చిప్ మేకింగ్: ఇండియా చతికిల పడిందెక్కడ?
ఇది కనుక్కోవాలంటే చైనా హువావే సక్సెస్ స్టోరీని చదవాల్సిందే.
దేశంలో సెమీ కండక్టర్ ప్లాంట్‌లు పెట్టాలనుకునే స్వదేశీ, విదేశీ ఇన్‌వెస్టర్లకు 10 బిలియన్ డాలర్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీలను ఇస్తామని ముందుకొచ్చాయి. కొన్ని ప్రాజెక్టులు ప్రకటించబడ్డాయి, కొన్ని ముందుకెళ్ళాయి, మిగిలినవి చతికిలబడ్డాయి. అయితే దేశీయంగా సొంతంగా చిప్‌లను తయారుచేసే సామర్థ్యాన్ని సాధించటం అనే లక్ష్యాన్ని మాత్రం ఎవరూ చేరుకోలేకపోయారు.
ఎందుకు భారత్ సొంతంగా చిప్‌లను తయారుచేయాలి
అసలు భారతదేశం చిప్ తయారీ పరిశ్రమను ఎందుకు కలిగిఉండాలన్నది మొదటి ప్రశ్న. ఇంటెల్, ఎన్‌విడియా, బ్రాడ్‌కామ్, క్వాల్‌కామ్, ఏఎమ్‌డీ, ఇన్ఫినియాన్, శాంసంగ్, ఎస్‌కే హైనిక్స్ వంటి ప్రముఖ చిప్ తయారీ కంపెనీలనుంచి చిప్‌లను ఎందుకు కొనుగోలు చేయకూడదు? ఇప్పటికే కనుగొనబడిఉండి, అందుబాటులో ఉండి, పెద్ద ఎత్తున అమ్మటానికి అమ్మకందారులు పోటీ పడుతుంటే, అదే వస్తువును కనుగొనటానికి ప్రయత్నించాల్సిన అవసరం ఏముంది?
దానికి ఒకటే సమర్థనీయమైన కారణం ఉంది: రక్షణ పరమైన స్వయం సమృద్ధి. భారతదేశం ఏ సైనిక కూటమిలోనూ భాగస్వామి కాదు. నాటో కూటమిలోని సభ్యులైన జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలను కాపాడటానికి, తమ సైన్యాన్ని, ఆయుధాలను పంపటానికి అమెరికా వచ్చినట్లుగా భారత్ రక్షణకు ఏ పెద్దన్న కూడా పరిగెత్తుకుంటూ రాడు. భారతదేశం తనపైన, తన శక్తిసామర్థ్యాల పైన, అంతర్జాతీయంగా తన స్థాయిని, సంబంధాలను నిలబెట్టుకునే ఎత్తుగడలపైన, దేశీయంగా ఇక్కడ తయారయ్యే, విదేశాలు సరఫరా చేసే ఆయుధాలపైన ప్రస్తుతం ఆధారపడుతోంది.
మామూలు పరిస్థితుల్లో, భారతదేశం ప్రస్తుతం తన రక్షణ అవసరాలకోసం, కీలకమైన మౌలిక వసతుల కల్పనకోసం విడిభాగాలు కొనుగోలు చేయటానికి ఎలాంటి సమస్యా లేదు. కానీ, ఈ కొనుగోళ్ళు వీలుకాని పరిస్థితులు వచ్చే అవకాశం లేకపోలేదు.
హువావేపై ఆంక్షలు
హువావే (Huawei) అనేది చైనాలోని ఒక ప్రముఖ టెలికామ్ పరికరాల తయారీ సంస్థ. అమెరికా టెక్నాలజీతో రూపొందిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను హువావే ఉపయోగించకూడదంటూ అమెరికా ఆంక్షలు విధించిన 2010 సంవత్సరందాకా ఆ సంస్థ బ్రహ్మాండంగా సాగిపోతోంది. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించిందని, పశ్చిమదేశాలలో ఉన్న తమ నెట్‌వర్క్‌లద్వారా ఆ దేశాల టెలికామ్ ట్రాఫిక్‌పై గూఢచర్యం చేయటానికి చైనా ప్రభుత్వానికి అవకాశం కల్పించిందని హువావేపై అమెరికా ఆరోపణలు చేసింది.
