నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి, ఆయన గురించి ఆరుదైన సత్యాలివి
x
పొట్టి శ్రీరాములు స్మారక తపాల బిళ్లు

నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి, ఆయన గురించి ఆరుదైన సత్యాలివి

’పట్టమని పదిమంది పొట్టి శ్రీరాముళ్ల వంటి మహావ్యక్తులు వుంటే, మన పవిత్ర భారతదేశానికి ఒక్క సంవత్సరం లోనే స్వాతంత్య్రం తెచ్చి పెట్టగలను ‘ అన్నారు గాంధీజీ


(కెసి కల్కూర)


అమర జీవి పొట్టి శ్రీరాములు అనగానే ఎక్కువ మందికి తోచేది ఆంధ్రరాష్ట్ర సాధనకోసం అసువులు బాసిన వ్యక్తి అని మాత్రమే. అంతకుముందు ఆయనకేమీ చరిత్రలేనట్లేనా. ఆత్మాహుతికి ముందు కూడా ఆయనకు మహోజ్వల జాతీయోద్యమ జీవితం ఉంది. శ్రీ రాములు ఆంధ్ర రాష్ట్రానికొరకై ఆత్మాహుతి చెసుకున్న డిసెంబర్ 15 వ తేదిని ఆయన పుణ్యతిథిగా ఆచరించడం ఆనవాయితి. ఈ సందర్బంగా ఆయన గురించి కొన్ని ముఖ్యమయిన విషయాలు తెలుసుకోవాలి.

ఆంధ్ర రాష్ట్రం కోసం ఎందుకు దీక్ష ప్రారంభించారు

గాంధీ ప్రియశిష్యులలో ఒకరైన శ్రీరాములకు స్వాతంత్య్రానంతరం రాజకీయోద్యమంలో చేరాలనే ఆసక్తి లేదు. అయితే, ఆంధ్ర ప్రాంతంలో ఏ పని జరగాలన్నా రాష్ట్రం లేకపోతే సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. కాబట్టి రాజకీయోద్యమం చేపట్టాలని, అయితే అది రాష్ట్రం ఏర్పాటు కోసమేనని ఆయన తెలిపారు.

మహాత్మా గాంధీతో పాటు దాదాపు రెండు దశాబ్దాలు తిరిగిన అనుభవం ఉన్నందున ఆయన అహింస సిద్ధాంతాన్ని బాగా విశ్వసించారు. అమరణ దీక్ష ఆయనకు కొత్త కాదు. పలుమార్లు ఆచరించి విజయం సాధించారు. రాష్ట్ర సాధణకు అలాంటి మరొక దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. (1952అక్టోబర్ 14వ తేదీన మద్రాసు పౌరులకు, ఇతరులకు పొట్టి శ్రీరాములు చేసిన విజ్ఞప్తిలో కొంత భాగం)

‘‘ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం విషయంలో ఆయన (నెహ్రూ) దృష్టికి రాగల వాతావరణాన్ని కల్పించి, ఆ పరిస్థితి నుంచి తప్పించుకొనే అవకాశం లేకుండా (చేయాలి). తనంతట తానుగా దేశం అంతటి క్షేమాన్ని ఆకాంక్షించి, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి పూనుకొనే పరిస్థితులను కల్పించవలసిన అవసరం కలుగుతున్నది. దీనిని సాధించటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి హింసాయుతము, రెండు అహింసాయుతము. అహింసలో నమ్మకం ఉన్నవారు తమకు ఏమీ పట్టనట్లు నిద్రబోతే, ఏమీ పని చేయకుండా కూర్చుంటే హింసా వాదులయినవారు పూనుకొని పరిష్కారం దుస్సాధ్యమైన పరిస్థితులను కల్పిస్తారు.’’

గాంధీ మార్గంలోకి ఎలా వచ్చారు?

శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం.

ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తండ్రి గురువయ్య అకాల మరణముతొ, తల్లి మహాలక్ష్మమ్మ,అప్పడాలు, ఒడియాలు, ఉరగాయి, బజ్జిలు, పకోడిలు చెసి అమ్ముతూ, కొడుకుని పెంచింది, పోషించింది, విద్యావంతుణ్ని చేసింది.

