హైదరాబాదీలు ఓటింగుకు దూరం..పోలింగ్ తగ్గడానికి కారణాలెన్నో...
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లలో చైతన్యం వెల్లివిరుస్తుంటే,యాభైశాతం మంది హైదరాబాదీలు ఓటింగుకు దూరంగా ఉంటున్నారు.పలు కారణాలతో పోలింగ్ శాతం పెరగడం లేదు.
గత 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం స్వల్పంగానే పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు చైతన్యవంతులు కావడంతో పోలింగ్ శాతం బాగా పెరిగింది. కానీ హైదరాబాద్ నగర పరిధిలో మాత్రం ఈ సారి ఎన్నికల్లోనూ స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగినా, మొత్తంమీద యాభై శాతం పోలింగ్ దాటలేదు. హైదరాబాదీలు ఓటింగుకు దూరంగా ఉండటానికి కారణాలపై ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం...
- తెలంగాణలో ఇతర గ్రామీణ ప్రాంతాల పార్లమెంట్ నియోజకవర్గాలతో పోలిస్తే హైదరాబాద్ నగర పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కంటే తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో స్వల్పంగా పెరిగింది.
- హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 44.75 శాతం పోలింగ్ నమోదు అయింది. తాజాగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ లో స్వల్పంగా 48.48 శాతానికి పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే 3.73 శాతం ఓటింగ్ పెరిగింది. మలక్ పేట అసెంబ్లీ సెగ్మెంటులో పోలింగ్ సగటు కంటే అతి తక్కువగా అంటే 42.76 శాతం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్ అసెంబ్లీ పరిధిలో అత్యధికంగా 54.72 శాతం ఓట్లు పోలయ్యాయి. పాత బస్తీ ఓటర్లు ఓటేసేందుకు ముందుకు రాని పరిస్థితి కనిపించింది. చార్మినార్, యాకుత్ పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా ప్రాంతాల్లో యాభైశాతానికి పైగా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు. మలక్ పేటలో మజ్లిస్ కార్యకర్తలు ఇంటింటికి వచ్చి తలుపులు బాది ఓటింగుకు తరలిరావాలని కోరినా ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాలేదు.
- సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 2019 ఎంపీ ఎన్నికల్లో 46.26 శాతం ఓటర్లు పోలింగులో పాల్గొన్నారు. ఈ సారి ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో పోలింగ్ శాతం 49.04కు పెరిగింది. సికింద్రాబాద్ లో గత ఎంపీ ఎన్నికల కంటే 2.78 శాతం ఓటింగ్ పెరిగింది. అక్షరాస్యతతోపాటు సంపన్నులు అధికంగా నివాసమున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది. నాంపల్లి, ముషిరాబాద్, సనత్ నగర్ ప్రాంతాల్లోనూ పోలింగ్ అంతంత మాత్రమే.
- మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గత 2019 ఎన్నికల్లో 45.65 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 48. 91శాతానికి పెరిగింది. మల్కాజిగిరి పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాల ఓటర్లు, వలస కార్మికులు వారి వారి స్వస్థలాల్లో ఓటేసేందుకు తరలివెళ్లారు. దీంతో పోలింగ్ ఆశించినంతగా పెరగలేదు.