హువావే సంస్థ పరికరాలను కొనుగోలు చేయకుండేలా, వాడకుండా ఉండేలా అమెరికా తన మిత్రదేశాలను ఒప్పించింది. ఏండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను, అడ్వాన్స్‌డ్ చిప్ సెట్లను హువావేకు ఇవ్వవద్దని అమెరికా ఆంక్షలు విధించటంతో ఆ సంస్థకు బాగా నష్టం జరిగింది. సంస్థ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్‌ఫేయ్ కూతురు, సంస్థ చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్ అయిన మెంగ్ వాన్‌ఝోను కెనడాలో అరెస్ట్ చేశారు, ఆమె 30 నెలలుగా అక్కడ జైలులోనే ఉంది, అమెరికాకు అప్పగింతపై కేసు కోర్టులో ఉంది.
సొంతంగా రీసెర్చ్, డెవలెప్‌మెంట్‌పై మరింత కృషిచేయటంద్వారా ఈ సమస్యను అధిగమించటానికి హువావే ప్రయత్నిస్తోంది. అమెరికా ఆంక్షలు విధించటంవలన కోల్పోయిన టెక్నాలజీలు, పరికరాలను చైనాలోనే తయారుచేసుకోవటానికి, తయారుచేసే సంస్థలలో వాటా కొనుగోలు చేయటానికి ఒక నిధిని ఏర్పాటు చేసింది.
తట్టుకుని నిలబడింది
అమెరికా ఆంక్షలవలన మూడు లేదా ఐదు నానో మీటర్ సర్క్యూట్‌లతో కూడిన అత్యాధునిక తరం చిప్‌లను హువావేకు అందుబాటులో లేవు. అయితే చైనాలో విపరీతంగా అమ్ముడుపోతూ మంచి మార్కెట్ షేర్ దక్కించుకుంటున్న తమ స్మార్ట్ ఫోన్లలో హువావే ఇప్పుడు ఏడు నానో మీటర్‌ల చిప్‌లను వినియోగిస్తోంది. ఏండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థానంలో తమ సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను, ఆరకిల్ ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ స్థానంలో తమ సొంత ఈఆర్‌పీని తయారుచేసుకుంది. తమ క్లౌడ్ స్టోరేజిని విస్తరింపజేసుకుంది. తమ సంస్థకు పనికొచ్చే విడిభాగాలను తయారుచేసే చైనీస్ కంపెనీలలో వాటాలు కొనుగోలు చేస్తోంది.
చైనానుగానీ, చైనా తరహా పెట్టుబడిదారీ విధానాన్నిగానీ ఇష్టపడని ఎకనామిస్ట్ పత్రిక హువావే అంశంపై వ్యాఖ్యానిస్తూ, ఆ సంస్థ ఈ వ్యూహాన్ని అనుసరించటానికి కారణం మార్కెట్‌లోని తప్పనిసరి పరిస్థితులని పేర్కొంది. హువావేను నిర్వీర్యం చేయాలన్న అమెరికా ప్రయత్నాన్ని ఆ సంస్థ విజయవంతంగా అధిగమించిందని, ఇప్పుడు మరింత శక్తిమంతంగా తయారయిందని ప్రశంసించింది. గతంలో ఎప్పటినుంచో తయారుచేస్తున్న ఉత్పత్తులనే కాకుండా కొత్త కొత్త ఉత్పత్తుల తయారీలోకి విస్తరించింది. చైనాలోనే కాకుండా ఆసియా, ఆఫ్రికా దేశాలలో కూడా మార్కెట్‌ను బాగా పెంచుకుంది.
హువావే నుంచి భారత్ నేర్చుకోగలదా?