తరువాత బొంబాయిలో గ్రేట్ పెనిన్స్యులార్ రేల్వేలో చేరి నాలుగేళ్లు ఉద్యోగం చేశాడు. అతని జీతం నెలకు 250 రూపాయలు. 1927 లొ శ్రీరాములు ఇంజనీర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ‘సీతమ్మ’తో వివాహం జరిగింది. రెండు సంవత్సరాలలోపే పురుటి బిడ్డతో సహా భార్య, ఆపైన ఆరు నెలలలో తల్లి మరణించటంతో ఆయన ఒంటరి అయ్యారు. జీవితంపై విరక్తిచెందిన శ్రీరాములు ఉద్యోగాన్ని వదిలేశాడు. శాంతికాముకుడుగా మారాలనుకున్నుడు. తన శేషజీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయదలచుకున్నాడు, సబర్మతి ఆశ్రయం చేరుకొని గాంధీజీ అనుచరుడుగా మారారు. తన ఆస్తిపాస్తులను అన్నదమ్ములకు పంచి పెట్టారు.

గాంధీజీకి ఎలా దగ్గిరయ్యారు

గాంధీజీ పూరించిన స్వాతంత్య్రోద్యమ శంఖారావానికి ప్రభావితుడై, శ్రీరాములు గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుండి జాతీయోద్యమంలోకి వచ్చాడు. ఆశ్రమంలో ఆయన ప్రధాన సభ్యు డు. గాంధీ ఎంపిక చేసుకున్న కొద్దిమంది సర్వోదయ సేవకులలో అగ్రగణ్యుడు. పదకొండు సంవత్సరాలు నియమబద్ధ ఆశ్రమ జీవితం గడిపారు. సహాయ నిరాకరణోద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని మూడు సార్లు కారాగార శిక్షలు కూడా అనుభవించాడు. గాంధీజీ ప్రశంసలందుకున్నారు. 1941-1942 సంవత్సరాల సత్యాగ్రహం, ‘క్విట్ ఇండియా’ ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.

మురికి వాడల పారిశుద్ధ్యం, హరిజనుల ఆలయ ప్రవేశం, ఖాదీ పరిశ్రమ, పతిత జనోద్దరణ కు సంబంధించి ఆంధ్ర, గుజరాత్‌ ప్రాంతాలలో ప్రముఖ కార్యకర్తగా శ్రీరాములు చేసిన సంఘసేవ అపారమైనది.

శ్రీరాములు గురించి గాంధీజీ ఏమన్నారు

1944లో నెల్లూరు కేంద్రంగా ఖద్దరు ఉత్పత్తి, వ్యాప్తి కార్యక్రమాల్లో తీవ్రంగా కృషి చేశారు. మండుటెండల్లో చెప్పులు, గొడుగు లేకుండా జాతీయోద్యమాన్ని చాటి ప్రచారం చేసేవారు. దీన్ని చూసి ఆయన్నిచాలా మంది “పిచ్చి శ్రీరాములు” అనేవారు. ’పట్టుమని పదిమంది పొట్టి శ్రీరాములు వంటి మహావ్యక్తులు వుంటే, మన పవిత్ర భారతదేశానికి ఒక్క సంవత్సరం లోనే స్వాతంత్య్రం తెచ్చి పెట్టగలను ‘ అన్నారు గాంధీజీ.

గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానం. అయితే, అతని ‘మంకుతనం’ మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. 1946 నవంబరు 25న ఆయన మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు.

కొద్ది రోజుల్లోనే స్వాంతంత్య్రం రావచ్చునన్న ఆశాభావం కాంగ్రెసు నాయకుల్లో ఉంది. ఇలాంటపుడు ఈ ఆమరణ దీక్ష ఏమిటి అనుకున్నారు. దీక్ష మానుకోవాలని అంతా కోరారు. మంకు శ్రీరాములు వినలేదు.అంతా గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు.

అప్పుడు మహాత్మా గాంధీ టంగుటూరి ప్రకాశంకు ఇలా వ్రాశాడు – “హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపాడు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి (eccentric)”.

కాని, దురదృష్టమేమిటంటే, 1952లో శ్రీరాములు ఆమరణ దీక్ష చేస్తానని మొండికేసినపుడు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేడు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్నకమిట్ మెంట్ వల్ల ఈ సారిగాంధీజీ మాట కూడా విని ఉండేవాడు కాదేమో.

హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని రాసిన అట్టలను మెడకు తగిలించుకుని ప్రచారం చేశారు.1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన దీక్ష ఫలితంగా హరిజనులు ఆలయంలో ప్రవేశింపగలిగారు. ఆ సంవత్సరంలోనే మద్రాసు ప్రభుత్వంచే హరిజనుల ఆలయప్రవేశం, హరిజనోద్ధరణకు సంబంధించిన రెండు శాసనాలను ఆమోదింప చేసేందుకు 23 రోజుల నిరశన దీక్ష చేశారు.

మూడో మారు వార్థాలో 1948లో నిరాహార దీక్ష 29 రోజులు సాగించారు. హరిజనులకు ఆలయప్రవేశం మీద చట్టం తేవాలన్నది డిమాండ్. ఈ సారి ప్రధాని నెహ్రూ స్పందించారు. సంవత్సరానికొక రోజు హరిజన దినోత్సవం పాటిస్తామని, హరిజన సంక్షేమ నిధి కోసం కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపు జరపగలమనీ ప్రకటించడంతో శ్రీరాములు దీక్ష విరమించారు.

ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష...

సర్వోదయ నాయకులు స్వామి సీతారాం ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కోసం ప్రాయోపవేశ దీక్షకు ఉపక్రమించారు. కేంద్ర నాయకుల హామీలతో ఆయన దీక్ష విరమించిన తరువాత ఎంతకాలానికీ రాష్ట్ర నిర్మాణం జరగక పోవటంతో ఆంధ్రులలో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. అపుడు శ్రీరాములు రంగప్రవేశం చేశారు. ఆంధ్ర రాష్ట్రా వతరణకై 1952 అక్టోబర్‌ 19న మద్రాస్ లొ శ్రీబులుసు సాంబమూర్తిగారి గృహంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.

రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీరాములు కఠోర నిరాహార దీక్ష వల్ల ఆరోగ్యం క్షీణించసాగింది. కండరా లన్నీ కరిగి, శరీరం శల్యమై, గుండెల్లో రక్త ఉత్పాదనా శక్తి ప్రతినిమిషం క్షీణిస్తూ ఒక్కొక్క అవయవం వశం తప్పుతుండ టంతో ఆయన ఆరోగ్య పరిస్థితికి యావ దాంధ్ర దేశం ఆందోళన చెంది “ఆంధ్ర రాష్ట్రం ఇవ్వండి! శ్రీరాములు ప్రాణాలు కాపాడండి” అంటూ నినాదాలు చేశారు.

ప్రముఖ ఆంధ్ర నాయకులు దీక్ష విరమించమని శ్రీరాములును కోరినా తన ఆత్మార్పణ తోనైనా ఆంధ్రరాష్ట్రం రావాలంటూ దీక్ష విరమించడానికి అంగీకరించలేదు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణస్తూ ఉన్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకాలేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబరు 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవాడు.

అంతిమ ఘడియలు

ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తా పత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతుండేది. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహారదీక్షకు కూర్చునేముందే ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయరసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్నికొన్ని సందర్భాల్లో నెత్తురుపడ్డది.

స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన వ్యతిరేకించారు. ఈ సన్నివేశాన్ని ప్రకాశం తన ఆత్మకథ, “నా జీవిత యాత్ర”లో ఇలా చెప్పారు. “శ్రీరాములుగారి నిర్దుష్టమైన ఉపవాస దీక్ష రోజు రోజుకు, ఆంధ్రుల హృదయాలలొ ఆందోళన కలిగించసాగింది. ప్రజల భావాలలొ ఒక వేడిని పుట్టించింది. ప్రకృతి అనుకొనటువంటి ఉష్ణతను ధరించింది. కార్మికులలొనూ, విద్యార్థిలలోనూ, ఆంధ్రరాష్ట్ర విషయమైగాక, శ్రీరాములుగారి, ప్రాణ విషయమై చాలా మనస్థాపం కలిగింది.”

డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు.

ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచారు. అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 54 పౌనుల (24.5 కేజీలు) బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణితో మాట్లాడలేకపోయినా, చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు.

( కె చంద్రశేఖర్ కల్కూర కర్నూలులో న్యాయవాది, తెలుగు పాలనా భాషా ఉద్యమకారుడు)

Read More
Next Story