జాబితాల్లో డబుల్ ఓటింగ్ కారణం
హైదరాబాద్ నగర ఓటర్ల జాబితాల్లో డబుల్ ఓటింగ్, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించక పోవడం, నగరానికి చెందిన యువతీ, యువకులు గల్ప్ దేశాల్లో పనిచేస్తుండటం వల్ల పోలింగ్ శాతం పెరగడం లేదని హైదరాబాద్ నగరానికి చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నగర పరిధిలో నివాసముంటున్న ఏపీ వాసులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు హైదరాబాద్ నగరంతోపాటు వారి వారి స్వస్థలాల్లో డబుల్ ఓటు ఉంటుంది. వారు తమ స్వస్థలాల్లో ఓటేసేందుకు ప్రాధాన్యమిచ్చి నగరం నుంచి తరలి పోయారని అందువల్ల హైదరాబాద్ పరిధిలోని మూడు పార్లమెంట్ స్థానాల్లో తక్కువ పోలింగ్ నమోదైందని శ్రీనివాసరెడ్డి చెప్పారు. పాతబస్తీకి చెందిన వేలాదిమంది యువతీ, యువకులు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, దీనివల్ల వారు ఓటింగుకు రారని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితాలో పేరున్న వృద్ధులు మరణించినా వారి పేర్లను జాబితా నుంచి తొలగించక పోవడంతో ఓటింగు తగ్గుతున్నట్లు కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితాలో డబుల్ నమోదును నివారించేందుకు ఆధార్ కార్డును ఓటరు కార్డుతో జతచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
పార్లమెంట్ నియోజకవర్గం పునర్ విభజనతో తగ్గిన పోలింగ్ శాతం
వాస్తవానికి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2009 ఎంపీ ఎన్నికల్లో 52.59 శాతం ఓట్లు పోలయ్యాయి. అనంతరం 2014 ఎంపీ ఎన్నికల్లో 53.30 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే నియోజకవర్గం పునర్ విభజన అనంతరం హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు మారిపోవడంతో పోలింగ్ శాతం కూడా తగ్గింది. 2019 ఎంపీ ఎన్నికల్లో 44.75 శాతం, ప్రస్థుత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 48.48 శాతానికి పోలింగ్ తగ్గింది. 2009 వ సంవత్సరం నుంచి ఇటీవలి డీలిమిటేషన్ అమలు చేసిన తర్వాత నగరంలో ఓటింగ్ శాతం తగ్గిందని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పోలింగ్ గణాంకాలు తెలుపుతున్నాయి.
2019లో అత్యల్ప ఓటింగ్ నియోజకవర్గాల్లో హైదరాబాద్ 4వ స్థానం
దేశంలో ఉగ్రవాద ప్రాబల్య ప్రాంతాలైన జమ్మూకశ్మీరులోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల తర్వాత హైదరాబాద్ అత్యల్ప పోలింగులో నాల్గవ స్థానంలో నిలిచిందని ప్రముఖ సామాజిక విశ్లేషకులు డి పాపారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. టెర్రరిస్టు పీడిత అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ అత్యల్పంగా ఉంటుందని, మన హైదరాబాద్ నగరంలో కూడా అలాంటి పరిస్థితే నెలకొందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న 20 లక్షల మంది ఏపీ ఓటర్లు హైదరాబాద్ వదిలి ఓటేసేందుకు వారి స్వస్థలాలకు వెళ్లారని, దీనివల్ల హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెరగడం లేదని పాపారావు తెలిపారు. నగరంలోని అత్యంత ధనవంతులు ఓటు వేసేందుకు రాక పోవడం కూడా పోలింగ్ శాతం తగ్గడానికి ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే జూబ్లీ హిల్స్ సెగ్మెంటులో తక్కువ పోలింగ్ జరిగిందని ఆయన చెప్పారు. ధనవంతులు ఏ ప్రభుత్వంలోనైనా వారి పనులు చేయించుకోగలుగుతారని, అలాంటప్పుడు వారికి ఓటుతో పనేముందన్నారు. కంపల్సరీ ఓటింగ్ విధానం, పోలింగ్ కోసం ఇచ్చిన సెలవు ఓటు వేస్తేనే ఇచ్చేలా చర్యలు తీసుకుంటే పోలింగ్ శాతం పెరుగుతుందని పాపారావు వివరించారు.
హైదరాబాద్ లో యాభై శాతం దాటని పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలోని ఇతర గ్రామీణ ప్రాంతాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం అధికంగా ఉన్నా, ఒక్క హైదరాబాద్ నగర పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే పోలింగ్ శాతం 50 శాతం దాటలేదు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మలక్ పేట,కార్వాన్,గోషామహల్,చార్మినార్,చాంద్రాయణగుట్ట,యాకుత్ పురా,బహదూర్‌పురా, ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రాంతాలున్నాయి. 2009లో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం డీలిమిటేషన్ లో వీటిని విలీనం చేశారు.
