విలావవంతమైన వివాహాలకు కేరాఫ్  హైదరాబాద్ డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌
x
హైదరాబాద్ డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్

విలావవంతమైన వివాహాలకు కేరాఫ్ హైదరాబాద్ డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌

తెలంగాణలోని నాగార్జునసాగర్, కొల్లాపూర్ వద్ద సోమశిల బ్యాక్ వాటర్, హైదరాబాద్ నగరంలోని అందమైన ప్రాంతాలు, డెస్టినేషన్ వెడ్డింగుకు అనుకూలంగా మారాయి.


పచ్చని చెట్లు...పక్షుల కిలకిలరావాలు...చుట్టూ నాగార్జునసాగర్ జలాశయం నీటి గలగలలు...నల్లమల కొండల నడుమ ప్రకృతి రమణీయ అందాలు విరబోసినట్లు ఉన్న 144 ఎకరాల నాగార్జునకొండ...పచ్చని కొండల మధ్య నాగార్జునసాగర్ రిజర్వాయర్ పరిసరాలు...డెస్టినేషన్ వెడ్డింగ్‌కు అనువైన ప్రదేశాలు...

- సోమశిల- సిద్దేశ్వరం కొండల మధ్య కృష్ణాజలాల సోయగాలు...దేశ,విదేశాల నుంచి వచ్చే పక్షులు... కృష్ణానది ఒడ్డున ఉన్న కొల్లాపూర్‌లోని సోమశిల బ్యాక్‌వాటర్‌ అతి సుందరమైన ప్రదేశం డెస్టినేషన్ వెడ్డింగ్ కు అనుకూలంగా ఉంది.
- విశాల మైన ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్‌లు...ఉస్మాన్ సాగర్, గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలు, హైటెక్స్ ప్రాంగణం...ఫైవ్ స్టార్ హోటళ్లు... హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కేంద్రాలు కూడా డెస్టినేషన్ వెడ్డింగుకు అనువుగా ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్నాయి.
- తెలంగాణలోని హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎన్‌ఆర్‌ఐ కనెక్ట్ వెడ్డింగ్ టూరిజానికి ప్రధానమైనది. తెలంగాణ రాష్ట్రం రైలు, రోడ్డు, విమానాల ద్వారా అనుసంధానించి ఉంది. చారిత్రక వరంగల్ వెడ్డింగ్ టూరిజానికి అనువైన కేంద్రాలుగా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, అరకులోయ, కొత్త అమరావతి రాజధాని ప్రాంతం మౌలిక సదుపాయాలతో వెడ్డింగ్ డెస్టినేషన్ కేంద్రాలుగా మారనున్నాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్, ఉదయపూర్, గోవా తరహాలో డెస్టినేషన్ వివాహాలు జరిపేందుకు తెలంగాణ సమాయత్తమవుతోంది.
- హైదరాబాద్ నగరంలోని ఫలక్ నుమా తాజ్ పురాతన హోటల్ డెస్టినేషన్ వివాహాలకు కేరాఫ్ అడ్రసుగా మారింది. ఈ ఫలక్ నుమా హోటల్ లో బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహ వేడుకలు జరిపారు.
- పురాతన చార్మినార్ చెంత ఉన్న చౌమహల్లా ప్యాలెస్ కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ కేంద్రంగా మారింది.

పెళ్లిళ్లకు తెలంగాణే గమ్యస్థానం
తెలంగాణను డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న తెలంగాణను డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ప్రకటించారు.పెళ్లిళ్లకు తెలంగాణే గమ్యస్థానమని మంత్రి జూపల్లి తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) సమావేశంలో తెలిపారు.

తెలంగాణ గ్లోబల్ టూరిజం హబ్
‘‘ హైదరాబాద్‌ నగర శివార్లలో పలు అందమైన ప్రదేశాలు ఉన్నాయి , ఈ ప్రదేశాల్లో వనరులు ఉన్నాయి, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడం మాత్రమే అవసరం’’ అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్‌ టూరిజం హబ్‌గా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు అమెరికాలో జరిగిన ఏటీఏ సెమినార్‌లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల వృద్ధి విజన్‌ను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.

పర్యాటకరంగం అభివృద్ధితో పెరగనున్న ఉపాధి అవకాశాలు
తెలంగాణలో సాహసం, ఆధ్యాత్మికం, పర్యావరణ పర్యాటకం,డెస్టినేషన్ వెడ్డింగ్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.తెలంగాణలో పర్యాటక శాఖ అభివృద్ధితో యువతకు మరింత ఆదాయం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

వెడ్ ఇన్ ఇండియా అంటూ మోదీ పిలుపు
భారతీయులు విదేశాల్లో కాకుండా వెడ్ ఇన్ ఇండియా అని గత ఏడాది నవంబర్‌లో భారత ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు.భారతీయులు తమ దేశంలోనే తమ వివాహాలను నిర్వహిస్తే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని పిలుపు మేరకు హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు సుందర ప్రదేశాలను డెస్టినేషన్ వెడ్డింగ్ కు కేంద్రాలుగా అభివృద్ధి చేయవచ్చని వెడ్డింగ్ ప్లానర్ హైదరాబాద్ నగరానికి చెందిన శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

వివాహ సీజన్
పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 35 శాతం ఉపాధి కల్పిస్తోందని టూరిజం మంత్రిత్వ శాఖ అధికారిణి మనీషా సక్సేనా చెప్పారు. గత ఏడాది నవంబర్-డిసెంబర్ వివాహ సీజన్‌లో భారతదేశంలో 3.5 మిలియన్ల జంటలు వివాహం చేసుకున్నారని, దీని ద్వారా 57 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఖర్చు చేశారని నివేదికలు వెల్లడించాయి.

విలావవంతంగా వివాహాలు
విలాసవంతమైన వివాహాలను జరిపేందుకు లగ్జరీ హోటళ్లు, రిసార్ట్‌లను బుక్ చేసుకునే ట్రెండ్ పెరుగుతోంది.భారతదేశం అతిపెద్ద వివాహ గమ్యస్థానంగా మారుతోంది. జైపూర్‌లో ఇటీవల వెడ్ ఇన్ ఇండియా” ఎక్స్‌పో జరిగింది.“భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు వెడ్ ఇన్ ఇండియా అంటూ చొరవ తీసుకొని పెళ్లి చేసుకునేందుకు భారతదేశానికి తరలిరావాలి’’అని వెడ్ ఎక్స్‌పోలో ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఎస్ కే పాఠక్ కోరారు.Read More
Next Story