హైదరాబాద్ మీద ఐటి కుర్రాళ్ల ఆశలు...
x
సైబర్ టవర్స్ ఫోటో క్రెడిట్ : Wikimedia Commons)

హైదరాబాద్ మీద ఐటి కుర్రాళ్ల ఆశలు...

ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ రంగంలో ఘనత సాధించడమే కాకుండా టాప్ 10 నగరాల జాబితాలోనూ హైదరాబాద్‌కు స్థానం లభించింది.


ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించడంలో దేశంలోనే హైదరాబాద్ నగరం రికార్డు సృష్టించింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ దాకా ఏడాది కాలంలో హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగాల కల్పనలో 41.5 శాతం పెరుగుదలతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ తాజాగా వెల్లడించింది.

- ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల్లో మందగమనం, లేఆఫ్‌లు కొనసాగుతున్నా దీని ప్రభావం హైదరాబాద్ లో లేదని జాబ్ పోర్టల్ ఇండీడ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
- హైదరాబాద్ నగరంలో ఐటీకి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు సాగించడం, హైటెక్ సిటీలో ఉన్న మౌలిక సదుపాయాలు, అనుకూలంగా ఉన్న వాతావరణం వల్ల గడచిన ఏడాది కాలంలోనే 41.5 శాతం ఐటీ ఉద్యోగాలు పెరిగాయని ఇండీడ్ తేల్చిచెప్పింది.
- ఎనాల్‌సిస్,అజైల్, ఏపీఐస్,జావా స్ట్రిప్ట్, ఎస్‌క్యూఎల్ నైపుణ్యాలున్న నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలు లభించాయని ఇండీడ్ నివేదిక తెలిపింది. తమ నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ఐటీరంగంలో టెకీలు నిలదొక్కుకోగలరని నివేదిక వివరించింది.
- దేశంలో కొత్త ఐటీ ఉద్యోగాల్లో 3.6 శాతం తగ్గుదల ఉన్నా, హైదరాబాద్ నగరంలో ఉన్న మౌలిక సదుపాయాలు టెకీలకు ఐటీ ఉద్యోగాలు వచ్చేందుకు దోహదపడ్డాయి. ఐటీ ఉద్యోగాల కోసం యత్నిస్తున్న యువత హైదరాబాద్ నగరంలో పనిచేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారని జాబ్ క్లిక్ గణాంకాలు తెలిపాయి.
- భారత్ సిలీకాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం కంటే హైదరాబాద్ ఐటీ ఉద్యోగాల కల్పనలో ముందుంది. బెంగళూరులో గడచిన ఏడాది కాలంలో 24 శాతం కొత్త ఐటీ ఉద్యోగాల పోస్టింగులు లభించాయి. దేశంలోనే హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఐటీరంగం, డాటా రంగాల్లో ఉద్యోగాల కల్పనకు కేరాఫ్ గా మారాయని ఇండీడ్ తన నివేదికలో తెలిపింది.

హైదరాబాద్ ఐటీ పవర్ హౌస్ ఎలా అయిందంటే...
దేశంలోనే హైదరాబాద్ ఐటీ పవర్ హౌస్ గా మారింది. ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ సాధించిన ప్రగతితో గుర్తింపు పొందిందని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశికుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రపంచ స్థాయి సౌకర్యాలు, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఐటీలో హైదరాబాద్ నగరం మేటిగా నిలిచిందని శశికుమార్ పేర్కొన్నారు. ఒక వైపు లేఆఫ్‌లు ఉన్నా టెకీల నైపుణ్యం, వారు పొందిన శిక్షణ వల్ల హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగాల సంఖ్య పెరిగిందని శశికుమార్ వివరించారు.

టెకీలకు అత్యుత్తమ గమ్యస్థానం హైదరాబాద్
హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఐటీ ప్రొఫెషనల్స్‌కు అత్యుత్తమ గమ్యస్థానాలుగా నిలిచాయి. లేఆఫ్ లు ఉన్నా 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఐటీ సెక్టార్‌లో జాబ్ పోస్టింగ్‌లు హైదరాబాద్‌లో 41.5 శాతం, బెంగళూరులో 24 శాతం పెరిగాయి. అంటే బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ టెకీలకు హైరింగ్ ప్లాట్ ఫామ్ గా నిలిచింది.

టెక్ హబ్‌లో పెరిగిన ఐటీ ఉద్యోగాలు

జాబ్ పోస్టింగ్‌లు జాతీయ స్థాయిలో క్షీణించినప్పటికీ హైదరాబాద్‌లోని టెక్ హబ్‌లలో ఐటీ ఉద్యోగాలు పెరిగాయి. ఇన్ ఫ్రాస్టక్చర్, రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ పురోగతి సాధించడం వల్ల ఐటీ రంగానికి ఊతం ఇచ్చినట్లయిందని హైదరాబాద్ నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ అధిపతి మాటూరి సురేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు నిపుణులైన టెకీలు వలస వస్తున్నారని, దీంతో వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయని ఐఐటీ మాజీ విద్యార్థి, సీనియర్ క్యాడ్ ఇంజినీర్ బొజెండ్ల నరేష్ బాబు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ ర్యాంకింగ్‌లో టాప్ 10 నగరాల్లో హైదరాబాద్
భారతదేశంలోని టాప్ 10 నగరాల జాబితాలో హైదరాబాద్‌కు స్థానం లభించింది. ఆర్థిక శాస్త్రం, మానవ మూలధనం, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన అనే నాలుగు అంశాలపై ర్యాంకింగ్ ఆధారపడి హైదరాబాద్ మేటి నగరంగా నిలిచింది. స్వతంత్ర ఆర్థిక సలహా సంస్థ ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ హైదరాబాద్ కు ర్యాంక్ ఇచ్చింది. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 564వ స్థానంలో ఉంది. భారతదేశంలోని టాప్ 10 నగరాల్లో హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉంది. నాలుగు ర్యాంకింగ్ పారామీటర్లలో హైదరాబాద్ నగరం అత్యుత్తమ పనితీరు కనబరిచింది. గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం దేశంలోని అగ్ర నగరాల జాబితాలో ఢిల్లీ గ్లోబల్ ర్యాంక్ 350తో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ నగరాల జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది.


Read More
Next Story