పోలింగ్ శాతం తగ్గడానికి ఓటర్లలో కొరవడిన చైతన్యమే కారణం
పాతబస్తీలో పోలింగ్ శాతం తగ్గడానికి మజ్లిస్ పార్టీనే కారణమని ఓల్డ్ సిటీ చత్తా బజార్ ప్రాంతానికి చెందిన సీనియర్ ఇస్లామిక్ జర్నలిస్ట్, కాలమిస్ట్ ముహమ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పాతబస్తీలో ఏ పార్టీ కూడా ప్రచారం కూడా చేయలేదని, అసలు ఎన్నికలు జరుగుతున్నాయని కూడా చాలామంది ఓటర్లకు తెలియదని ఆయన పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ కనీసం ఎన్నికల్లో మేనిఫెస్టోను కూడా విడుదల చేయరని, ఎలాంటి ప్రచారం, ఎలాంటి హామీలు ఇవ్వకుండానే గల్లీ లీడర్ల ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ సాగుతుందని ముజాహిద్ చెప్పారు. ఓటర్లను చైతన్యవంతులను చేస్తే వారు నిలదీస్తారనే భయంతో పాటు మజ్లిస్ వ్యతిరేక ఓటు పడుతుందని వారు అసలు ఎన్నికల గురించి ఎవరికీ చెప్పరని ముజాహిద్ వివరించారు. పాతబస్తీలో నిరక్షరాస్యత, నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణి పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలని ఆయన విశ్లేషించారు. ఎన్నికలంటే మజ్లిస్ పార్టీకి చెందిన గల్లీ లీడర్ల ఆధ్వర్యంలోనే అంతా పోలింగ్ డ్రామా సాగుతుందని, అందువల్లనే పాతబస్తీలో పోలింగ్ శాతం యాభై శాతం దాటడం లేదని ముజాహిద్ వివరించారు.
డీలిమిటేషన్‌లో రూపు మారిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం
1952వ సంవత్సరంలో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ముషీరాబాద్, సోమాజిగూడ, చాదర్‌ఘాట్, బేగంబజార్, శాలిబండ, కార్వాన్, హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి. అనంతరం 1957లో జరిగిన పునర్ విభజనలో సుల్తాన్ బజార్, బేగంబజార్, ఆసిఫ్‌నగర్, హైకోర్టు, మలక్‌పేట్, యాకత్‌పురా, ఫత్తర్ గట్టి అసెంబ్లీలను హైదరాబాద్ లో కలిపారు. 1962లో మళ్లీ సుల్తాన్ బజార్, బేగంబజార్, ఆసిఫ్‌నగర్, హైకోర్టు, మలక్‌పేట్, యాకత్‌పురా, ఫత్తరగట్టి స్థానాలున్నాయి.1967వ సంవత్సరంలో తాండూరు, వికారాబాద్, చేవెళ్ల, సీతారాంబాగ్, మలక్‌పేట్, యాకుత్‌పురా, చార్మినార్ సెగ్మెంట్ లను హైదరాబాద్ లో కలిపారు. 1977 తాండూరు, వికారాబాద్, చేవెళ్ల, కార్వాన్, మలక్‌పేట్, యాకుత్‌పురా, చార్మినార్ సెగ్మెంట్లు హైదరాబాద్ లో కొనసాగాయి. కానీ 2009వ సంవత్సరంలో జరిగిన ఎంపీ నియోజకవర్గాల పునర్ విభజనలో మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా అసెంబ్లీ స్థానాలను కలిపారు. గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలను తొలగించి హైదరాబాద్ లో పాత బస్తీ నియోజకవర్గాలు చేర్చడంతో పోలింగ్ శాతం తగ్గిపోయింది.
విజయంపై అభ్యర్థుల ధీమా
గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగినా ఎవరికి వారు ప్రధాన పార్టీలైన మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు విజయంపై ధీమాగా ఉన్నారు. హైదరాబాద్ నగర ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది.మూడు నియోజకవర్గాల్లోనూ గెలుపు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. హైదరాబాద్ నగర పరిధిలోని కీలకమైన మూడు పార్లమెంట్ స్థానాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరిలలో ఎవరు విజయం సాధిస్తారనేది జూన్ 4వతేదీ జరగనున్న ఓట్ల లెక్కింపులో తేలనుంది.
Next Story