బీఆర్ఎస్‌లో కనిపించని ఎన్నికల జోష్, కవిత అరెస్టుతో పార్టీ కకావికలం
తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 16 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినా ఆ పార్టీలో జోష్ కనిపించడం లేదు. ఓటమితో ఆ పార్టీలో నైరాశ్యం నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ప్రతిపక్షానికి దిగిపోయిన బీఆర్ఎస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికల కోలాహలం, ఉత్సాహం కనిపించడం లేదు. ఎప్పటిలాగే గులాబీ బాస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందరికంటే ముందుగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 16 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినా ఎవ్వరూ ఉరుకుల పరుగుల మీద లేరు. అభ్యర్థులెవరూ నియోజకవర్గాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టలేదు.
కేసీఆర్‌కు ఆత్మీయుడిగా పేరొందిన తెలంగాణ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఒక్కరే కరీంనగర్ లో కేసీఆర్ తో బహిరంగ సభ నిర్వహించి ప్రచారం ఆరంభించారు. మిగతా 15 మంది అభ్యర్థులను ప్రకటించినా వారు సమరం సంరంభం మచ్చుకైనా కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కేడరులో ఓటమి తర్వాత ఏర్పడిన నైరాశ్యం కొనసాగుతూ ఉంది. దీనితో పార్లమెంటు ఎన్నికలకు పనిచేసేందుకు ముందుకు రావడం లేదు. దీనికి రకరకాల భయాలు కారణం. కేసీఆర్ తీరు ఉత్తేజకరంగా లేదని కొంతమంది బాహాటంగా చెబుతున్నారు. ఫామ్ హౌస్ రాజకీయాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా, ఆయన మళ్లీ ఫామ్ హౌస్ కే పార్టీని లాక్కుపోతున్నారనే విమర్శ వినబడుతూ ఉంది.
తడిసి మోపెడుకానున్న ఖర్చు
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన విడుదల కానుంది. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తే ఎన్నికల ప్రచార వ్యయం తడిసి మోపెడు అవుతుందని పార్లమెంట్ అభ్యర్థులు భయపడుతున్నారు. పార్టీ టికెట్లను ఖరారు చేయగానే రేపు హోలీ పండుగ జరుపుకునేందుకు తమ కార్యకర్తలకు డబ్బులు ఇవ్వాలని చోటామోటా నాయకులతో సహా పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యేలు అభ్యర్థులను కోరుతున్నారు. హోలీకి డబ్బులివ్వాలని కోరుతున్న నేతల బారి నుంచి తప్పించుకునేందుకు చాలామంది అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాలకు దూరంగా హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నారని సమాచారం. గల్లీ స్థాయి లీడర్లు మొదలుకుని కౌన్సిలర్లు, జడ్పిటిసి, ఎంపిటీసిల, కుల సంఘాల నేతలు క్యాంపెయిన అనే మాట వినగానే చేయిచేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు తమకు ప్రచారం చేసేందుకు వీలుగా కారు, ప్యాకేజీలు ఇవ్వాలని బీఆర్ఎస్ చోటామోటా నాయకుల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల దాకా డిమాండు చేస్తున్నారు. దీనితో నోటిఫికేషన్ వచ్చే దాకా చాలా మంది సీనియర్లు నియోజకవర్గాలకు వెళ్లేందుకు జంకుతున్నారని ఖమ్మంకు చెందిన పార్టీ నేత ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు.
అభ్యర్థులను ప్రకటించినా ప్రారంభం కాని ప్రచారం
నిజానికి, రాష్టంలో ఉన్న 17 లోక్ సభ స్థానాలకు 16 మంది ఎంపీ అభ్యర్థులను అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రకటించింది.అయితే, ప్రచారంలో మాత్రం బాగా వెనకబడి ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో పోలిస్తే బిఆర్ ఎస్ కనుచూపుమేరలో కనిపించదు. అసెంబ్లీ ఎన్నికపుడు కూడా అందరికంటే ముందే అభ్యర్థుల లిస్టు ప్రకటించినా, అపుడు ఎన్నికల ప్రచారం వెంటనే ప్రారంభమయింది. పార్టీ నుంచి డబ్బులందాయి. అభ్యర్థులకు విరాళాలు బాగా అందాయి. అసెంబీ ఎన్నికల్లో పరాజయం తర్వాత చందాలు ఇచ్చే వాళ్లు ముఖం చాటేస్తున్నారు. పార్టీ నుంచి బాగా అందుతాయన్న నమ్మకం కలగడం లేదు.
‘‘డబ్బులిస్తేనే ప్రచారంలో పాల్గొంటామని తెగేసి చెబుతున్నారు. గల్లీ నుంచి నియోజక కేంద్రం దాకా నేతల నుంచి డబ్బుల డిమాండ్లు చుట్టుముట్టాయి, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రచారం చేయాలో తెలియడం లేదు. మా ఎంపీ క్యాండిడేట్ ఢిల్లీ పోయినాడు, ఇంకా రాలేదు అని చెప్పి పంపిస్తున్నాం,” అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సీనియర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి తన ఆవేదన వెళ్లగక్కారు.
బీఆర్ఎస్ పార్టీకి నిధులున్నా...
దేశంలో సంపన్న పార్టీలలో బిఆర్ ఎస్ ఒకటి. పార్టీకి వేయికోట్ల నిధులున్నాయని స్వయాన కెసిఆర్ క్యాడర్ కు అనేక సందర్బాలలో చెప్పారు. పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వాళ్లంతా ఆ వేయికోట్ల మీద ఆశతోనే వచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో నైనా గెలిచేందుకు అధినేత డబ్బులు వెచ్చిస్తారని భావించారు. అయితే, మూలధనం జోలికి కేసీఆర్ వెళ్లేలా లేరని ఒక అభ్యర్థి చెప్పారు.
