ఆ రెండు ఎంపీ స్థానాల్లో తమిళుల ఓట్లే కీలకం
x
తమిళసైను కలిసి వినతి పత్రాన్ని సమర్పిస్తున్న తెలంగాణ తమిళ సంఘం నేతలు బోస్, రాజకుమార్ తదితరులు

ఆ రెండు ఎంపీ స్థానాల్లో తమిళుల ఓట్లే కీలకం

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాల్లో తమిళ ఓటర్లు కీలకం కానున్నారు.తమిళ ఓటర్ల మద్ధతు కోసం పార్టీలు యత్నిస్తున్నాయి. తమిళసై ప్రచార రంగంలో దిగారు.


తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. రైల్వే, ఆర్మీ విభాగాలతోపాటు ఐటీ, ఇంజినీరింగ్, ఫార్మాస్యుటికల్ ఉద్యోగాలతోపాటు వ్యాపారాల్లో తమిళులున్నారు. చాలారోజులుగా తమిళనాడు నుంచి ఉద్యోగ రీత్యా తెలంగాణకు వలస వచ్చిన తమిళ తంబీలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొన్ని కీలక ప్రాంతాల్లో నివాసముంటున్నారు.

- తమిళుల్లో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని అల్వాల్, వెస్ట్ వెంకటాపురం, తిరుమలగిరి, యాప్రాల్, ఏఎష్ రావునగర్, కూకట్ పల్లి, బోయినపల్లి, బాలానగర్, చింతల్, ఉప్పల్, కంటోన్మంట్, మల్కాజిగిరి, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్, కాచిగూడ, పద్మారావునగర్, వెస్ట్ మారేడుపల్లి, రాంనగర్ తదితర ప్రాంతాల్లో తమిళీయన్లు అధికంగా నివాసముటున్నారు.
- మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో తమిళ ఓటర్లే కీలకంగా మారారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమిళ తంబీల మద్ధతు కోసం యత్నిస్తున్నాయి. కంటోన్మెంటు అసెంబ్లీ నియోజకవర్గంలో 20 శాతం తమిళ ఓటు బ్యాంకు ఉంది.
- ఇన్నాళ్లు గుర్తుకు రాని తెలంగాణ తమిళులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా వారి ఓట్లను పొందాలని ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ తమిళ సంఘం నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తీరుస్తామంటూ నేతలు, అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు.

తెలంగాణ తమిళుల సమస్యలు...
హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న ఇతర రాష్ట్రాల వారికి గత ప్రభుత్వం రాష్ట్ర సంఘ భవనాల నిర్మాణానికి స్థలాలు, నిధులు ఇచ్చిందని, కానీ 9 లక్షలమంది తమిళీయన్లు ఉన్న తమ సంఘానికి భవన నిర్మాణం కోసం స్థలం, నిధులు ఇవ్వలేదని తమిళులు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో ఫస్ట్ లాంగ్వేజ్ గా తమిళ భాషను బోధించేవారు. తమ మాతృభాష తమిళాన్ని రద్దు చేయడంతో తమ పిల్లలకు మాతృభాష అయిన తమిళం రావడం లేదని తమిళులు ఆవేదనగా చెప్పారు.

తమిళభాష బోధనను పునరుద్ధరించండి
హైదరాబాద్ నగరంలోని కాచిగూడ ప్రభుత్వ పాఠశాల, సికింద్రాబాద్ లోని రాగూర్ స్కూలు, కీస్ హైస్కూల్, అల్వాల్ ప్రభుత్వ పాఠశాలల్లో తమిళ భాషను బోధించే వారు. 2021వ సంవత్సరంలో తమిళ భాష బోధనను ఎత్తివేశారు. దీంతో తమకు తమిళ భవన్ నిర్మాణానికి హైదరాబాద్ నగరంలో రెండు ఎకరాల స్థలం, నిధులు ఇవ్వడంతో పాటు తమిళభాష బోధనను పాఠశాలల్లో తిరిగి ప్రవేశపెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ తమిళ సంఘం కార్యదర్శి రాజ్ కుమార్ శివాజీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

తమిళ మహిళా ఓటర్ల మద్ధతు ఏ పార్టీకి...?


