హలీం...ఈ ఏడాది మరింత ప్రియం
x
Haleem

హలీం...ఈ ఏడాది మరింత ప్రియం

హైదరాబాదీలను నోరూరించే హలీం ఈ ఏడాది మరింత ప్రియం కానుందా అంటే అవునంటున్నారు హోటల్ వ్యాపారులు.మార్చి 12వతేదీ నుంచి హలీం విక్రయాలు ప్రారంభం కానున్నాయి...


హలీం...మూడు అక్షరాల పేరు...అది వింటే చాలు హైదరాబాదీలను నోరూరిస్తోంది. ప్రతి ఏటా పవిత్ర రమజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు ఉంటారు. హైదరాబాద్ నగరంలోని ఇతర మతాల వారు కూడా రమజాన్ మాసంలో తయారు చేసే హలీం కోసం ఎదురు చూస్తుంటారు. మార్చి 12వతేదీ నుంచి రమజాన్ నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని వీధుల్లో హలీం బట్టీల నిర్మాణ సందడి నెలకొంది. ఉపవాస దీక్ష అయిన రోజా ఉండే ముస్లింలు ఉపవాస దీక్ష విరమణలో బలం కోసం హలీంను తీసుకుంటుంటారు. ఉపవాస దీక్షలో ఉండి శక్తిని కోల్పోయిన వారు హలీం తినడం ద్వారా శరీరంలో కొంత శక్తిని పొందగలుగుతారు. అయితే ఈ హలీం ఇతర మతాల వారికి కూడా ప్రీతిపాత్రమైన డిష్. రమజాన్‌ మాసం మరో 22 రోజుల్లో రమజాన్ నెల ప్రారంభం కానుండటంతో హలీం కేంద్రాలన్నీ సందడిగా మారాయి. హలీం ఎంతో రుచికరంగా ఉంటూ శక్తినీ, ఆరోగ్యాన్నీ అందిస్తుంది.

హలీం ధర ఎంత పెరుగుతుందంటే...

ఈ ఏడాది హలీం ధరలు పెరగనున్నాయి. హలీం తయారీకి వాడే డ్రై ఫ్రూట్స్, మటన్,చికెన్, నెయ్యి వంటి పదార్థాల ధరలు పెరగడంతో హలీం ధరల పెంపు తప్పడం లేదంటున్నారు హోటల్ యజమానులు. హలీం ధరల పెరుగుదల అనివార్యమైనా, తాము తప్పక దీని రుచి చూస్తామని హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు నరేష్ చెప్పారు. హలీం డిమాండ్ ను తీర్చడానికి నగరంలోని హోటళ్లు వీధుల్లో బట్టీల నిర్మాణం చేపట్టాయి. ఈ ఏడాది హలీం ధర రూ.30 నుంచి రూ.40 వరకు పెరుగుతుందని హోటల్ వ్యాపారులు చెబుతున్నారు. గత సంవత్సరం హలీం ధర రూ.200 నుంచి రూ.250 రూపాయల దాకా ఉంది. ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా ఆర్డర్ చేసే వినియోగదారులకు దీని కంటే అధిక ధరలు ఉంటాయి. హలీం ధరల పెంపుపై హైదరాబాద్ హోటల్ యజమానుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. హలీం నాణ్యతను కొనసాగించడానికి ధరల పెంపు తప్పదని హోటల్ యజమానులు చెబుతున్నారు.

