కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం
x

కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం

కాంగ్రెస్ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి, ముఠా తగాదాలను నియంత్రించి రాష్ట్రస్థాయి నాయకులను ఒక్కతాటిపైకి తీసుకురావటం, పొత్తులు విచ్ఛిన్నం కాకుండా చూసుకోవటం మొదలైనవి.


ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈ సంవత్సరమే అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మహారాష్ట్ర, జార్ఘండ్, హర్యానా రాష్ట్రాలలో మంచి ఫలితాలను సాధిస్తామని ఆశాభావంతో ఉంది.

కాంగ్రెస్ హైకమాండ్ ఈ మూడు రాష్ట్రాల పార్టీ నాయకులతో గతవారం విడివిడిగా ప్రాధమిక చర్చలు జరిపి లోక్‌సభ ఫలితాలను సమీక్షించటంతోపాటు, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంతనాలు జరిపింది.

ఈ మూడు రాష్ట్రాలలో పార్టీలో తీవ్రంగా ఉన్న ముఠా తగాదాలపై అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధి నాయకులతో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు ది ఫెడరల్‌కు తెలిపాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సీట్ల పంపిణీపై ఇండియా కూటమి జరుపబోయే చర్చలలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు అడగాలని జార్ఖండ్, మహారాష్ట్రలకు చెందిన అత్యుత్సాహపరులైన కొందరు నాయకులు హైకమాండ్‌కు సూచించగా, ప్రస్తుత కూటమిని అస్థిరపరిచే ఏ చర్యలకూ పాల్పడబోమని ఖరాఖండిగా వారికి స్పష్టీకరించినట్లు తెలుస్తోంది.

ఈ మూడు రాష్ట్రాలలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పని తీరు కొంత సానుకూలంగా, మరికొంత వ్యతిరేకంగా ఉంది. మహారాష్ట్రలో మిత్రపక్షాల బలంవల్లగానీ, తమపార్టీ నిలబెట్టిన అద్భుతమైన అభ్యర్థులవల్లగానీ, పోటీ చేసిన 17 సీట్లలో 13 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. కూటమిలోని ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వరసగా తొమ్మిది, ఎనిమిది సీట్లు గెలుచుకున్నాయి. సాంగ్లినుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విశాల్ పాటిల్ ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు.

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలోకంటే ఎక్కువగా 47% ఓట్లశాతం సాధించింది, రాష్ట్రంలోని మొత్తం 10 సీట్లలో 5 సీట్లను గెలుచుకుంది. మిగిలిన ఐదు సీట్లలో, పొత్తులో భాగంగా ఆప్‌కు ఇచ్చిన కురుక్షేత్ర స్థానంతో సహా, బీజేపీ విజయం సాధించింది.

జార్ఖండ్‌లో హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జేఎమ్ఎమ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పోటీ చేసిన 7 స్థానాలలో రెండింటిని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది, జేఎమ్ఎమ్ మూడు సీట్లు గెలుచుకుంది. బీజేపీ 8 స్థానాలలో విజయం సాధించింది.

ఈ మూడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి, కాంగ్రెస్ సంస్కృతిలో భాగమైన ముఠా తగాదాలను నియంత్రించి రాష్ట్రస్థాయి నాయకులను ఒక్కతాటిపైకి తీసుకురావటం, ప్రస్తుతం ఉన్న పొత్తులు విచ్ఛిన్నం కాకుండా చూసుకోవటం, ముఖ్యంగా ఎన్నికల వ్యూహంలో ప్రత్యర్థి బీజేపీని తెలివైన ఎత్తులతో చిత్తు చేయటం మొదలైనవి.

