డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా హైదరాబాద్ ?
x
Anti Drug Abuse Summit (Photo Credit: Facebook)

డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా హైదరాబాద్ ?

హైదరాబాద్ రాడిసన్ హోటల్ కేంద్రంగా వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ బాగోతంలో షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా మారింది.


రాడిసన్ కేంద్రంగా జరిగిన మాదక ద్రవ్యాల పార్టీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఈ బాగోతంలో కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని తేలింది. ఈ డ్రగ్స్ పార్టీలు గత ఏడాది కాలంగా జరుగుతున్నాయని పోలీసుల దర్యాప్తులో బయటపడటంతో పోలీసులే షాక్ అయ్యారు. ఈ ఫిబ్రవరి నెలలోనే 16, 18,19,24 తేదీల్లో రాడిసన్ హోటల్ లో జరిగిన పార్టీకి తాను కొకైన్ ను మీర్జా వహీద్ వద్ద నుంచి కొని గ్రాము 14వేలరూపాయలకు విక్రయించానని డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. డ్రగ్స్ కేసులో నిందితులైన గజ్జల వివేక్, దర్శకుడు క్రిష్, కేదార్, రఘుచరణ్, శ్వేత, సందీప్, నిర్భయ్ సింధి, లిషిత, నేయిల్ తదితరులు వాట్సాప్, గూగుల్ పే పేమెంట్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. డ్రగ్స్ పార్టీలు జరిగిన గదుల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.


దర్యాప్తునకు రాని నిందితులు
దర్యాప్తునకు రావాలని డ్రగ్స్ పార్టీ కేసులో నిందితులకు పోలీసులు నోటీసులు జారీచేసినా వారు పరారీలో ఉన్నారు. యూట్యూబర్ లిషితను దర్యాప్తునకు రావాలని కోరుతూ పోలీసులు నోటీసులు జారీచేయగా, ఆమె కనిపించడం లేదని ఆమె సోదరి కుషిత గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. డ్రగ్స్ ను వివేకానంద్ కారు డ్రైవరు ప్రవీణ్ తీసుకునే వాడని పెడ్లర్ చెప్పడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న నిందితులు విచారణకు రావాలని సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినా, వారు విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. నిందితులు విచారణకు రెండు మూడు రోజుల తర్వాత వస్తే వారికి డ్రగ్స్ పరీక్షలు చేసినా టెస్టుల్లో ఆధారాలు దొరకవని, దీని కోసం నిందితులు తప్పించుకొని విచారణకు తర్వాత వస్తామని చెబుతున్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు.

గుట్టుగా డ్రగ్స్ తరలింపు
గతంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడో ఓ చోట మాదక ద్రవ్యాలను విక్రయించేవారు. కానీ తర్వాత గోవా,గుజరాత్, ముంబయిల నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ పెద్ద ఎత్తున తరలించి నగరాన్ని డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా మార్చారని తెలంగాణ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, నగర పోలీసుల దర్యాప్తులో వెలుగుచూడటంతో మూడు శాఖలు అప్రమత్తమయ్యాయి. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన నౌకలో నేవీ అధికారులు సోదాలు జరిపితే రూ.2వేల కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి, మెథాఫెంటమైన్ బుధవారం దొరికాయి. విదేశాల నుంచి గుజరాత్, గోవా, ముంబయి తీరాలను వచ్చిన డ్రగ్స్ ను హైదరాబాద్ నగరానికి తరలించి, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని వెల్లడైంది. నైజీరియన్ స్టాన్లీ ముఠాకు చెందిన నైజీరియన్లు గోవా కోల్వలే జైలు నుంచి డ్రగ్స్ విక్రయం సాగిస్తున్నారనే సమాచారంతో తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో దర్యాప్తు చేస్తోంది. డ్రగ్స్ లావాదేవీలు సాగించిన వారి పేర్లు సెల్ ఫోన్లలో పొడి అక్షరాలతో ఉండటంతో వాటిని డీకోడ్ చేస్తున్నారు.

