కూరగాయల ధరలకు రెక్కలు...వంటిళ్లలో ధరల భారం
x
హైదరాబాద్ నగరంలో ఆకాశన్నంటుతున్న కూరగాయల ధరలు

కూరగాయల ధరలకు రెక్కలు...వంటిళ్లలో ధరల భారం

హైదరాబాద్‌లో కూరగాయల ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.అకాల వర్షాలు,మండుతున్న ఎండలు,నీటి సమస్యలతో దిగుబడి తగ్గి కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి.


తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు... మండుతున్న ఎండలతో వివిధ కూరగాయల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ నగరంతోపాటు పలు పట్టణాల మార్కెట్లలో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి.

- చిక్కుడు కిలో ధర వంద రూపాయలకు చేరింది. బీన్స్ కిలో 150 రూపాయలకు పెరిగింది. కొన్ని కూరగాయల ధరలు సెంచరీ దాటాయి.
- హైదరాబాద్ నగరంలోని రైతుబజార్లు, వీక్లీ కూరగాయల సంతల్లో కూరగాయలు కొనడానికి వచ్చిన గృహిణులు ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. కిలోల చొప్పున కూరగాయలు కొనే గృహిణలు పావుకిలో, అరకిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

కొండెక్కిన కూరగాయల ధరలు
తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు, మండుతున్న ఎండలు, తగ్గిన సాగువిస్తీర్ణంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. టమాటా ధరలు కిలో మార్కెట్ లో రూ.40లకు విక్రయిస్తుండగా షాపింగ్ మాల్స్ లో 50 రూపాయల ధర పలుకుతోంది. పచ్చిమిర్చి ధర కిలో 150 రూపాయలకు పెరిగింది. సాగునీటి కొరత వల్ల ఈ వేసవిలో పచ్చిమిర్చి దిగుబడి తగ్గింది. మార్కెట్ లోనూ కిలో పచ్చిమిర్చి 120రూపాయలకు విక్రయిస్తున్నారు. బీట్రూట్ కిలో ధర 43 రూపాయల నుంచి 59 రూపాయల దాకా పెరిగింది. ఆలుగడ్డ ధరలు కూడా 30 నుంచి 50 రూపాయల దాకా పెరిగింది.

మండుతున్న ధరలు
గతంలో చవకగా లభించిన క్యాప్సికం కిలో ధర 55 నుంచి 76 రూపాయలకు పెరిగింది. క్యాబేజీ కిలో ధర 30 నుంచి 54 రూపాయలకు, క్యాలీప్లవర్ 31 నుంచి 45 రూపాయలకు చేరింది. క్యారెట్ కిలో ధరల 41 నుంచి 68 రూపాయలకు పెరిగింది. కొబ్బరికాయల ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. 20 రూపాయలకు లభించే కొబ్బరికాయలు 41 రూపాయలకు పెరిగింది. మునక్కాయల ధర కూడా అనూహ్యంగా పెరిగింది. కొత్తిమీర, కరివేపాకు నుంచి గోంగూర, పాలకూర, తోటకూర, కోయ తోటకూర దాకా అన్ని ఆకు కూరల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వంకాయ కిలో 33 రూపాయల నుంచి 50 రూపాయలకు చేరింది. బీరకాయలు, బెండకాయలు,పచ్చి బఠానా ఇలా ఒకటేమిటి అన్ని రకాల కూరగాయల ధరలు అనూహ్యంగా పెరిగాయి. 10రూపాయలకు లభించే నిమ్మకాయలకు ప్రస్థుతం 40 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.

అకాల వర్షాలతో దెబ్బతిన్న కూరగాయల తోటలు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. దీంతో పలు కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. సిద్ధిపేట, తూఫ్రాన్, భువనగిరి, మేడ్చల్, శంషాబాద్ తదితర హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూరగాయలు పండించే వారు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో ఇతర దూర ప్రాంతాల నుంచి కూరగాయలను రవాణా చేసుకోవాల్సివస్తోంది. దీనివల్ల కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి కూరగాయలు మరో నెలరోజుల దాకా తక్కువగానే వస్తాయని కూరగాయల రైతు యాదయ్య చెప్పారు. తక్కువ కూరగాయలు రావడం వల్ల ధరలు అమాంతం పెంచక తప్పలేదని మరో రైతు భీం రెడ్డి పేర్కొన్నారు.

మండుతున్న ఎండలతో తగ్గిన కూరగాయల దిగుబడులు
తెలంగాణలో మండుతున్న ఎండలతో కూరగాయల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీంతో కూరగాయల కొరత ఏర్పడటంతో ధరలు ఆకాశన్నంటాయి. హైదరాబాద్ నగరంలో రైతుబజార్లతో పాటు వారాంతపు సంతల్లోనూ కూరగాయల ధరలు అనూహ్యంగా పెరగడంతో తాము కొనేటట్టు లేదు, తినేటట్టు లేదని తార్నాకకు చెందిన రాయగిరి రజిత అనే గృహిణి ఆవేదనగా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కూరగాయల ధరలు గణనీయంగా పెరగడంతో వంటిల్లు నిర్వహణ భారం పెరిగిందని మరో గృహిణి టి భవానీ చెప్పారు.

ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల రవాణ
ఈ వేసవి చివర తెలంగాణలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు తగ్గాయని బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ అధికారి కె నర్సింహారెడ్డి చెప్పారు. అకాల వర్షాలు, ఎండలతో దిగుబడులు తగ్గడంతో కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూరగాయల రవాణ
ఢిల్లీ నుంచి ఆలుగడ్డలు, రాంచీ నుంచి బిన్నీస్, జైపూర్ నుంచి టమాట లారీలు వస్తున్నాయని, దూరాభారం నుంచి కూరగాయలు తెప్పించుకోవాల్సి రావడం వల్ల రవాణ ఖర్చుల భారం వల్ల ధరలు అమాంతం పెరిగాయని బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ కమీషన్ ఏజెంటు గుంటి అజయ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కర్ణాటకలోని బెల్గాం నుంచి సన్న మిర్చి తెప్పించుకోవడం వల్ల రవాణ చార్జీలు పెరిగాయని అజయ్ పేర్కొన్నారు. ప్రతీ ఏటా బిన్సీస్, చిక్కుడు కాయలు కర్ణాటక నుంచి వస్తుంటాయని, కానీ ఈ ఏడాది సాగునీటి సమస్య వల్ల అక్కడ పండక ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూరగాయల లారీలు తెప్పిస్తున్నామని అజయ్ వివరించారు.

రియల్ ఎస్టేట్ వల్ల తగ్గిన కూరగాయల సాగు
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో గతంలో రైతులు విస్తారంగా కూరగాయలు పండించే వారని తెలంగాణ హార్చికల్చర్ శాఖ మాజీ డైరెక్టర్ ఎల్ వెంకట్రామిరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ప్రస్థుతం హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో రియల్ భూమ్ పెరగడం వల్ల కూరగాయలు తోటలు వేసిన భూముల్లో భవనాలు వెలుస్తున్నాయని, దీనివల్ల తెలంగాణలో కూరగాయల సాగు గణనీయంగా తగ్గిందని వెంకట్రామిరెడ్డి చెప్పారు. కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల కూరగాయలను ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన వివరించారు.


Read More
Next Story