ఉదాశీనత తగదని హెచ్చరిక

మహారాష్ట్రలో ఓటర్ల చేతిలో గట్టి ఎదురుదెబ్బ తిన్న అధికార కూటమిలోని ఏకనాథ్ షిండే శివసేన, అజిత్ పవాన్ ఎన్‌‍సీపీ ఇప్పటికే పునరుజ్జీవంకోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానిలో భాగంగానే గత శుక్రవారం ప్రవేశపెట్టిన ప్రజాకర్షక బడ్జెట్‌లో మహిళలకు, రైతులకు, ఇతర బృందాలకు అనేక నగదు పంపిణీ, పథకాలు ప్రవేశపెట్టారు.

హర్యానా, మహారాష్ట్రలలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకున్నట్లు ఇటీవలి పార్లమెంట్ ఎన్నికలతో స్పష్టమైనప్పటికీ, ఉదాశీనతతో వ్యవహరించకూడదని, కలిసికట్టుగా పోరాడాలని హైకమాండ్ ఆ రాష్ట్రాల నాయకులకు సూచించినట్లు సమీక్షా సమావేశాలలో పాల్గొన్న ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ది ఫెడరల్‌కు చెప్పారు.

పార్టీ క్రమశిక్షణను ఎవరైనా ఉల్లంఘిస్తే మిగిలిన పార్టీ నాయకులకు హెచ్చరికలాగా ఉండేటట్లు తీవ్ర చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రమేష్ చెన్నితాలాకు స్పష్టంగా చెప్పినట్లు ఆ నాయకుడు వెల్లడించారు. అదే విధంగా హర్యానా నాయకులు తమ ఫిర్యాదులతో మీడియాకు ఎక్కటాన్ని మానుకుని, తమ సమస్యలను అంతర్గతంగా చర్చించాలని, లేదంటే ఖచ్చితమైన క్రమశక్షణ చర్యలు ఉంటాయని కూడా రాహుల్ చెప్పినట్లు తెలిపారు.

హర్యానాలో పార్టీలో చీలిక

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ రెండు శిబిరాలుగా నిట్టనిలువుగా చీలిపోయిఉంది. ఒక శిబిరానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భూపీందర్ సింగ్ హూడా నాయకత్వం వహిస్తుండగా, రెండో శిబిరంలో సిర్సా ఎంపీ కుమారి సెల్జా, రాజ్యసభ ఎంపీ రణదీప్ సుర్జేవాలా, కేంద్ర మాజీమంత్రి బీరేంద్ర సింగ్, ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసిన అజయ్ సింగ్ యాదవ్ ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినా కాంగ్రెస్‌కు హర్యానాలో పరిస్థితి సాఫీగా ఉండేటట్లు లేదు. జూన్ 4న ఫలితాలు రాగానే, పార్టీ సీనియర్ నాయకుడు, హూడా వ్యతిరేకిగా పేరున్న తోషమ్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలో చేరారు. ఆమె పార్టీని వీడతారని ఎన్నో నెలలుగా అనుకున్నప్పటికీ, ఇప్పుడు బీజేపీలో చేరటంతో హర్యానా కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. జాట్ వర్గానికి చెందిన కిరణ్ చౌదరి దివంగత ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కోడలు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీని ఒక వ్యక్తి తనకు ఇష్టమొచ్చినట్లు నడిపిస్తున్నారన్న కిరణ్ ఆరోపణను సెల్జా, సుర్జెవాలా సమర్థించారు.

రాష్ట్ర పీసీసీలలో అంతర్గత కుమ్ములాటలు

అంతర్గత కుమ్ములాటలు హర్యానా పీసీసీకే పరిమితంకాలేదు. మహారాష్ట్ర, జార్ఖండ్ సమీక్షా సమావేశాలలో కూడా ఈ కుమ్ములాటల అంశంపైనే ప్రధానంగా చర్చ జరగింది.

మహారాష్ట్ర సమీక్షా సమావేశంలో ఒక పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడతామని మల్లికార్జున ఖర్గేకు హామీ ఇస్తున్నామని చెప్పగా, ముంబై నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్‌ను తొలగించమని కొందరు, కొనసాగించాలని కొందరు కోరుతున్నారని, అలాగే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్‌ను తొలగించమని కొందరు, కొనసాగించమని కొందరు డిమాండ్ చేస్తున్నారని, తన దగ్గరకు అనేక ప్రతినిధి బృందాలు వస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కలిసికట్టుగా పోరాడతామని ఎలా చెబుతారని తిరిగి ప్రశ్నించారు.

