బాపట్లలో తుపాన్‌ రాజకీయం వరదల్లో ఓట్ల వేట అంటే ఇదేనేమో.. పరామర్శకు వెళ్లిన పెద్దలు పరస్పరం విమర్శలు లంకించుకున్నారు. వరదసాయం పక్కకుపోయి బురదసాయం తెరపైకొచ్చింది.


వరదల్లో ఓట్ల వేట అంటే ఇదేనేమో.. పరామర్శకు వెళ్లిన పెద్దలు పరస్పరం విమర్శలు లంకించుకున్నారు. వరదసాయం పక్కకుపోయి బురదసాయం తెరపైకొచ్చింది. నేను చెప్పేదాకా నువ్వు కదల్లేదని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అంటే, ప్రజా హితం తెలియని వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అని సీఎం వైఎస్‌ జగన్‌ తిప్పికొట్టారు. అంతటితో ఆగారా అంటే.. నీకు ఉల్లిపాయల గురించి తెలాసా అని ఒకాయన అంటే.. ఇంకొకాయన నీకు బంగాళా దుంపలు తెలుసా అని విమర్శలు చేసుకుంటూ బురద రాజకీయం చేసునేలా అధికార ప్రతిపక్ష నేతల పర్యటన సాగటం వరద బాధితులను విస్మయ పరిచింది. ఇరుపార్టీల నేతలు నేముందంటే నేముందంటూ ఒకరు తిరుపతి నుంచి మరొకరు గుంటూరు నుంచి యాత్రలు ప్రారంభించి బురదెత్తి పోసుకోవడానికి బాపట్ల చేరుకున్నారు. ఇది దేనికి సంకేతం. సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ తీరున విమర్శలు సాగుతుంటే మున్ముందు వీటి ధాటి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు.అనుకోని విధంగా మిగ్‌జాం తుపాన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాను ముంచెత్తింది. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా తిరుపతి జిల్లాలో రైతులతో జగన్‌ మాట్లాడి అక్కడి నుంచి బాపట్లకు వచ్చారు. రైతుల పొలాల వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి కంటే ముందుగా బాపట్ల మండలానికి చేరుకున్న ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పొలాల వద్ద రోడ్డుపైనే రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

విమర్శ చేసేందుకే వచ్చావంటారు

ప్రతిపక్ష నాయకుడు ముందు పరామర్శకు వస్తే కావాలని విమర్శ చేసేందుకు వచ్చాడంటారు. చుట్టపు చూపుగా తిరుపతి జిల్లాకు ముఖ్యమంత్రి వెళ్లాడు. తుపాన్‌ తీరం దాటింది ఇక్కడ. తీవ్ర నష్టం జరిగింది ఇక్కడ. మొదట ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్లారంటూ చంద్రబాబు నాయుడు విమర్శ చేశారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎప్పుడిస్తారు

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎక్కడ? ఎప్పుడిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే జగన్‌ నన్ను, మిమ్మల్ని జైలుకు పంపిస్తాడంటూ చలోక్తులు విసిరారు. ఇప్పటికే చేయని నేరానికి నన్ను జైలుకు పంపించాడు. మీరు ఆందోళనకు దిగితే కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తాడంటూ మండిపడ్డారు. ఈ దశలో చంద్రబాబుకు అక్కడికి వచ్చిన రైతులు, జనం నుంచి మంచి స్పందన వచ్చింది. మూడు నెలల్లో మనమొస్తాం, అప్పుడు నేనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తానంటూ అక్కడి వారిని ఉత్తేజపరిచారు.


ప్రతి విషయం రాజకీయమేనా?

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి విషయాన్ని ప్రతిపక్షం రాజకీయం చేస్తున్నది. ఇన్‌పుట్‌ సబ్సిడీపై ఎవరు ఏమి చెప్పినా నమ్మొద్దు, నేను మీబిడ్డను నన్ను నమ్మండని బాధితులను కోరారు. ప్రభుత్వంపై కక్షకట్టి లేనిపోని రాతలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు చదవొద్దని, అలాగే ఈటీవీ, ఏబీఎన్, టీవీ5లను చూడొద్దని అక్కడికి వచ్చిన ప్రజలను కోరారు. వారు కోరుకున్న వారు ముఖ్యమంత్రిగా రాలేదనే అక్కసుతోనే ఇటువంటి రాతలు రాస్తున్నారన్నారు.

బాబుపాలనంతా కవువే..

చంద్రబాబు పాలనలో ఐదేళ్లు కరువు, చంద్రబాబు ఇచ్చిన ఇన్సూరెన్స్‌ రూ. 3,500 కోట్లు మాత్రమే. నాలుగున్నర ఏళ్ల కాలంలో 55 లక్షల మందికి రూ. 7,500 కోట్లు ఇచ్చాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఈ సీజన్‌లో నష్టం జరిగితే ఈ సీజన్‌ ముగిసేలోగానే ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమని జగన్‌ వివరించారు.

రైతులకు సాయం అందించే మాటేమో కాని ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలను అకడివారు ఆసక్తిగా విన్నారు. విమర్శ చేస్తున్న సమయంలో జగన్‌ వద్ద ప్రజలు ఈలలు, కేకలు వేస్తే, చంద్రబాబు వద్ద ఉన్న జనం జైజైబాబూ అంటూ అరుపులు, కేకలతో ఆప్రాంతం దద్దరిల్లింది.

Next Story