేకపోయిందనే విషయాన్ని రేవంత్ వివరించారన్నారు. భవిష్యత్తులో వచ్చే రాజ్యసభ, శాసనమండలి నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు గజ్జల చెప్పారు. బీజేపీకి మద్దతుగా ఉన్న కృష్ణ మాదిగ కారణంగానే కాంగ్రెస్ మాదిగలకు ఒక్క టికెట్ కూడా కేటాయించలేదన్న ప్రచారాన్ని తప్పుపట్టారు. కృష్ణ మాదిగ చెబితే బీజేపీకి ఓట్లేసే మాదిగలు లేరన్నారు. జరుగుతున్న ప్రచారమే నిజమైతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇంకా ఎక్కువ సీట్లొచ్చుండాలి లేదా ఓట్ల చీలికతో బీఆర్ఎస్ ఎక్కువసీట్లు గెలిచి అధికారానికి వచ్చుండాలని విశ్లేషించారు.

భరోసా ఇచ్చిన రేవంత్

విద్యార్ధిసంఘం నేత పిడమర్తి రవి మాట్లాడుతు గడ్డం, కడియం కుటుంబాలు కాంగ్రెస్ లోకి వచ్చేముందు ఇచ్చిన హామీల కారణంగానే వాళ్ళకి టికెట్లు కేటాయించాల్సొచ్చిందని రేవంత్ తమతో చెప్పినట్లు చెప్పారు. వరంగల్ సీటును మాదిగలకు డైరెక్టుగా కేటాయించకపోయినా మాదిగల్లోని ఉపకులమైన బైండ్లకు చెందిన కడియం కావ్యకు కేటాయించినట్లు రేవంత్ సమర్ధించుకోవటాన్ని తాము అంగీకరించలేదన్నారు. ఏదేమైనా మాదిగలకు టికెట్ కేటాయించకపోవటం అధిష్టానం చేసిన తప్పనే అన్నారు. మాదిగల్లోని అసంతృప్తిని చల్లార్చేందుకు, పార్టీఅభ్యర్ధల విజయానికి పార్లమెంటు నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టుకోబోతున్నట్లు రవి చెప్పారు. జరిగిన అన్యాయాన్ని భవిష్యత్తులో ఏ విధంగా భర్తీ చేయబోతున్నారనే విషయాన్ని రేవంత్ మాటగా తాము వివరించబోతున్నట్లు పిడమర్తి రవి చెప్పారు.

Read More
Next Story