రేవ్, వీకెండ్ పార్టీల్లో డ్రగ్స్ హవా
హైదరాబాద్ నగరంలోని పలు రహస్య స్థలాలు, ఫాంహౌస్ లు, విల్లాల్లో రేవ్ పార్టీలు జరిగాయని, వీటిలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. రేవ్ పార్టీల వివరాలపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. డ్రగ్స్ ను గోవా నుంచి బస్సుల్లో హైదరాబాద్ నగరానికి తరలించారని దర్యాప్తులో వెలుగుచూడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగరంతోపాటు బెంగళూరు, హుబ్లీ ప్రాంతాల్లో కూడా వీకెండ్ పార్టీలు నిర్వహించారని వెల్లడైంది. డ్రగ్స్ పార్టీల బాగోతాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు.

టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఛార్జ్‌షీట్లు దాఖలు
హైదరాబాద్ కేంద్రంగా గతంలో వెలుగుచూసిన డ్రగ్స్ రాకెట్ బాగోతం దర్యాప్తులో నీరు కారిపోయింది. టాలీవుడ్ కు చెందిన 12 మంది ప్రముఖులతో పాటు 62 మందికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు జారీ చేసి వారి నుంచి గోళ్లు, వెంట్రుకలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. డ్రగ్స్ సేవిస్తే ముఖ వర్చస్సు, గ్లామర్ పెరుగుతుందని పలువురు సినీనటీనటులు ఈ డ్రగ్స్ తీసుకున్నారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతంలో సినీ ప్రముఖులు డ్రగ్స్ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ కొన్నారని, దానికి గాను ఆన్ లైన్ లో వారు డబ్బులు కూడా డ్రగ్స్ రాకెట్ నిందితులకు చెల్లించారని దర్యాప్తులో వెలుగుచూసింది. ఎందరో ప్రముఖులు డ్రగ్స్ కేసుల్లో నిందితులని దర్యాప్తులో తేలినా కోర్టులో వేసిన చార్జ్ షీట్లలో సరైన వివరాలు లేవు. డ్రగ్స్ వాడే వారి భరతం పడతామని ఆర్భాటంగా ప్రకటించిన ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ పై పాత సర్కారు బదిలీ వేటు వేసింది. గతంలో డ్రగ్స్ సేవించిన వారిపై పెట్టిన పాత కేసులు నీరు కారిపోయాయి. దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలు కోర్టుల్లో సమర్పించిన చార్జ్ షీట్లలో కనిపించలేదు. దీంతో డ్రగ్స్ కేసులన్నీ కోర్టుల్లో నిలబడలేదు. దీంతో డ్రగ్స్ కు బానిసలైన వారు, డ్రగ్స్ పెడ్లర్లు విడుదల కాగా వారికి క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది.

డ్రగ్స్ రాకెట్‌ను ఉక్కుపాదంతో అణచివేయాలి : ఎం పద్మనాభరెడ్డి
హైదరాబాద్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా సాగుతున్న మాదకద్రవ్యాల రాకెట్ ను తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని తాము కోరినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఎం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఇటీవల తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కలిసి డ్రగ్స్ దందాకు తెరవేయాలని కోరుతూ ఓ వినతి పత్రాన్ని సీఎంకు ఆయన సమర్పించారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వినతితో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా తీర్చిదిద్దాలని కోరుతూ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, ఎక్సైజ్, నగర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశంతో కదిలిన అధికారులు డ్రగ్స్ బాగోతాలపై ముమ్మర దర్యాప్తు చేయడంతోపాటు వరుస దాడులు సాగిస్తున్నారు.


డ్రగ్స్ నిరోధానికి యాంటీ నార్కొటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్
డ్రగ్స్ సమాచారం తెలిస్తే తమ టోల్ ఫ్రీ నంబరుకు తెలియజేయాలని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టరు సందీప్ శాండిల్యా కోరారు. టీఎస్ న్యాబ్ కు చెందిన ఫోన్, వాట్సాప్ నంబరు 87126 71111 కు సమాచారాన్ని అందజేయాలని ఆయన సూచించారు. సమాచారం ఇచ్చే వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలు వారికి సమాచారాన్ని అందజేసి తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు సహకరించాలని సందీప్ శాండిల్యా కోరారు.


Read More
Next Story