హైదరాబాద్‌లో ఆకాశానికి చిల్లు, నగరం జలమయం
x
నిజాామాబాద్ నగరంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరదనీటిలో మునిగిన ఆర్టీసీ బస్సు

హైదరాబాద్‌లో ఆకాశానికి చిల్లు, నగరం జలమయం

మంగళవారం భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.


హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున మేఘవిస్పోటనం జరిగింది. అతి భారీ వర్షంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి.నగరంలోని సరూర్‌నగర్, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, అబిడ్స్, మెహిదీపట్నం, ఉప్పల్‌తోపాటు హైదరాబాద్ నగరం మొత్తం కవర్ అయ్యేలా భారీ వర్షం కురిసింది.క్లౌడ్ బరస్ట్ వల్ల కురుస్తున్న భారీ వర్షాలతో నగరం వ్యాప్తంగా వరదలు వెల్లువెత్తాయి.


ఇళ్లలో నుంచి బయటకు రావద్దు
నగరంలో భారీవర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రోడ్లపై వరదనీరు ప్రవహిస్తున్నందున ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని ఐఎండీ కోరింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీవర్షం కొనసాగింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఆరు గంటల వరకు ఏకధాటిగా కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డ్యూటీ అధికారి సుధీర్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నగరంలో అత్యధిక వర్షపాతం ఖైరతాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో నమోదైందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం భారీవర్షం తగ్గిన సాయంత్రం వరకు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారి సుధీర్ కుమార్ వివరించారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌,పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌ నగర్‌,కూకట్‌పల్లి, మూసాపేట్‌, ఎర్రగడ్డ,మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట,ఖైరతాబాద్‌, ట్యాంక్‌బండ్‌, హిమాయత్‌నగర్‌,ఎల్బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది.అమీర్‌పేట్, సనంత్‌నగర్, బాలానగర్, కూకట్‌పల్లి, ముషీరాబాద్, ఎస్‌ఇసి బాడ్, ఖైరతాబాద్, అబిడ్స్, కవాడిగూడ, ట్యాంక్ బండ్, జూబ్లీ కొండల మీదుగా భారీ వర్షం కురుస్తోంది.

ప్రధాన రహదారులు జలమయం
హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున కురుస్తున్న భారీవర్షాలతో నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. వర్షపు నీటి ప్రవాహంతో ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.షేక్ పేటలో 54.5 మిల్లీమీటర్లు,ఖైరతాబాద్ లో 54.5. శేరిలింగంపల్లిలో 52.5, బాలానగర్ లో 44.8,మారేడుపల్లిలో 41.3, కుత్బుల్లాపూర్ లో 41.0 , గోల్కోండలో 36.0, రాజేంద్రనగర్ లో 29.8, రామచంద్రాపురంలో 30.5,అల్వాల్ లో 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణకేంద్రం అధికారి ధర్మరాజు చెప్పారు.

హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ
మరో రెండు గంటల పాటు హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల రాగల ౫ రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు.

జిల్లాల్లోనూ కుంభవృష్టి
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మంగళవారం ఉదయం భారీవర్షాలు కురిశాయి.నల్గొండ జిల్లా గుర్రంపోడులో 109.8 మిల్లీమీటర్లు,సిద్దిపేట జిల్లా దుల్ మిట్ట,జగదేవ్ పూర్లో 109.0 మిల్లీమీటర్లు,నిజామాబాద్ జిల్లా భీంగల్ లో 106.8 మిల్లీమీటర్లు,వికారాబాద్ జిల్లా లో 96.3 మిల్లీమీటర్లు,యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో 90.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణ పేట, నల్గోండ,నిర్మల్, గద్వాల, ఖమ్మం, భువనగిరి, యాదాద్రి ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం అధికారి ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కొన్ని పాఠశాలలకు సెలవు

హైదరాబాద్‌లోని పలు పాఠశాలలకు వారాంతపు సెలవులను మంగళవారం వరకు పొడిగించారు. ఇండిపెండెన్స్ డే, రక్షా బంధన్ సందర్భంగా పాఠశాలలు మూసివేశారు.భారీవర్షం కురవడంతో పిల్లల భద్రత దృష్ట్యా మంగళవారం పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కొన్ని ప్రైవేటు పాఠశాలలు పిల్లల తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశం పంపించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు, మంగళవారం భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

Read More
Next Story