ప్రజ్వల్ విషయంలో..కర్ణాటక సీఎం ప్రధానికి రాసిన లేఖలో ఏముంది?
x

ప్రజ్వల్ విషయంలో..కర్ణాటక సీఎం ప్రధానికి రాసిన లేఖలో ఏముంది?

కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్నజేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండిల్ వ్యవహారంలో కర్ణాటక సీఎం ప్రధానికి లేఖ పంపారు. అందులో ఆయన ఏం రాశారు?


మహిళలపై తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి రెండో సారి లేఖ రాశారు. గతంలో తాను రాసిన లేఖపై స్పందిచకపోవడం తనను నిరుత్సాహపరిచిందని కూడా అందులో పేర్కొన్నారు.

పాస్‌పోర్ట్‌ రద్దు చేసేలా విదేశీ వ్యవహారాలు, హోం మంత్రిత్వ శాఖలను ఆదేశించాలని కోరుతూ మే 1న ముఖ్యమంత్రి మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

కేసును దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా ప్రజ్వల్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది.

‘దిగ్భ్రాంతికి గురిచేసే ఘటన’

"ప్రజ్వల్‌పై లైంగిక ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని మరోసారి మీకు (మోదీ) లేఖ రాస్తున్నాను. కర్ణాటక రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రజ్వల్ పాస్ పోర్టును రద్దు చేయించాలని నేను గతంలో లేఖ రాశాను. దానిపై స్పందన లేకపోవడం నన్ను నిరుత్సాహ పరిచింది. ప్రజ్వల్ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించాలని కోరుతున్నా. అతని పాస్‌పోర్ట్‌ను రద్దు చేసి అతన్నితిరిగి దేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని కోరుతున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు.

‘బాధితులకు న్యాయం చేస్తాం’

‘‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన హాసన్ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు, మాజీ ప్రధాని మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ 27న దేశం విడిచి పారిపోవడం సిగ్గుచేటు. అతని హేయమైన చర్యల గురించి వార్తలు వెలువడిన కొద్దిసేపటికే అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ సర్క్యులర్, బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసినా అతను అజ్ఞాతంలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ప్రజ్వల్ పై అత్యాచారం, లైంగిక వేధింపులు, బాధితులను తిరిగి లొంగదీసుకునేందుకు బలవంతంగా వీడియో తీయడం లాంటి అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేశాం. బాధితులకు న్యాయం చేస్తాం.’’ అని సీఎం పేర్కొన్నారు.

‘కేంద్రం నుంచి స్పందన లేదు’

ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలన్న అభ్యర్థనపై కేంద్రం నుంచి ఇంకా స్పందన రాలేదని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర బుధవారం తెలిపారు.

"ఇంకా ఏమీ రాలేదు (కేంద్రం నుండి). కేంద్రం కూడా మాకు సహాయం చేయాలి. అదే మేం కోరుతున్నది." అని పరమేశ్వర అన్నారు.

ఎవరీ ప్రజ్వల్..

33 ఏళ్ల ప్రజ్వల్ JD(S) చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు. పార్లమెంటు ఎన్నికలలో హాసన్ లోక్‌సభ సెగ్మెంట్ నుండి NDA అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఎన్నికల వేళ..ప్రజ్వల్ అశ్లీల వీడియోలు బయటకు రావడంతో ఏప్రిల్ 27న ప్రజ్వల్ దేశం వీడాడు. ఇటు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రజ్వల్ ఆచూకీ కోసం ఇప్పటికే “బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు పోలీసులు.

Read More
Next Story