అమెరికా విధించిన ఆంక్షలతో జరిగిన నష్టాన్ని హువావే విజయవంతంగా అధిగమించటాన్ని గమనిస్తే, టెక్నాలజీలో స్వావలంబన సాధించటం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. దేశీయంగా మానవ వనరులు, ఆర్థిక వనరులను ఆర్ అండ్ డీకి సక్రమంగా వినియోగించుకోగలిగితే విదేశాలపైన ఆధారపడవలసిన అవసరం కలగదని కూడా అర్థమవుతోంది. హువావేకి ఉన్న మొత్తం ఉద్యోగులలో సగంమంది, 1,14,000 మంది ఉద్యోగులు ఆర్ అండ్ డీ విభాగంలో ఉన్నారని, ఆ విభాగానికి 20 బిలియన్ డాలర్లకుపైగా ఖర్చుపెడుతోందని ఎకనామిస్ట్ పత్రిక రాసింది.
భారతదేశం ఆ వ్యూహాన్ని అమలుచేయగలదా? శామ్ పిట్రోడా సీ-డాట్ సంస్థను స్థాపించినప్పుడు, ఎందరో యువ ఇంజనీర్లు ఉత్సాహంతో, నిబద్ధతతో పని చేసి భారత టెలికామ్ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. రాజీవ్ గాంధి ఓడిపోయిన తర్వాత ఆ సంస్థకు విదేశీ భాగస్వామ్యం జోడించటంతో ముందు ఉన్న ఉత్సాహమంతా నీరుగారిపోయింది.
విదేశీ కంపెనీలు ఇక్కడ చిప్‌లు తయారుచేసుకోవటానికి అవకాశం కల్పించటం, సబ్సిడీలు ఇవ్వటంకాకుండా, భారత ప్రభుత్వమే ఒక వెంచర్ ఫండ్‌ను ఏర్పాటుచేసి భారతీయ కంపెనీలు చిప్ తయారీ రంగంలో పురోగతి సాధించేటట్లు చూడాలి.
అమెరికా ఇష్టపడకపోయే అవకాశం
ప్రస్తుతానికి భారత్‌కు ఇరాన్‌లో రేవు ఉంది, రష్యానుంచి చమురును కొనుగోలు చేస్తోంది, యాంటీ మిసైల్ వ్యవస్థలను రష్యానుంచి కొనుగోలు చేస్తోంది. ఇవన్నీ అమెరికా ఆంక్షల ఉల్లంఘనే. అయితే ఇలా ఉల్లంఘించినా అమెరికాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం భారత్‌ను ఏమీ అనటంలేదు. అమెరికాలో ప్రభుత్వం మారితే, భారత్ పట్ల వైఖరి మారే అవకాశాలు లేకపోలేదు. ఆ పరిస్థితుల్లో, భారత్‌లో సబ్సిడీని వినియోగించుకుని చిప్‌లను తయారుచేస్తున్న అదే కంపెనీలు ఆ చిప్‌లను భారత్‌కు అమ్మకపోవచ్చు. దీనితో బ్రహ్మోస్‌కుగానీ, అగ్ని క్షిపణులకుగానీ కీలక సమయాలలో చిప్‌ల కొరత ఏర్పడవచ్చు.
పాత కథ గుర్తుందికదా, మేకుకోసం వెళితే చెప్పు పోయింది, చెప్పుకోసం వెళితే గుర్రం పోయింది, గుర్రం కోసం వెళితే, రౌతు పోయాడు, రౌతుకోసం వెళితే, యుద్ధంలో ఓటమి మిగిలింది, యుద్ధంకోసం వెళితే, రాజ్యం పోయింది, కాబట్టి, గుర్రపునాడాలోని మేకుకోసం అంతా పోయింది.
ఆధునిక ప్రపంచంలో, ఆ మేకే మైక్రోచిప్, ఆ రాజు అరుస్తాడు, “ఒక మైక్రో చిప్! ఒక మైక్రో చిప్! మైక్రో చిప్ ఇస్తే రాజ్యం ఇస్తాను!” అని.
రక్షణ రంగంలో స్వావలంబన విదేశీయులకు సబ్సిడీ వలన జరగదు. దేశంలోనే సొంత ఆర్ అండ్ డీ, ఉత్పాదక సామర్థ్యం ఏర్పాటు వలన సాధ్యమవుతుంది. అది సాధ్యమేనని హువావే ఉదాహరణ చెబుతోంది. భారత్‌లో అలా చేయవచ్చని చరిత్రలోకి వెళ్ళి సీ-డాట్ చూస్తే తెలుస్తోంది. ఇంకా మనం దేనికోసం వేచి చూడటం?