రూ.800 కోట్లకు చేరిన హలీం విక్రయాలు

ప్రతీ ఏటా రమజాన్ నెలలో జరిగే హలీం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ హలీం విక్రయాల వ్యాపారం రూ.800కోట్లకు చేరిందని అంచనా. హైదరాబాద్ నగరంలో హోటళ్లు వందలాది హలీం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. నగరంలో 80 టాప్ రెస్టారెంట్లు, వందలాది హలీం విక్రయ అవుట్‌లెట్లు ఉన్నాయి. 800 కోట్ల రూపాయల హలీం విక్రయాల్లో ప్రభుత్వానికి జీఎస్‌టీ ఎగవేస్తున్నారని జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ ఏడాది హలీం విక్రయాల్లో జీఎస్‌టీ వసూలుకు ప్రభుత్వ అధికారులు సమాయత్తం అయ్యారు. రమజాన్ మాసంలో రోజుకు 70వేల ప్లేట్ల విక్రయాలు సాగుతున్నాయి. హలీం విక్రయాల జోరుతో హైదరాబాద్ బిర్యానీ విక్రయాలు తగ్గవచ్చని ఓ రెస్టారెంట్ యజమాని చెప్పారు. హలీం విక్రయ కేంద్రాల వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందని హైదరాబాద్ హలీం తయారీదారుల సంఘం అధ్యక్షుడు ఎంఏ మాజీద్ చెప్పారు. జీఎస్టీ 5 శాతం చెల్లించేందుకు తాము సిద్ధమని హోటల్ యజమానులు చెప్పారు. ఫుడ్ యాప్స్ స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్ కూడా హలీం ఆర్డర్లపై సప్లయి చేస్తున్నాయి. గత ఏడాది రమజాన్ మాసంలో హైదరాబాద్ బిర్యానీ కంటే 33 శాతం అధికంగా ఆర్డర్లు వచ్చాయని స్వీగ్గీ విశ్లేషణలో తేలింది. మటన్ హలీం, చికెన్ హలీం, ముర్గా హలీంలను హైదరాబాదీలకు అందుబాటులోకి రానున్నాయి.

హలీం ఎలా తయారు చేస్తారంటే...

ఈ హలీం తయారీలో లేత పొట్టేలు మాంసం అయితే రుచి బాగా ఉంటుందని హైదరాబాదీ చెఫ్‌లు చెబుతుంటారు. పొట్టేలు మాంసాన్ని పెద్ద డేక్షాలో ఐదు గంటల పాటు ఉడికిస్తారు. అనంతరం గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాల, పుదీనా వేసి బాగా కలుపుతారు. అనంతరం మరో నాలుగు గంటల పాటు సన్నటి సెగపై హలీంను ఉడికిస్తారు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీనికి నెయ్యి కలిపి గూటా కర్రలతో రుబ్బుతారు. హైదరాబాద్ నగరంలో మాంసాహార హలీం కాకుండా శాకాహార హలీం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది.

హైదరాబాద్‌లో హలీం విక్రయాల జోరు

హైదరాబాద్‌ నగరంలో హలీం తయారీలో పాత నగరం కేంద్రంగా ఉన్న పిస్తాహౌస్‌ అంతర్జాతీయంగా పేరుగాంచింది. ప్యారడైస్‌, కేఫ్‌ 555, హైదరాబాద్‌హౌస్‌ వంటి హోటళ్లు కూడా హలీం తయారుచేస్తాయి. రమజాన్ మాసంలో ప్రతిరోజూ వందలాది టన్నుల హలీం వంటకాన్ని సిద్ధం చేస్తుంటారంటే హైదరాబాద్ నగరంలో హలీం డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో విదితమవుతోంది. రమజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందులో ప్రధానంగా హలీంను వడ్డిస్తుంటారు. ఇతర మతాల వారిని కూడా రా రమ్మని హలీం నోరూరిస్తుంటుంది.

విదేశాలకు హలీం ఎగుమతి

హైదరాబాదీ హలీంకు జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌‌ గుర్తింపు లభించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ హలీంను మలేషియా, సింగపూర్‌, సౌదీ అరేబియా వంటి దేశాలకు పోస్టల్‌, విమానాల ద్వారా పంపిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో హలీంను ఆన్‌‌లైన్‌ ద్వారా ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇంటికి చేరవేసేలా ఏర్పాట్లు చేశారు.

సినీనటి పూజాహెగ్డేకు ఇష్టమైన వంటకం

ప్రముఖ సినీనటి పూజా హెగ్డేకు ఇష్టమైన వంటకం హలీం. గతంలో కరోనా లాక్ డౌన్ కారణంగా తనకు బాగా నచ్చిన హలీంను చాలా మిస్ అవుతున్నానని ఆమె ఎక్స్ లో పోస్టు చేశారు. ‘‘రమజాన్ మాసంలో హైదరాబాదులో దొరికే హలీం వంటకాన్ని బాగా మిస్ అవుతున్నాను’’ అని పూజా హెగ్డే తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో గతంలో పోస్టు చేశారంటే దీన్ని ఆమె ఎంతగా ఇష్టపడుతున్నారో తెలుసుకోవచ్చు.

Read More
Next Story