గిరిజనులకు సీఎం రేవంత్ వరాలు...మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు
నాడు ఇంద్రవెల్లి నాగోబా సన్నిధిలో సీఏం ఎ. రేవంత్ రెడ్డి గిరిజనులకు వరాలు ఇచ్చారు. మళ్లీ ఈ నెల 21 నుంచి 24వతేదీ వరకు జరగనున్న మేడారం జాతర కోసం ఏర్పాట్లు చేశారు.
నాడు ఇంద్రవెల్లి నాగోబా సన్నిధిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గిరిజనులకు వరాలు కురిపించారు. మళ్లీ ఈ నెల 21 నుంచి 24వతేదీ వరకు జరగనున్న మేడారం మహా జాతర కోసం రేవంత్ సర్కారు రూ.105కోట్లను విడుదల చేసింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిరిజనుల ఓట్లపై దృష్టి సారించింది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గిరిజన ఓటర్లపై గురి పెట్టారు. అందులో భాగంగానే వెనుకబడిన మారుమూల ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా సన్నిధిలో ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరిపి గిరిజనులకు పలు వరాలు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. అధికారంలోకి వచ్చాక మళ్లీ సీఎం అయిన రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలోని నాగోబా ఆలయాన్ని సందర్శించి సభ నిర్వహించి పార్లమెంటు ఎన్నికలకు సమరశంఖం పూరించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను సీఎం రేవంత్ దత్తత తీసుకోవడంతో పలు అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలను కేటాయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో గిరిజనులకు వరాలు కురిపించడమే కాకుండా గిరిజనుల ఇలవేల్పు అయిన వన దేవతలు సమ్మక్క సారక్కల మేడారం జాతర కోసం అత్యంత ప్రాధాన్యమిచ్చి నిధులు కేటాయించారు. ఎస్టీ రిజర్వుడ్ పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు ముఖ్యమంత్రి వ్యూహాన్ని రూపొందించి గిరిజనుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి నిధులు కేటాయించారు.
ఇంద్రవెల్లి నుంచి గిరిజనాభివృద్ధికి శ్రీకారం
ఇంద్రవెల్లి సభ నుంచి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంతన్న శ్రీకారం చుట్టారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ‘ద ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకం, గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని, అందుకే గిరిజనులు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తారని ఎమ్మెల్యే వెడ్మ జొజ్జు పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజనులంటే అత్యంత ప్రేమ కురిపించి గిరిజన ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరాకు, రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ సర్కారుకు వచ్చే ఎన్నికల్లో గిరిజనులంతా మద్ధతు ఇస్తారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ జొజ్జు ధీమాగా చెప్పారు. గిరిజనాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ఆదివాసీ గిరిజనులు అండగా నిలుస్తారని ఎమ్మెల్యే వెడ్మ జొజ్జు పేర్కొన్నారు.
మేడారం మహాజాతర కోసం రూ.105 కోట్లతో అభివృద్ధి పనులు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద మేడారం జాతర కోసం రూ.105కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మేడారం మహాజాతరను ఈసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడంతోపాటు ఈ జాతరను జాతీయ పండుగగా ప్రకటించేలా రేవంత్ సర్కారు కార్యాచరణ రూపొందించింది. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌర్యాలు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశామని రాష్ట్ర మంత్రి సీతక్క చెప్పారు. జాతర పనులన్నీ పూర్తి చేసి జాతరను సజావుగా జరుపుతామని మంత్రి పేర్కొన్నారు.
మేడారం జాతర కోసం 6వేల బస్సులు
మేడారం మహా జాతర కోసం టీఎస్ఆర్టీసీ ఆరువేల బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 40 లక్షల మంది భక్తులను జాతరకు మేడారం తీసుకు వస్తామని మంత్రి పేర్కొన్నారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో జాతరకు వచ్చే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత రవాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి వివరించారు. మేడారం ప్రయాణికుల కోసం 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. భక్తులు బస్సు ఎక్కేందుకు 47 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 18 వతేదీ నుంచి 25వతేదీ వరకు ఆర్టీసీ బస్సులను మేడారం నడుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాల నుంచి భక్తులను మేడారం తరలించడానికి బస్సులను సిద్ధం చేశామని మంత్రి వివరించారు.
మేడారం జాతరలో 30వేలమంది ఉద్యోగుల సేవలు
మేడారం జాతర సందర్భంగా భక్తులకు సేవలందించేందుకు 30వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 10వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దేవాదాయ, పర్యాటక, రెవెన్యూ, వైద్యఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, ఆర్టీసీ శాఖల అధికారులు సేవలందించనున్నారు. 500 సీసీ కెమెరాలతోపాటు డ్రోన్లతో పోలీసులు జాతరను పర్యవేక్షించనున్నారు. మహాజాతరలో బీఎస్ఎన్ఎల్ ఉచితంగా వైఫై సేవలు కూడా అందించనుంది. భక్తులకు మంచినీటిని అందించేందుకు రూ.4.21కోట్లతో పనులు చేపట్టారు. ఈసారి మేడారంలో గిరిజనుల ఇలవేల్పు సమ్మక్క సారక్కల సన్నిధిలో గిరిజనుల సమ్మేళనం కూడా నిర్వహిస్తామని మంత్రి సీతక్క చెప్పారు.
మేడారం మహా జాతరలో ముఖ్య ఘట్టాలు
గిరిజనుల ఆరాధ్య ధైవం అయిన సమ్మక్క, సారక్కల మహా జాతర అంగరంగ వైభవంగా జరిపేందుకు తెలంగాణ సర్కారు ముమ్మర సన్నాహాలు చేసింది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ మేడారం జాతరకు తరలిరానున్నారు. ఈ జాతర సందర్భంగా తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ విస్తృత ప్రచారం చేపట్టింది. ఈ జాతరలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ జాతర కోసం భక్తులు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి అడవిలోనే ఆశ్రయం పొంది జాతరలో పాల్గొననున్నారు. అత్యంత భక్తి ప్రపత్తులతో అత్యంత కోలాహలంగా జరగనున్న మేడారం జాతరలో ప్రధాన ఘట్టాలు ఇలా ఉన్నాయి.
ఫిబ్రవరి 21 : సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు వస్తారు.
ఫిబ్రవరి 22 : సమ్మక్క గద్దెకు వస్తుంది.
ఫిబ్రవరి 23 : భక్తులు సమ్మక్క, సారక్కలకు మొక్కులు సమర్పిస్తారు.
ఫిబ్రవరి 24 : అమ్మవార్లు అయిన సమ్మక్క, సారక్కలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది.