తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగిన మద్యం,మనీ ప్రవాహం
x
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవహించిన మద్యం, మనీ

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగిన మద్యం,మనీ ప్రవాహం

తెలంగాణ ఎన్నికల్లో మద్యం,మనీ ప్రవాహం పెరిగింది.ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎన్నికల్లో డబ్బు,మద్యం, ఉచితాల పంపిణీ పెరుగుతుందని పోలీసుల సీజ్ లెక్కలే చెబుతున్నాయి.


తెలంగాణలో ముగిసిన పార్లమెంట్ ఎన్నికల పర్వంలో మనీ, మద్యం ప్రవాహం జోరందుకుందని తేలింది. ఏ యేటికాఏడు ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహం పెరుగుతోందని తెలంగాణ పోలీసులు ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న మద్యం, డబ్బు లెక్కలే చెబుతున్నాయి.

- ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ పోలీసులు రూ.191.16 కోట్ల విలువైన మద్యం,డబ్బు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా ప్రకటించారు. రూ. 98.82 కోట్ల నగదు, రూ. 10.81 కోట్ల విలువైన మద్యం,రూ. 62.77 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.7.11కోట్ల విలువైన డ్రగ్స్‌ను తాము స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉచితాలు...
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వారికి వివిధ రకాల బహుమతులు ఇచ్చేందుకు కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు సిద్ధం చేసిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు ఉచితంగా అందించేందుకు కుక్కర్లు, చీరలు, గోడ గడియారాలు...ఇలా ఒకటేమిటి పలురకాల బహుమతులను పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రూ.11.65కోట్ల విలువైన వస్తువులను తాము స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అంటే దొరికిన బహుమతులు 11కోట్లరూపాయలు దాటాయంటే, పోలీసుల కన్నుగప్పి ఓటర్లకు పంపిణీ చేసిన ఉచితాలు ఎన్నో ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్ గోనే రాజేంద్రప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఎన్నికల్లో మద్యం, మనీ ప్రవాహం గురించి చెబుతున్న తెలంగాణ డీజీపీ రవిగుప్తా, ఇతర పోలీసు అధికారులు

పెరిగిన డబ్బు పంపిణీ
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయపార్టీలు, అభ్యర్థులు వేల కోట్ల రూపాయలను ఓటర్లకు పంపిణీ చేశాయని హైదరాబాద్ కు చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వాస్తవానికి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు మద్యం, మనీ, బహుమతులను దొంగచాటుగా పంపిణీ చేశారని, కానీ పోలీసులు పట్టుకుంది మాత్రం నామమాత్రమని ఆయన అభిప్రాయపడ్డారు.

డబ్బు పంపిణీ కేసుల్లో శిక్షలేవి?
సెక్షన్ 171 ప్రకారం ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బు, మద్యం పంపిణీ చేయరాదు. కానీ ప్రతీ ఎన్నికల్లోనూ ఇలా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ యదేచ్ఛగా చేస్తున్నా పోలీసులు నామమాత్రంగా కేసులు పెడుతున్నారే కానీ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీకి శిక్ష పడలేదని పద్మనాభరెడ్డి చెప్పారు. పోలీసులు మద్యం, మనీ సీజ్ చేస్తూ షో చేస్తున్నారే తప్ప అసలు మద్యం,మనీ పంపిణీని అడ్డుకోవడం లేదని, ఇది తమ పరిశీలనలో తేలిందని ఆయన పేర్కొన్నారు.

తూతూ మంత్రంగానే పోలీసుల తనిఖీలు
ప్రతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే, ఎన్నికల కోడ్ అమలులోకి వస్తోంది. దీంతో ఎన్నికల్లో మద్యం, మనీ ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయడం, ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు. ప్రతీ ఎన్నికల్లోనూ డబ్బు, మద్యం పంపిణీ పెరుగుతున్నా, దీన్ని కట్టడి చేసేందుకు పోలీసులు, ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల్లో పోలీసులు తనిఖీలు, నగదు, మద్యం పంపిణీ తూతూ మంత్రంగానే సాగుతోంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం అసలు ఓటర్లకు చేరుతూనే ఉందని, పోలీసులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారని సీనియర్ ఇస్లామిక్ జర్నలిస్ట్ షేక్ ముహ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో...
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులు డబ్బుతోపాటు మద్యం,బంగారం, ఉచితంగా పంపిణీ చేసేందుకు తెచ్చిన బహుమతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ డబ్బు, మద్యం ప్రవాహం జోరుగా సాగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు సీజ్ చేసిన రూ.699 కోట్ల నగదు, ఇతర వస్తువులు తీసుకునేందుకు ఏ రాజకీయ పార్టీ కాని, అభ్యర్థులెవరూ ముందుకు రాలేదు. గత ఎన్నికల్లో 10,106 కేసులు నమోదు చేశారు.

దేశంలో రోజుకు రూ. వంద కోట్ల సీజ్
దేశంలో ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రోజుకు వంద కోట్ల రూపాయల మేర నగదు దొరికింది. దేశంలో ఈ ఎన్నికల్లో 5వేల కోట్లరూపాయలకు పైగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో రూ.1,760 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2018తో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా డబ్బును పోలీసులు జప్తు చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం రూ.3,475 కోట్లను సీజ్ చేయగా, ఈ సారి పట్టుకున్న డబ్బు అనూహ్యంగా పెరిగింది. అంటే గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిందని పోలీసులు సీజ్ చేసిన నగదు నిల్వలే చెబుతున్నాయి.

ఎన్నికల్లో పట్టుకున్న మద్యం, మనీ ఏం చేస్తారంటే...
ఎన్నికల సమయంలో దొరికిన డబ్బు రూ.10 లక్షలకు పైగా ఉంటే, పోలీసులు దాన్ని ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారికి అందజేస్తారు. నగదు కోల్పోయిన వ్యక్తి నగదు తమదని తగిన ఆధారాలు చూపించి దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పోలీసులు సీజ్ చేసిన డబ్బు ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చిందో ఆధారాలు చూపించి తీసుకోవాలి. సరైన పత్రాలు చూపించకుంటే ఆ డబ్బును కోర్టు కస్టడీలో ఉంచుతారు. ఎవరూ క్లెయిమ్ చేయకపోతే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి పోతోంది. ఎన్నికల్లో సీజ్ చేసిన మద్యాన్ని పోలీసులు ఎక్సైజ్ శాఖకు అందజేస్తారు. వారు ఆ మద్యాన్ని విక్రయించకుండా రోడ్డు రోలరుతో తొక్కించి నాశనం చేస్తుంటారు.


Read More
Next Story