ధర్నాలో కొత్త జగన్: ప్రత్యేక ఆకర్షణగా వైసీపీ ఎంపీ పరిమళ్ నథ్వాని
x
జగన్మోహన్ రెడ్డితో పరిమళ్ నథ్వాని

ధర్నాలో కొత్త జగన్: ప్రత్యేక ఆకర్షణగా వైసీపీ ఎంపీ పరిమళ్ నథ్వాని

మోదీ తరహాలో… సీఎమ్ పదవిలో ఉండగా ఎన్నడూ మీడియా ముందు నోరు విప్పని జగన్, ధర్నా శిబిరంలో రెట్టించిన ఉత్సాహంతో అనర్గళంగా ప్రసంగించటంతో జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు.


నిన్న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి మీడియావారిని ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరహాలోనే… ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఎన్నడూ మీడియా ముందు నోరు విప్పని జగన్, నిన్న ధర్నా శిబిరంలో రెట్టించిన ఉత్సాహంతో అనర్గళంగా ప్రసంగించటం, పైగా జర్నలిస్టులకు చేతులెత్తి మొక్కుతున్నానని అనటంతో ఈ కొత్త జగన్‌ను చూసి కంగు తినటం మీడియావారి వంతయింది.

జగన్ ప్రసంగమంతా పూర్తిగా ఆంగ్లంలోనే సాగింది. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, 300కు పైగా కార్యకర్తలు దాడులకు గురయ్యారని చెప్పారు. అధికారం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది అని తాత్వికంగా చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులకు చేతులెత్తి మొక్కిన జగన్

ధర్నా శిబిరంలో ఏర్పాటు చేసిన ఫోటోలు, వీడియో దృశ్యాల ప్రదర్శనను జర్నలిస్టులు క్షుణ్ణంగా పరిశీలించాలని యావత్ మీడియాను కోరుతున్నట్లు జగన్ పదే పదే చెప్పారు. ఈ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ఇది చేయకపోతే, ప్రజాస్వామ్యాన్ని ఎవరూ కాపాడలేరని అన్నారు. ఇవి చూసిన తర్వాత జర్నలిస్టులు తమను తాము ప్రశ్నించుకోవాలని, ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఆ స్థానంలో తాము ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యలో ఇలాంటి చర్యలను అనుమతించవచ్చా, లేదా అని ప్రశ్నించుకోవాలని అన్నారు. దీనిని హైలైట్ చేయాలని యావత్ జాతీయ మీడియాకు చేతులెత్తి వినయంగా అర్థిస్తున్నానని చెప్పారు.

మహిళా జర్నలిస్టును టాపిక్ డైవర్ట్ చేయొద్దన్న జగన్

జగన్ మాట్లాడుతుండగా ఒక మహిళా జర్నలిస్ట్… చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేయటంపై ప్రశ్నించబోయారు. జగన్ ఆమె మాటలకు అడ్డుపడుతూ, అమ్మా, ఒక్క సెకను, ఒక్క సెకను ఆగు అన్నారు. దయచేసి ఈ టాపిక్‌ను డైవర్ట్ చేయవద్దు అన్నారు. ఈ ప్రదర్శనలో పెట్టిన ఫోటోలను, వీడియోలను చూడాలని, ఏపీలో దారుణమైన అకృత్యాలు జరిగాయని చెప్పారు. ఆ పరిస్థితిలో మీరే ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోవాలని అన్నారు. దానిలో భాగం అవ్వాలని చెప్పారు. ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంటిని ధ్వంసం చేయటం, మిమ్మల్ని చంపేయటం మీకు ఇష్టమా అని అడిగారు. ఈ టాపిక్‌ను పక్కకు మళ్ళించే ముందు, కామెంట్ చేసేముందు ఈ ప్రదర్శనను చూడాలని అన్నారు. దయచేసి ప్రజాస్వామ్య రక్షకులు కావాలని జర్నలిస్టులను కోరారు. టాపిక్ డైవర్ట్ చేసేముందు, వేరే విషయం మాట్లాడేముందు ఫోటోలు, వీడియోలు చూడాలని మిమ్మల్ని అర్థిస్తున్నానని అన్నారు.

జగన్‌కు అండగా నిలబడ్డ అంబానీల ఎంపీ పరిమళ్ నథ్వాని

ఢిల్లీ ధర్నాలో ఆద్యంతం జగన్ పక్కనే ఉన్న ఒక కొత్త వ్యక్తి, లావాటి, పొట్టి, ఎర్రటి మనిషి ప్రత్యేక ఆకర్షణగా కనబడ్డారు. ఆయన చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఆయనే బీజేపీ పెద్దల సూచనతో జగన్మోహన్ రెడ్డి ఏపీనుంచి వైసీపీ తరపున రాజ్యసభకు పంపిన పరిమళ్ నథ్వాని. ఆయన అంబానీల మనిషి. రిలయన్స్‌లో డైరెక్టర్.

పరిమళ్ నథ్వాని 2008 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ పార్లమెంట్‌లో తమ ప్రతినిధిగా ఒక వ్యక్తిని పెట్టుకుంటూ ఉంటుంది. ఈయన 16 సంవత్సరాలనుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2008నుంచి 2020 దాకా జార్ఖండ్ నుంచి ఇండిపెండెంట్‌గా, 2020 నుంచి ఏపీ నుంచి వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు.

నిన్న ధర్నాలో అఖిలేష్ యాదవ్, సంజయ్ రౌత్ తదితర జాతీయ నేతలు హాజరవటానికి పరిమళ్ చక్రం తిప్పటమే కారణమని ఢిల్లీ వర్గాల భోగట్టా. మరి అంబానీ మనిషి అయిన పరిమళ్, జగన్‌కు అండగా నిలవటానికి వెనక మతలబు ఏమిటో తెలియాల్సిఉంది.

Read More
Next Story