కొండెక్కిన కూరగాయల ధరలు...కొనలేం, తినలేం అంటున్న పేదలు
దేశంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు....
దేశంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వంటింటి ఖర్చు విపరీతంగా పెరగడంతో అల్పాదాయ వర్గాల వారు కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనలేం, తినలేమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పెరిగిన ఉల్లి ధరలు ఇంకా దిగి రాలేదు. ఉల్లిగడ్డలు కిలో ధర రిటైల్ మార్కెట్ లో 30 నుంచి 33 రూపాయలు పలుకుతోంది. అదే షాపింగ్ మాల్స్ లో అయితే కిలో ఉల్లి ధర 43రూపాయల దాకా విక్రయిస్తున్నారు. చిన్న ఉల్లి ధర అయితే కిలో 49 రూపాయల నుంచి 81 రూపాయలుగా ఉంది. మలక్ పేట ఉల్లి హోల్ సేల్ మార్కెట్ కు ఉల్లి లారీలు వస్తున్నా ధరలు మాత్రం దిగి రావడం లేదని ఉల్లి హోల్ సేల్ వ్యాపారి మనోహర్ చెప్పారు.
కిలో ఎల్లిగడ్డ ధర రూ.400
మరో వైపు ఎల్లిగడ్డ కిలో ధర 400రూపాయలకు పెరిగింది. కిలో ఎల్లిగడ్డలు కొనే వారు బుధవారం పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. షాపింగ్ మాల్స్ లో అయితే కిలో ఎల్లిగడ్డల ధర 483రూపాయలుంది. గత వారం విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 10.4 శాతానికి చేరుకుంది. కూరగాయల ద్రవ్యోల్బణం 26.30శాతం కాగా, పప్పుధాన్యాల్లో 19.60శాతం పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా వాటిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సునీతారావు డిమాండ్ చేశారు.
ఆకాశన్నంటిన కూరగాయల ధరలు
గతంలో తగ్గిన టమాట ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. ప్రస్థుతం రిటైల్ మార్కెటులో కిలో టమాట ధర 32 రూపాయల నుంచి 36 రూపాయలుగా ఉంది. అదే షాపింగ్ మాల్స్ లలో కిలో టమాట ధర 34 నుంచి 46 రూపాయలు పలుకుతోంది. బోయిన్ పల్లిలోని కూరగాయల మార్కెట్ కు టమాట లారీలు వస్తున్నా ధర మాత్రం దిగి రావడం లేదు. కూరగాయల మార్కెట్ లో కిలో పచ్చిమిర్చి ధర 46 రూపాయల నుంచి 51 రూపాయలుంది. షాపింగ్ మాల్స్ లలో కిలో పచ్చిమిర్చిని 66 రూపాయలకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కూరగాయల మార్కెట్ లో బుధవారం ఉదయం కూరగాయల ధరలను అడిగితే అన్నీ ధరలు విపరీతంగా పెరిగాయని లత అనే గృహిణి చెప్పారు.
కూరగాయల ధరలన్నీ పెరిాగాయ్...
బీట్రూట్ కిలో ధర బుధవారం 43 నుంచి 47 రూపాయల ధర పలుకుతోంది. ఆలుగడ్డలు కిలో ధర 35 రూపాయల నుంచి 38 రూపాయలకు విక్రయిస్తున్నారు. పచ్చి అరటి కాయ ఒక్కోటి 9 రూపాయలుంది. ఉసిరికాయల ధరలు కిలో 69 రూపాయల నుంచి 76 రూపాయలకు చేరింది. క్యాప్సికం కిలో ధర 47రూపాయల నుంచి 60 రూపాయలకు పెరిగింది. పొట్లకాయల ధరలు కూడా 43రూపాయలకు పెరిగింది. శీతాకాలం ముగియనున్న నేపథ్యంలో వేసవికాలం రాకముందే కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగాయని రాధిక అనే గృహిణి ఆవేదనగా చెప్పారు. పచ్చి బఠానీల కిలో ధర 62 రూపాయలు, బీన్స్ కిలో ధర 57 రూపాయలకు చేరింది. 15 రూపాయలున్న క్యాబేజీ ధర 25రూపాయలకు పెరిగింది. క్యారెట్ కిలో ధర మార్కెటులో 55 రూపాయలుంది. కొబ్బరికాయ ధర కూడా 20 రూపాయల నుంచి 39రూపాయలకు పెరిగింది.
బుధవారం మార్కెట్‌లో ధరలు
బుధవారం మార్కెట్ లో క్యాలిఫ్లవర్ ధర 34 రూపాయలకు చేరింది. కూరగాయలతో పాటు ఆకుకూరల ధరలు కూడా పెరిగాయి. కొత్తిమీర కట్ట ధర 14రూపాయలకు పెరిగింది. గోంగూర, పాలకూర, తోటకూర,కోయకూర, మెంతికూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మునక్కాయల కిలో ధర 127 రూపాయలకు పెరిగింది. దోసకాయల ధర కిలో 30 రూపాయలు పలుకుతోంది. కిలో వంకాయల ధర 40రూపాయలకు చేరింది. నిమ్మకాయల ధర కూడా పెరిగింది. మష్రూరం కిలో ధర 114రూపాయలుంది. బెండకాయలు కిలో ధర 51రూపాయలుంది. మరో వైపు ఎల్లిగడ్డలతోపాటు అల్లం కిలో ధర 120 రూపాయల నుంచి 132 రూపాయలకు చేరింది.
పెరిగిన బియ్యం, పప్పుల ధరలు
తెలంగాణలో బియ్యం, పప్పుల ధరలు కూడా పెరిగాయి. బాస్మతి బియ్యం కిలో ధర 130 రూపాయలకు పెరిగింది. సోనా మసూరి 25 కిలోల ధర 1768రూపాయలకు చేరింది. అలలాగే కర్నూల్ రైస్ 5కిలోల బ్యాగ్ ధర 340 రూపాయలుంది. అదే జైశ్రీరాం బియ్యం 26 కిలోల ధర 1876రూపాయలకు పెరిగింది. బియ్యంతోపాటు కిలో కందిపప్పు ధర 146 రూపాయలకు పెరిగింది. మినపగుండ్లు కిలో ధర 160 రూపాయలు పలుకుతోంది. బుధవారం మార్కెట్ లో పెసలు కిలో ధర 65 రూపాయలుంది. పెసరపప్పు కిలో ధర 83రూపాయలుంది. పుట్నాలు కిలో ధర 71రూపాయలు, మసూర్ దాల్, చనపప్పు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వల ధరలు కూడా పెరిగాయి.
పెరిగిన ధరలను నియంత్రించేవారేరి?
మార్కెటులో పెరిగిన నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయల ధరలను నియంత్రించేవారు కరువయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణపై దృష్టి సారించడం లేదు. దీంతో ఏ నెల కా నెల నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రాలేదు. దీంతో రవాణ వ్యయం పెరగడం కూడా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమని ఓ అధికారి చెప్పారు. పెరిగిన నిత్యావసరాల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలని ఆహార సలహా సంఘం మాజీ సభ్యుడు బీవీ రమణ డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రంతోపాటు పౌర సరఫరాల శాఖ రంగంలోకి దిగి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని రమణ సూచించారు.