మంత్రుల ఇన్ కమ్ టాక్స్ కూడా కట్టుకోలేరా...కోర్టు ముందు ప్రశ్న
తెలంగాణలో సీఎం, మంత్రులు, సలహాదారులు, కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఆదాయపుపన్ను చెల్లింపులకు ప్రజాధనం వెచ్చించడంపై వివాదం రాజుకుంది.ఈ వివాదం హైకోర్టుకు చేరింది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పొందే జీతాలపై ఆదాయపు ప్ను చెల్లింపు నిబంధనను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ నగరానికి చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది.
- వేతనాలు,పెన్షన్,తొలగింపు చట్టం 1953లోని సెక్షన్ 4(3) కింద సీఎం,డిప్యూటీ సీఎం, మంత్రుల జీతాలకు సంబంధించిన ఆదాయపుపన్నును రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనం నుంచి చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పిల్ దాఖలు చేశారు.
- సీఎం, మంత్రులకు ప్రభుత్వమే ఐటీ చెల్లించడాన్ని పలు రాష్ట్రాల్లో రద్దు చేసినందున తెలంగాణలోనూ దీన్ని నిరోధించి ప్రజాధనం వృథా కాకుండా చూడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఐటీ చెల్లింపును రద్దు చేస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల మేర నిధులు ఆదా అవుతాయని ఆయన చెప్పారు.
మంత్రులు ఆదాయం నుంచే ఐటీ చెల్లించాలి...
ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ప్రజల మాదిరిగానే సీఎం, మంత్రులు ఆదాయపు పన్నును చెల్లించాలి. కానీ 2015వ సంవత్సరంలో తీసుకువచ్చిన జీఓ 917 ప్రకారం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, సలహాదారులు,ప్రెస్ అకాడమీ ఛైర్మన్, కార్పొరేషన్ ఛైర్ పర్సన్లు పొందుతున్న జీతాలపై ఆదాయపు పన్నును కూడా ప్రభుత్వమే ప్రజాధనం నుంచి చెల్లిస్తోంది. సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపుల గురించి సమాచార హక్కుచట్టం కింద సమాచారం అడగ్గా మంత్రుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందంటూ సమాచారం ఇవ్వలేదు.
ఐటీ చెల్లిస్తూ సమాచారం ఇవ్వరా?
ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచి సీఎం, మంత్రులకు ఐటీ చెల్లింపులు చేస్తూ, ఆ సమాచారాన్ని ఇవ్వటానికి ప్రభుత్వం నిరాకరించింది. ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతున్న వారంతా వారి వారి ఆదాయపు పన్నును వారి పొందుతున్న జీతాల నుంచి చెల్లించాలి. కానీ ప్రజాధనం నుంచి సీఎం మంత్రుల ఆదాయపు పన్ను చెల్లించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనంతో మంత్రుల ఐటీ చెల్లింపులను నిలిపివేయాలని కోరుతూ సోమ శ్రీనివాసరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ సెక్రటరీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
మంత్రుల ఐటీ చెల్లింపు
తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు, కేబినెట్ మంత్రి హోదా ఉన్న ఛైర్మన్లకు ఐటీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. మంత్రుల ఐటీ చెల్లింపులపై సమాచారాన్ని ఇవ్వాలని జీఏడీ కార్యదర్శిని అడిగితే ఈ సమాచారాన్ని ఇవ్వలేదు. సీఎంతోపాటు మంత్రులకు గత పదేళ్లుగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆదాయపు పన్నుగా చెల్లిస్తుందని సోమ శ్రీనివాసరెడ్డి పిల్ లో పేర్కొన్నారు. ప్రభుత్వమే ప్రజాధనంతో మంత్రుల ఐటీ చెల్లిస్తున్నపుడు ఇందులో రహస్యమెందుకని ఆయన ప్రశ్నించారు.
ప్రజాధనంతో ఐటీ ఎలా చెల్లిస్తారు?
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కౌన్సిల్ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, కేబినెట్ మంత్రి హోదా ఉన్న సలహాదారులు, అన్ని కార్పొరేషన్ల ఛైర్ పర్సన్లు,అసెంబ్లీ, కౌన్సిల్ చీఫ్ విప్, అసెంబ్లీ, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ లు ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతున్నందున వారి ఆదాయం నుంచి ఐటీ చెల్లించాలని పిటిషనర్ సోమ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతో మంత్రుల ఐటీ ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం మంత్రుల ఐటీని ప్రజాధనంతో చెల్లించడం నిబంధనల ఉల్లంఘనగా ఆయన పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో మంత్రుల ఐటీ చెల్లింపు రద్దు
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ముఖ్యమంత్రి, మంత్రుల ఆదాయపు పన్ను చెల్లింపులకు ప్రజాధనం వెచ్చించకుండా సవరణలు చేశాయని పిటిషనర్ హైకోర్టుకు ఆధారాలు సమర్పించారు. 1953 ఏపీ పేమెంట్ సాలరీస్ యాక్ట్, ఆర్టీఐ దరఖాస్తు, చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖ, పత్రికల క్లిప్పింగులను ఆయన హైకోర్టుకు సమర్పించారు.
Next Story