తమిళ తంబీల వినతులు

తమిళనాడు రాష్టంలోని కన్యాకుమారి, మధురై ప్రాంతాలకు చెందిన తమిళులు తెలంగాణలో నివాసముంటున్నారని, తాము స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలును చెంగల్ పట్టు రైల్వే స్టేషన్ నుంచి కన్యాకుమారి వరకు పొడిగించాలని కోరుతున్నట్లు తెలంగాణ తమిళ సంఘం అధ్యక్షుడు ఎంకే బోస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
- చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలును కన్యాకుమారి వరకు పొడిగించాలనే డిమాండుపై గత గవర్నర్ తమిళసైకు, దక్షిణ మధ్య రైల్వే జీఎంకు, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డికి తమ తెలంగాణ తమిళ సంఘం వినతిపత్రాలు సమర్పించిందని బోస్ తెలిపారు. తాము చేసిన వినతిపై అప్పటి గవర్నర్ తమిళసై కేంద్ర రైల్వే మంత్రికి కూడా లేఖ రాసినా చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను కన్యాకుమారి స్టేషన్ వరకు పొడిగించలేదని బోస్ చెప్పారు. దీంతో ఈ ఎన్నికల్లో తాము మళ్లీ బీజేపీ నేతలకు తమ డిమాండు గుర్తు చేస్తున్నామని బోస్ వివరించారు.

సీఎం రేవంత్ అప్పాయింట్ మెంట్ కోరిన తెలంగాణ తమిళ సంఘం
తమిళుల సంక్షేమం కోసం పనిచేసేందుకు తెలంగాణ తమిళ సంఘం ఏర్పాటైంది. తెలంగాణలో తమిళులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు తాము సీఎం అప్పాయింట్ మెంట్ కోరుతూ సీఎంఓకు లేఖ,ఈమెయిల్ పంపించామని, ఇంకా తమకు సీఎం నుంచి పిలుపు రాలేదని తమిళ సంఘం అధ్యక్షుడు ఎంకే బోస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

తమిళుల ఓట్ల కోసం తమిళసై వల
పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళ ఓటర్ల మద్ధతు కోసం పలు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు యత్నాలు ప్రారంభించారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో తమిళులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, ఎన్నికల్లో తమకు మద్ధతు ఇవ్వాలని ప్రధాన పార్టీల నేతలు తమిళ ఓటర్లు, తమిళ సంఘం నేతలను అభ్యర్థిస్తున్నారు. బీజేపీ ఏకంగా తెలంగాణ మాజీ గవర్నర్ అయిన తమిళసైను ప్రచారరంగంలోకి దించింది. తమిళసై సోమవారం ఛెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చి బీజేపీ కార్యాలయంలో తన ప్రచార ప్రణాళికపై బీజేపీ నేతలతో చర్చించారు. తమిళనాడు నుంచి కాంగ్రెస్ నేతలను కూడా ప్రచారం కోసం తెలంగాణకు రప్పించాలని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు.

బీజేపీ నాయకురాలు తమిళసైకు తమిళ ఓటర్ల స్వాగతం


సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జీగా తమిళసై

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జీగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళసైను బీజేపీ హైకమాండ్ నియమించింది. తమిళనాడు నుంచి బీజేపీ వాలంటీర్లతో కలిసి వచ్చిన తమిళసై సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజవకర్గంపై దృష్టి కేంద్రీకరించనున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ మంది తమిళ ఓటర్లు ఉండటంతో ఆమెను బీజేపీ ఇన్ చార్జీగా నియమించింది. తమిళసై తమిళ ఓటర్లు అధికంగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచారం సాగించనున్నారు.
మొత్తం మీద తమిళ ఓటర్ల మద్ధతు కోసం ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. మరి తమిళ తంబీలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్ధతు ఇస్తారనేది జూన్ 4వతేదీ ఎన్నికల ఫలితాల్లోనే తేలనుంది.







Read More
Next Story