ఇపుడు ఎలెక్టోరల్ బాండ్ల గుట్టురట్టయ్యాక కాంట్రాక్టులు తీసుకున్న పలు కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున నిధులు వచ్చాయనే విషయం బయటపడింది. దేశంలో భారీగా నిధులు పొందిన రెండో పార్టీ పెద్ద పార్టీయే బిఆర్ ఎస్ యే. పార్టీలో నిధులున్నా పార్లమెంట్ అభ్యర్థులకు ఎన్నికల ప్రచార వ్యయం ఇవ్వటానికి పార్టీ అధిష్ఠానం నిరాకరిస్తుందని, అభ్యర్థులనే ఎన్నికల ఖర్చు పెట్టుకోవాలని కోరుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడిన ఓ సీనియర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆవేదనగా చెప్పారు.
“ పార్టీలో ఉన్నస్తబ్దత చూసి చాలామంది పార్లమెంట్ బరిలో నిలబడేందుకు నిరాకరిస్తున్నారు. వాందరని కేసీఆర్ ఫామ్ హౌస్ కు పిలిచి భోజనం పెట్టి నచ్చచెప్పి పంపిస్తున్నారు. అంతే కాని నిధుల ప్రస్తావన తేవడం లేదు. అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలకు మేనిఫెస్టోను ఇంకా రూపొందించలేదు. దీంతోపాటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బహిరంగసభ, రోడ్ షో నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ ఇంకా పర్యటనల తేదీలు ఖరారు చేయలేదు,” పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
అధినేత ఫామ్ హౌస్‌లో, సీనియర్లు ఢిల్లీలో...
ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ తో పార్టీ కాకవికలమయి పోయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు, సచివాలయం నిర్మాణం, గొర్రెల పంపిణీ, భూబాగోతాలు, ధరణిలో అక్రమాల మీద వరుసగా దర్యాప్తు చేస్తోంది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ, విద్యుత్ శాఖలు నోటీసులు ఇవ్వడం, మల్లారెడ్డి అల్లుడికి చెందిన అక్రమ భవనం కూల్చివేత, సంతోష్ రావుపై భూకబ్జా కేసు నమోదు, ఫోన్ ట్యాపింగ్ బాగోతం ఇలా వరుస ఘటనలతో బీఆర్ఎస్ నేతలు సతమతమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉంటుందని పలు సర్వే సంస్థలు ఇటీవల వెల్లడించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం వారి వారి నియోజకవర్గ వ్యవహారాలకే పరిమితం అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో తమ బీఆర్ఎస్ పార్టీ అంతగా ప్రభావం చూపించదని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
గేట్లు ఎత్తిన రేవంత్, ఖాళీ అవుతున్న బీఆర్ఎస్
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే తాను గేట్లు ఎత్తానని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 100 రోజుల పాలన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని ప్రారంభించానని చెప్పిన కొద్దిసేపటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ జి రంజిత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ముందు మరింతమంది ఎమ్మెల్యేలే కాకుండా ఎమ్మెల్సీలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు. బీఆర్ఎస్ నేతల కాంగ్రెస్ ఆకర్ష్ పేరిట సీఎం పక్షాన ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి చేరికలను పర్యవేక్షిస్తున్నారు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కే కేసీఆర్ పరిమితం
గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినపుడే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ ను వీడటం లేదు. తొంటి ప్రమాదం అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్ కోలుకున్నా ఫాంహౌస్ కే పరిమితం అయ్యారు. ఒక రోజు అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిన కేసీఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా పార్లమెంట్ ఎన్నికలకు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి తెలంగాణ భవన్ కు వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని కేసీఆర్ చెప్పినా, తిరిగి ఫామ్ హౌస్ కే వెళ్లారు. గులాబీ పార్టీ అధినేత ఫామ్ హౌస్ లో ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయం అయిన తెలంగాణ భవన్ కు కార్యకర్తలెవరూ రావడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పార్లమెంట్ అభ్యర్థి చెప్పారు. పార్టీ అధినేతే ఇలా వ్యవహరిస్తే బీఆర్ఎస్ కార్యకర్తల్లో నైరాశ్యం ఆవరించిందని మరో పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వ్యాఖ్యానించారు. ఫామ్ హౌస్ సీఎం అని పేరొందిన కేసీఆర్ నేడు అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ ప్రతిపక్షనేతగా మిగిలారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు.
హస్తినలోనే కేటీఆర్, హరీష్‌రావు మకాం
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించిందని ప్రకటించిన ఈడీ ఆమెను అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచి ప్రశ్నిస్తోంది. కవితకు మరో మూడు రోజుల పాటు కస్టడీని కోర్టు పొడిడించడంతో ఆమె సోదరుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హస్తినలోనే మకాం వేసి న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ కవితను బెయిలుపై బయటకు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. కోర్టులో కవిత తరపున పిటిషన్లు వేయించడంతోపాటు కవితను కలిసి ధైర్యం చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ లో కీలక ఇద్దరు నేతలు పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ కు దూరం ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది.
మాజీ ఎంపీ సంతోష్ రావుపై భూకబ్జా కేసు
బీఆర్ఎస్ పార్టీ నేతలు వరుస కేసులతో సతమతమవుతున్నారు ఢిల్లీ మద్యం కేసులో ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ ఈడీ రిమాండులో ఉన్నారు. మరో వైపు ఆ పార్టీ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం బూకబ్జా కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ లోని రోడ్డు నంబర్ 14లో ఉన్న 1350 చదరపు గజాల భూమిని నకిలీ డాక్యమెంట్లను సృష్టించి కబ్జాకు యత్నించారని నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు సంతోష్‌రావుతోపాటు లింగారెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story