తెలంగాణలో కాంగ్రెస్,బీజేపీల మధ్యనే పోరు..సమానంగా సీట్లు కైవసం
x
BJP,Congress

తెలంగాణలో కాంగ్రెస్,బీజేపీల మధ్యనే పోరు..సమానంగా సీట్లు కైవసం

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పక్షాల అభ్యర్థుల మధ్యే పోరు సాగింది.8 స్థానాల్లో కాంగ్రెస్, 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు.


తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు రికార్డు సృష్టించారు.

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుపై 4.56 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ముందుండి కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డిని విజయం దిశగా నడిపించారు. ఎంపీ ఎన్నికల్లో స్థానికేతరుడైన రఘురామిరెడ్డికి 4.56 లక్షల మెజారిటీలో గెలిచి రికార్డు నెలకొల్పారు.

నల్గొండ కోటలో...
కాంగ్రెస్ పార్టీకి మరో కంచుకోట అయిన నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి 5.51 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయ దుందుభి మోగించారు. మరో కంచుకోట అయిన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 2.24 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 1.95లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వరంగల్ కోట నుంచి బరిలో నిలిచిన డాక్టర్ కడియం కావ్య 2.02 లక్షల ఓట్ల ఆధిక్యంతో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జహీరాబాద్ లో సురేశ్ షెట్కార్ 16,228 ఓట్ల ముందంజలో ఉన్నారు. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి 85వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్ల శాతం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 40.11 శాతం ఓట్లు లభించాయి. అత్యధిక శాతం ఓట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలే దక్కాయి. కాంగ్రెస్ కంటే 5 శాతం తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ కూడా 8 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 16.70 శాతం ఓట్లతో ఒక్క స్థానం కూడా దక్కలేదు. బీఆర్ఎస్ పార్టీకి తగ్గిన ఓట్ల శాతం కాంగ్రెస్, బీజేపీలకు మళ్లి పోయాయి. మజ్లిస్ పార్టీ కంచుకోట అయిన హైదరాబాద్ స్థానంలో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘన విజయం సాధించి ఓటమి ఎరగని ధీరుడిగా నిలిచారు.

బీజేపీ అభ్యర్థుల విజయ దుందుభి
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ మరో సారి తన సత్తాను చాటుకుంది.నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 1.13 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన బండి సంజయ్ 2.12 లక్షల ఓట్లతో విజయ దుందుభి సాధించారు. ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్ 78 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. మెదక్ ఎంపీగా బీజేపీకి చెందిన రఘునందన్ రావును విజయం వరించింది.చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ లో డీకే అరుణ,సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.బీజేపీకి ఓట్ల శాతం తగ్గిన కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 సీట్లు దక్కాయి.


Read More
Next Story