బీసీలను కేసీయార్ రెచ్చగొడుతున్నారా ?
x
KCR in Chevella meeting (source BRS Twitter)

బీసీలను కేసీయార్ రెచ్చగొడుతున్నారా ?

కాసానిని ఎంపీగా గెలిపించి చూపించండని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని కేసీయార్ చెప్పటమే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ లో ఎవరు చాలెంట్ చేశారో కేసీయార్ చెప్పలేదు


తనకు అలవాటైన సెంటిమెంటు అస్త్రంతో పాటు బీసీలను కేసీయార్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చేవెళ్ళ ప్రచారసభలో మాట్లాడుతు ‘దమ్ముంటే బీసీనేత కాసానిజ్ఞానేశ్వర్ ను చేవెళ్ళలో గెలిపించి చూపించాలని బీసీలను కాంగ్రెస్ నేతలు సవాలుచేసి ఎగిరెగిరి పడుతున్నారు’ అని అన్నారు. బీసీలకు దమ్ముంటే కాసానిని గెలిపించుకోవాలని ఓసీలు సవాలు చేస్తున్నారని కేసీయార్ చెప్పటంలోనే కేసీయార్ బీసీలను రెచ్చగొడుతున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే బీసీ అభ్యర్ధిని గెలిపించి చూపించండని ఏ పార్టీ కూడా అందులోను ఎన్నికల సమయంలో అసలు అనదు. బీసీ నేతైన కాసానిని ఎంపీగా గెలిపించి చూపించండని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని కేసీయార్ చెప్పటమే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ లో ఎవరు ఈ విధంగా చాలెంట్ చేశారనే విషయాన్ని మాత్రం కేసీయార్ చెప్పలేదు. బట్టకాల్చి ప్రత్యర్ధులపైకి విసిరేయటం కేసీయార్ కు మొదటినుండి ఉన్న అలవాటే అని అందరికీ తెలిసిందే.

తెలంగాణా మొత్తం జనాభాలో బీసీలు 56 శాతం ఉన్నారు. బీసీల ఓట్లలో మెజారిటి ఏ పార్టీకి పడితే ఆ పార్టీ అభ్యర్ధి గెలుపుకు దగ్గరగా ఉంటారని అందరికీ తెలుసు. అందుకనే ప్రతిపార్టీ కూడా బీసీల ఓట్లకోసం తాపత్రయపడుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలను ఛాలెంజ్ చేసేలాగ మాట్లాడుతారా ? తమ పార్టీ అభ్యర్ధికి ఓట్లేసి గెలిపించండని అడగటం చాలా సహజం. అంతేకాని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి బీసీ నేత కాబట్టి ఓడించండని, బీసీ అభ్యర్ధిని దమ్ముంటే గెలిపించి చూపించండని ఏ పార్టీ కూడా చాలెంజ్ చేయదు. కాంగ్రెస్ వాళ్ళు చాలెంజ్ లు చేశారని చెబుతున్నారు కాబట్టి చాలెంజ్ చేసిన వాళ్ళపేర్లు చెప్పాల్సిన బాధ్యత కూడా కేసీయార్ మీదే ఉంది. ఇక తమ అభ్యర్ధి కాసాని గురించి చెబుతు బలహీన వర్గాల కోసం ఆస్తిని, జీవితాన్ని దారపోసిన వ్యక్తిగా కేసీయార్ అభివర్ణించటమే విచిత్రంగా ఉంది.

కాసాని జీవితాన్ని దారపోశారా ?

కాసానిని కేసీయార్ పరిచయంచేసిన తీరుతో జనాలంతా విస్తుపోయుంటారు. కాసాని పైన ఇప్పటికే భూకబ్జా ఆరోపణలు చాలా ఉన్నాయి. మరి బలహీనవర్గాల కోసం కాసాని దారపోసిన ఆస్తి, జీవితం ఏమిటో కేసీయారే చెప్పాలి. కాసానిని గెలిపించి బీసీల శక్తి, బీసీల రాజకీయ చైతన్యం ఏమిటో చాటాలని కేసీయార్ పిలుపివ్వటం వరకు బాగానే ఉంది. కాని కాసానిని కేసీయార్ మరో జ్యోతీరావు పూలే అన్న స్ధాయిలో బిల్డప్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది. నిజంగానే బీసీలపైన కేసీయార్ కు అంత ప్రేమే ఉంటే మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ లకు ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా ఎందుకివ్వలేదో చెప్పాలి. ముదిరాజులు సుమారు 26 లక్షలున్నారు. అంతమంది ఉన్న సామాజికవర్గానికి కేసీయార్ ఒక్క టికెట్ ఇవ్వని ఫలితం బీఆర్ఎస్ పైన మొన్నటి ఎన్నికల్లో కనబడింది. ఆ దెబ్బకే ఇపుడు చేవెళ్ళ లోక్ సభ టికెట్ ఇచ్చింది.

తప్పనిపరిస్ధితుల్లో బీసీల్లోని ముదిరాజ్ లకు టికెట్ ఇచ్చిన కేసీయార్ ఇపుడు మొత్తం బీసీలను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీసీల మద్దతుకోసం కేసీయార్ ఆరు టికెట్లిచ్చారు. బీజేపీ ఐదు నియోజకవర్గాల్లో టికెట్లిస్తే, కాంగ్రెస్ ముగ్గురు బీసీలకు టికెట్లు కేటాయించింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి అభ్యర్ధుల్లో మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగూ చేవెళ్ళ, జహీరాబాద్, మల్కాజ్ గిరి, భువనగిరి, నిజామాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి సీట్లలో పార్టీలు బీసీలకు టికెట్లు కేటాయించాయి. అభ్యర్ధులు కూడా ప్రచారాలు చేసుకుంటున్నారు. కాబట్టి సామాజికవర్గాలను కాకుండా అదే సామాజికవర్గాల్లో అభ్యర్ధులను మార్చే అవకాశాలు కనబడుతున్నాయి.

మతిలేని ఆరోపణలేనా ?

ఇదే విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు కేసీయార్ మాటలన్నీ తప్పుడుమాటలుగా కొట్టిపారేశారు. బుద్ధున్న ఏ నేతైనా బీసీ అభ్యర్ధిని గెలిపించుకోమని చాలెంజ్ చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అనని మాటలను అన్నట్లుగా కేసీయార్ చిత్రీకరించి బీసీ సామాజికివర్గాలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు అభిప్రాపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మొదటినుండి కాంగ్రెస్ లో ఉన్న ప్రాధానత్య ఏమిటో అందరికీ తెలుసన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ కు కేసీయార్ ఒక్క టికెట్ కూడా ఇవ్వని విషయాన్ని మహేష్ గుర్తుచేశారు. అలాగే బీసీ నేత ఈటల రాజేందర్ ను కేసీయార్ ఎంతగా అవమానించారో కూడా అందరు చూసిందే అన్నారు. అధికారమత్తు దిగిపోతున్న సమయంలో కేసీయార్ ఇలాంటి మాటలు మాట్లాడటం సహజమేని మహేష్ తేల్చిచెప్పారు.

Read More
Next Story