గొర్రెల పంపిణీలో రూ.700కోట్ల గోల్‌మాల్ ఎలా జరిగిందంటే...
x
గొర్రెల పంపిణీ పథకం అక్రమాలపై ఏసీబీ విచారణ

గొర్రెల పంపిణీలో రూ.700కోట్ల గోల్‌మాల్ ఎలా జరిగిందంటే...

తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం అమలులో రూ.700కోట్ల అక్రమాలు జరిగాయని ఏసీబీ దర్యాప్తులో తేలింది. కమీషన్లు దండుకోవడంతోపాటు గొర్రెలివ్వకుండానే బిల్లులు డ్రా చేశారు.


గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో గొల్లకురుమలకు చేసిన గొర్రెల పంపిణీలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తులో తేలింది.

- కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా కొన్ని పనలు నిరర్ధకమయ్యాయని, దీనివల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని సాక్షాత్తూ కాగ్ నివేదిక తేల్చిచెప్పింది.
- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగినందునే మేడిగడ్డ డ్యాం దెబ్బతిందని తేలింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపి, నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ అక్రమాలపై న్యాయవిచారణ కూడా కొనసాగుతోంది.
-తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంలో పలువురు పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉందని తేలింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన పలువురిని పోలీసులు అరెస్టులు కూడా చేశారు.
- దళిత బంధు పథకం అమలులో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ సాగుతోంది.

కాగితాల్లోనే గొర్రెల పంపిణీ
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గొర్రెలు కొనకుండానే కొన్నట్లు, లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు కాగితాలపైనే లావాదేవీలు సృష్టించి రూ.2.10కోట్లను గోల్ మాల్ చేశారని ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. గొర్రెల పథకం బిల్లుల చెల్లింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని ఏసీబీ దర్యాప్తులో వెలుగుచూసింది.

అవినీతి అధికారుల అరెస్ట్
తెలంగాణ స్టేట్‌ లైవ్‌స్టాక్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ సీఈవో సబావత్‌ రాంచందర్‌ నాయక్‌ను, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్టు చేశారు. గతంలో ఈ నిధుల గోల్ మాల్ కేసులో పదిమందిని అరెస్ట్ చేశారు.

గొర్రెల యూనిట్ దర పెంపుతో అక్రమాలు
తెలంగాణ పశుసంవర్థకశాఖ అధికారులు, బ్రోకర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రభుత్వ నిధులను స్వాహా చేశారు.తొలుత గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించినపుడు యూనిట్‌ ధర రూ.1.25 లక్షలు ఉండేది.రెండో విడతకు వచ్చేసరికి యూనిట్‌ ధరను రూ.1.75 లక్షలకు పెంచారు. గొర్రెల ధర పెరిగిందని, ఇతర రాష్ట్రాల్లో గొర్రెలు దొరకడం లేదనే సాకులు చూపిస్తూ ప్రభుత్వానికి తప్పుడు ప్రతిపాదనలు పంపించారు.అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదించింది.గొర్రెల యూనిట్‌ ధరను రూ.50 వేలు పెంచింది. దీనిని ఆసరాగా చేసుకొని పశుసంవర్థకశాఖ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ దర్యాప్తులో తేలింది.

యూనిట్ కు రూ.20వేల లంచం
ఒక ప్రైవేటు కంపెనీ ఎండీ మొహిదొద్దీన్‌తో గొర్రెలు సరఫరాచేసేందుకు కాంట్రాక్టు మాట్లాడుకున్నారు. అందుకు ప్రతిఫలంగా సదరు బ్రోకర్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించారు.ఒక్కో యూనిట్ కు రూ.20వేలు చొప్పున పశుసంవర్ధక శాఖ అధికారులు లంచం తీసుకున్నారు. గొర్రెల పంపిణీ పథకం బిల్లుల చెల్లింపుల్లో రూ.700కోట్ల అక్రమాలు జరిగాయని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో వెల్లడైంది.

రూ.2.10కోట్ల దారి మళ్లింపు
పల్నాడు, ప్రకాశం, గుంటూరు ప్రాంతాల్లోని 18 మంది రైతుల నుంచి 133 యూనిట్ల కింద 2,793 గొర్రెలు సేకరించారు. బిల్లులు చెల్లింపు జరిపేందుకు రైతుల బ్యాంకు ఖాతాలు,ఆధార్‌ కార్డులు ఇతర పత్రాలను ప్రభుత్వ అధికారులు తీసుకున్నారు. గొర్రెలు కొనుగోలు చేసినవారి ఖాతాల్లో కాకుండా ప్రైవేటు వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2.10 కోట్లు మళ్లించారు.గొర్రెలు విక్రయించిన డబ్బులు రాకపోవటంతో ఏపీ రైతులు ఆందోళనకు గురయ్యారు.కాంట్రాక్టర్‌ వెళ్లి గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు- 406, 409, 420 ప్రకారం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కుంభకోణంలో పెద్దల పాత్ర ఉందా?
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన రూ.700కోట్ల అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. నిధుల గోల్‌మాల్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. ఈ పథకం అమలులో జరిగిన అక్రమాల్లో పెద్దల పాత్ర ఉందని దీనిపై విచారణ జరపాలని రేవంత్ సర్కారు ఏసీబీ అధికారులను ఆదేశించింది.


Read More
Next Story