రాష్ట్రపతి పాలనకు డిమాండ్: కేసీఆర్ బాటలోనే జగన్!
రేవంత్ ప్రభుత్వం ఏడాదిలో పడిపోతుందని కేసీఆర్ చెబితే, ఏపీలో చంద్రబాబు పాపాలు శిశుపాలుడిలాగా వేగంగా పెరిగిపోతున్నాయని, రాష్ట్రపతిపాలన విధించాలని జగన్ అంటున్నారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే సాగుతున్నారు. ఉగ్గబట్టలేకపోతున్నారు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వం పడిపోతుందా, మళ్ళీ ఎప్పుడు గద్దెనెక్కి కూర్చోవాలా అన్నట్టుగా ఉంది వీరిద్దరి ధోరణి. రేవంత్ ప్రభుత్వం ఏడాదిలో పడిపోతుందని కేసీఆర్ జోస్యం చెబితే, ఏపీలో చంద్రబాబు పాపాలు శిశుపాలుడిలాగా వేగంగా పెరిగిపోతున్నాయని, అర్జెంటుగా రాష్ట్రపతి పాలన విధించి చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని జగన్ అంటున్నారు.
అయితే కేసీఆర్ కంటే జగన్ కొద్దిగా బెటర్. ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా ఇంకా వెళ్ళలేదు. జగన్ నయం, కనీసం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు, రేపు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళబోతున్నారు.
వైసీపీ, బీఆర్ఎస్... రెండూ ప్రస్తుత ప్రభుత్వాలపై రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించాలని, జాతీయస్థాయిలో ఎండగట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని, ఈ పరిస్థితిని దేశమంతటా తెలిసేలా చేస్తామని, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని జగన్ ప్రకటించారు.శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని, 300పైగా హత్యాయత్నాలు జరిగాయని, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఇళ్ళలోకి చొరబడి 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని, షాపులను కాల్చేస్తున్నారని అన్నారు.
అటు బీఆర్ఎస్‌ను చూస్తే, ఫిరాయింపులకు పాల్పడటం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కటం వంటి అంశాలపై రాష్ట్రపతిని కలిసి వివరిస్తామని కేటీఆర్ చెప్పారు. ఆయన ఇవాళ తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసి, నిరుద్యోగ యువతపై కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను పదిమందిని ఆ పార్టీ చేర్చుకుందని చెప్పారు.
విచిత్రం ఏమిటంటే ఈ రెండు పార్టీలు ఇప్పుడు వేటి గురించైతే ఇంత యాగీ చేస్తున్నాయో, ఆ పనులను తమ పాలనలో వీరు ధారాళంగా చేశారు. జనం ఏమనుకుంటారో అని కూడా అనుకోకుండా ఇప్పుడు అవే అంశాలపై - ఎంత ఘోరం, ఎంత పాపం అంటూ నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లుగా అనిపిస్తోంది. మొన్న నెల్లూరులో పిన్నెల్లిని పరామర్శించటానికి వెళ్ళినప్పుడేమో, అతను బ్యాలెట్ బాక్సులు పగలగొట్టాడని నేరుగా మీడియాకు చెప్పారు, నిన్నేమో మీడియా మాట్లాడుతున్నప్పుడు ఎవరో అడ్డుపడితే - మధ్యలో ఆపితే ఫ్లో పోతుంది అని వారిపై కసురుకుని, ఏం మాట్లాడుతున్నాను అంటూ బుర్ర గోక్కుని పక్కవాళ్ళను అడుగుతున్నారు.
అసలు జగన్ ఫలితాలు వెలువడిన తర్వాత తమ పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమైనప్పుడు, కొత్త ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ వరకు అవకాశమిద్దాం, డిసెంబర్ నుంచి సమస్యలపై నిలదీద్దాం అని చెప్పారు. అది జరిగి నెల కూడా కాలేదు. అప్పుడే ఏపీలో అల్లకల్లోల పరిస్థితులు వచ్చినట్లుగా గోల మొదలుపెట్టేశారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం మంచి పరిణామం. జగన్ జడత్వాన్ని వీడి కార్యాచరణలోకి దిగారు. ఇలాగే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని ఆశిద్దాం.