కాంగ్రెస్‌ ట్రాప్‌లో పడ్డ జగదీశ్‌ రెడ్డి!  విచారణకు ఆదేశించిన రేవంత్‌
x
జగదీశ్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటోలు)

కాంగ్రెస్‌ ట్రాప్‌లో పడ్డ జగదీశ్‌ రెడ్డి! విచారణకు ఆదేశించిన రేవంత్‌

కాంగ్రెస్ వలకు తొలి బీఆర్ఎస్ మంత్రి చిక్కారు. రెచ్చగొట్టి సవాల్ చేయించి చటుక్కున పట్టుకున్నారు. న్యాయవిచారణకు ఆదేశించారు..


కాంగ్రెస్ వలలో బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చిక్కినట్టే కనిపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపైన్నో, ఆయన కుమారుడు కే తారక రామారావు పైన్నో విరుచుకుపడే కంటే ద్వితీయ శ్రేణి నేతల్ని రెచ్చగొట్టి ఉచ్చులోకి లాగడమే మేలన్నట్టుగా కాంగ్రెస్ వ్యూహం సాగింది. అందుకు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ ను ఎంచుకుంది. సభలో ఆయనతోనే సవాల్ చేయించి ఆ సవాల్ ను స్వీకరించింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చకచకా రంగంలోకి దిగారు. జగదీశ్ రెడ్డిపై విచారణకు ఆదేశించారు.

యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ పై న్యాయవిచారణ..

విద్యుత్‌ రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు అసెంబ్లీలోనే సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు సహా ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ వాడకంపై న్యాయ విచారణకు ఆదేశించారు.

ఏయే అంశాలపై విచారణ జరుగుతుందంటే...

‘‘ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం లోపభూయిష్టంగా ఉంది. ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాలి. టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారు. దీనిపై ఆనాడే మేం పోరాటం చేస్తే.. మార్షల్స్‌తో మమ్మల్ని సభ నుంచి బయటకు పంపారు. ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెబితే ఆ ఉద్యోగి హోదా తగ్గించి మారుమూల ప్రాంతాలకు పంపారు. ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకోగా.. దీనివల్ల ప్రభుత్వంపై రూ.1362కోట్ల భారం పడింది. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తాం. వ్యవసాయ విద్యుత్‌ అనేది ప్రజల సెంటిమెంట్‌. దీని ఆధారంగా ఒప్పందాలు చేసుకున్నారు. వాటితో ఇండియా బుల్స్‌ కంపెనీకి లాభం చేకూర్చి రాష్ట్రాన్ని ముంచేశారు’’ అన్నారు రేవంత్‌రెడ్డి.

24 గంటల విద్యుత్ పైనా అఖిలపక్షంతో విచారణ..

పవర్ ప్రాజెక్టులతో పాటు 24 గంటల విద్యుత్‌పైనా అఖిల పక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించి 8 ఏళ్లయినా పూర్తికాలేదంటూ గత ప్రభుత్వాన్ని విమర్శించారు.

అంతకుముందేమి జరిగిందంటే...

అంతకుముందు అసెంబ్లీలో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుపై తెలంగాణ శాసనసభలో తీవ్ర గందరగోళం జరిగింది. పరస్పర ఆరోపణలు, సభ దద్దరిల్లింది. తెలంగాణ విద్యుత్ ఆర్ధిక పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన శ్వేత పత్రంపై చర్చ సందర్భంలో ఈ గందర గోళం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య వాడీవేడీ చర్చ సాగింది. ఇద్దరూ సై అంటే సై అనుకున్నారు. ఢీ అంటే ఢీ అన్నారు. ఈ ప్రాజెక్టులో జగదీశ్ రెడ్డి రూ.10వేల కోట్లు తిన్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా, అందుకు తాను సిద్ధం అని జగదీశ్ సవాల్ చేశారు. ఈ సవాల్ ను స్వీకరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Read More
Next Story