హైడ్రా పోలీసుస్టేషన్లు వచ్చేస్తున్నాయ్
x

హైడ్రా పోలీసుస్టేషన్లు వచ్చేస్తున్నాయ్

చెరువుల్లో భవనాలను కూలుస్తున్న హైడ్రా మరింత దూకుడు ప్రదర్శించనుంది.హైడ్రా పేరిట చట్టాన్ని రూపొందించడంతోపాటు మూడు హైడ్రా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.


చెరువులు,మంచినీటి సరస్సులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (hydra) మరింత దూకుడుగా కూల్చివేతలు చేపట్టనుంది.రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైడ్రా పనిచేస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ ఏవీ రంగనాథ్ తాజాగా వ్యాఖ్యానించారు.

-తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరిట ప్రత్యేక చట్టాన్ని రూపొందించే పనిలో మున్సిపల్ శాఖ అధికారులున్నారు.హైడ్రా కొత్త చట్టం అమలులోకి రాగానే దీని పేరుతోనే కబ్జాదారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఓ హైడ్రా అధికారి చెప్పారు.
-చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాదారుల భరతం పట్టేందుకు వీలుగా హైడ్రా పేరిట ప్రత్యేకంగా మూడు పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం పోలీసు శాఖ కసరత్తు ఆరంభించింది. ఎంత మంది పోలీసులను హైడ్రా పోలీసుస్టేషన్లకు కేటాయించాలనే అంశంపై ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర హోంమంత్రిత్వశాఖకు పంపించనున్నారు.
- దుండిగల్ లోని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటీ,ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఇంజినీరింగ్ కళాశాల చెరువు బఫర్ జోన్ లో నిర్మించారని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కాలేజీలు నిర్మించారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.

హైడ్రాను ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు
దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ ఆక్రమణలకు వ్యతిరేకంగా అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ కావూరి కొండల వాసులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ల నేపథ్యంలో జస్టిస్ బొల్లారం విజయసేన్ రెడ్డి హైడ్రాపై మండిపడ్డారు.రహేజా టవర్స్ అకా ఇనార్బిట్ మాల్ కూల్చివేత జాబితాలో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. అది కూడా దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని, ఆ తర్వాతే కావూరి హిల్స్‌ ప్రారంభమవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

కబ్జాలపై ఇన్నాళ్లు ఏం చేశారు?
చెరువు కబ్జాలపై ఇన్నాళ్లూ ప్రభుత్వం ఏం చేస్తోందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని జడ్జి ప్రశ్నించారు. అనుమతి ఇచ్చిన తప్పుచేసిన ప్రభుత్వ అధికారులపై ముందుగా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.

అనధికార నిర్మాణాలపై నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?
‘‘హైదరాబాద్‌ నగరంలో లక్ష అనధికార నిర్మాణాలు ఉన్నాయి. లక్ష నోటీసులు ఎందుకు జారీ చేయలేదు? ఒక నిర్దిష్ట పార్టీ నిర్మాణాలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? అని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి ఆగస్టు 3న డిప్యూటీ కలెక్టర్‌ నుంచి నోటీసులు అందుకున్న పిటిషనర్ల బృందం గత 34 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్నామని, ఆ స్థలంలో భవనాలు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించి నిర్మించామని పేర్కొంటూ తమ వాదనలు వినిపించారు.

నిజామాబాద్ లోనూ చైతన్యం
హైడ్రా చర్యలతో నిజామాబాద్ జిల్లాలోనూ చెరువుల ఆక్రమణలపై ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసింది.నిజామాబాద్ జిల్లాలోని రామర్తి చెరువు ఆక్రమణలను తొలగించాలని కోరుతూ అర్సపల్లి ప్రజలు చెరువు వద్ద నిరసన చేశారు.కబ్జాల వల్ల 30 ఎకరాలు ఉన్న రామర్తి చెరువు ప్రస్తుతం 12 ఎకరాలకు తగ్గిపోయింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ స్పందించి చర్యలు తీసుకోవాలని అర్సపల్లి వాసులు కోరారు.రామర్తి చెరువు నిజామాబాద్-బోధన్ ప్రధాన రహదారిపై ఉంది.


Read More
Next Story