జార్ఖండ్‌లో ఆందోళనకర సంకేతాలు

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు మూడింటిలోకీ, జార్ఖండ్‌లో ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు తక్కువగా ఉందని చెప్పాలి. అక్కడ సీనియర్ నాయకులందరూ ముక్తకంఠంతో చేస్తున్న డిమాండ్ ఏమిటంటే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేష్ ఠాకూర్‌ను తొలగించాలి అని. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఏడు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో నలుగురు ఠాకూర్‌ వలన ఏమీ ఉపయోగం లేదు అని, ప్రచారంలో, ఎన్నికల వ్యూహాలలో అతను ఏమీ సాయపడలేకపోయాడని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల ధోరణే కొనసాగింతే మొత్తం 81 అసెంబ్లీ స్థానాలలో కూడా జేఎమ్ఎమ్, ఆర్జేడీ కూటమి చావు దెబ్బ తింటుందని మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఖర్గేకు చెప్పారు.

మరోవైపు, జార్ఖండ్‌లో కాంగ్రెస్ గెలుచుకున్న ఐదు స్థానాలు కేవలం ఎస్‌టీవి కావటం, బీజేపీ గెలుచుకున్న స్థానాలు ఎనిమిదీ జనరల్ క్యాటగిరీవి కావటం హైకమాండ్‌కు ఆందోళన కలుగజేస్తోంది. ఎస్‌టీలనే కాకుండా అన్నికులాలనూ, ముఖ్యంగా బీసీలను ఆకట్టుకోవటానికి ప్రయత్నించాలని భావిస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌కు ఊరట కలిగించే అంశం ఒక్కటి ఏమిటంటే, జార్ఖండ్‌లో పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచే పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చే ఆనవాయితీ.

ప్రజలకు చేరువవ్వటమే వ్యూహం

సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు చేరువవ్వాలని ఈ మూడు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని, అలాగే కూటమిలోని మిత్రపక్షాలతో సీట్ల పంపిణీపై చర్చలు కూడా సమాంతరంగా సాగుతాయని నాయకులకు తెలిపారు.

జార్ఖండ్‌లో కాంగ్రెస్ 33 స్థానాలలో పోటీ చేయాలనుకుంటోందని ఆ పార్టీ ఇన్ ఛార్జ్ గులామ్ అహ్మద్ మీర్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలలో, తమ పార్టీ అధికశాతం సీట్లు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఉద్ధవ్ థాక్రేకు జనంలో సానుభూతి బాగుందని తెలియటంతో ఆయన సారథ్యంలోనే ప్రచారం సాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

హర్యానాలో పొత్తులు ఉండవు

90 స్థానాలు ఉన్న హర్యానాలో ఓం ప్రకాష్ చౌతాలాకు చెందిన ఐఎన్‌ఎల్‌డీ, దుష్యంత్ చౌతాలాకు చెందిన జేజేపీ వంటి స్థానిక పార్టీలతో పొత్తులు పెట్టుకోవలసిన అవసరంలేదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు. అయితే మహారాష్ట్ర, హర్యానాలకు సంబంధించి కాంగ్రెస్‌కు ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటంటే, యూపీలో ఆ పార్టీతో పొత్తులో ఉన్న సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించాలని కోరటం. సమాజ్‌వాది పార్టీ మహారాష్ట్ర శాఖ నాయకుడు, ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ పార్టీకి కనీసం 10 స్థానాలను కూటమి కేటాయించాలని, లేదంటే తాము సొంతంగా అభ్యర్థులను నిలబెడతామని హెచ్చరించారు.

Read More
Next Story