ప్రతిపక్షహోదాకోసం జగన్ విలక్షణ పోరాటం!
x

ప్రతిపక్షహోదాకోసం జగన్ విలక్షణ పోరాటం!

సింహం సింగిల్‌గా వస్తుందని, 175 సీట్లకు 175 కొడతామని ఎన్నికల సమయంలో సవాల్ విసిరిన జగన్, ప్రతిపక్ష హోదాకోసం దేబిరించాల్సి రావటం ఏపీ రాజకీయాలలో విచిత్ర పరిస్థితి.


అసెంబ్లీలో ప్రతిపక్షహోదాకోసం జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాలలో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆ కేసు ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయమని అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. సింహం సింగిల్‌గా వస్తుందని, 175 సీట్లకు 175 కొడతామని ఎన్నికల సమయంలో సవాల్ విసిరిన జగన్, నేడు ప్రతిపక్ష హోదాకోసం దేబిరించాల్సిరావటం ఏపీ రాజకీయాలలో ఒక విచిత్ర పరిస్థితి.

ఇవాళ ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రతిపక్ష హోదా కోరుతూ స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చారా అని న్యాయస్థానం అడిగింది. గతంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్‌లలో ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ పదిశాతం సీట్లు రాకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారో తెలుపుతూ వినతిపత్రం ఇచ్చామని జగన్ తరపు న్యాయవాది తెలిపారు. అయితే అసలు జగన్ పిటిషన్‌కు విచారణ అర్హతే లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరువాదనలూ విన్న హైకోర్ట్ మూడువారాలకు వాయిదా వేసింది.

జగన్ న్యాయపోరాటంపై షర్మిల చురకలు విసిరారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతానని జగన్ అనటం సిగ్గుచేటని అన్నారు. అసెంబ్లీకి పోనని చెప్పే జగన్ ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నమ్మి గెలిపించి, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వింతగా, వెర్రిగా మోసం చేయటం, అవమానించటం మీకే చెల్లిందని దుయ్యబట్టారు.

నిజంగానే జగన్ నిజాయతీపరుడైన నేత అయితే, ఆయన చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏపీలో ఇటీవల వరదకు గురైన ప్రాంతాలను సందర్శించటం, చంద్రబాబునాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై నిలదీయటం, ఇతర ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయటం వంటి అంశాలపై పోరాడితే ప్రజలలో కూడా త్వరలోనే పాజిటివ్ ఇమేజ్ పెరిగి తిరిగి అధికారాన్ని చేపట్టవచ్చు. కానీ, జగన్ కేవలం ప్రతిపక్ష హోదాపై, కక్షా రాజకీయాలపై పోరాడుతూ, మిగిలిన విషయాలను పట్టించుకోకపోవటం అంత శోభించటంలేదు.

మరోవైపు జగన్ ఇలా ప్రతిపక్షహోదాకోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించటంపై సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు తెగ పేలుతున్నాయి. అర్హత ఉంటే అప్రయత్నంగా అదే వచ్చేదని, అర్హత లేకపోయినా ఇవ్వమని అడగటమంటే అడుక్కోవటమే అని అంటున్నారు. సింహం సింగిల్‌గా వస్తుందని, నేను సైగ చేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని నాడు బీరాలు పలికి ఇప్పుడు అదే ప్రతిపక్ష హోదాకోసం అడుక్కోవటానికి సిగ్గులేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇవి అన్నీ ఒక ఎత్తయితే, ఇటీవలి ఎన్నికలకు ముందు జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన విజయమ్మ గతంలో 2019 ఎన్నికల ఫలితాలరోజు చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవటం జగన్ వర్గానికి గొంతులో పచ్చి వెలక్కాయలాగా మారింది. వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని నేను దేముడిని కోరుకున్నాను అని విజయమ్మ నాటి వీడియోలో అన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఆమె కొడుకుకు వచ్చింది. ఇదే దేముడి స్క్రిప్ట్ అని మీమ్‌లు జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి.

Read More
Next Story