2023 తెలంగాణ ఎన్నికల్లో ఎక్కువ నష్టం జరిగింది ఈయనకే....
x
KT Ramarao, son of KCR (source: X)

2023 తెలంగాణ ఎన్నికల్లో ఎక్కువ నష్టం జరిగింది ఈయనకే....

కెసిఆర్ సిఎం హ్యాట్రిక్ చేజారి పోయింది, తండ్రి తర్వాత కుమారుడు ముఖ్యమంత్రి అయ్యే మరొక డబల్ ధమాకా కూడా పోయింది. ఈ మేరకు రేవంత్ అభిమానులు చిందులేయ వచ్చు.కానీ...



ఇక కెసిఆర్ కుమారుడు కెటి ఆర్ యే ముఖ్యమంత్రి అని ఎన్ని సార్లు హెడ్ లైన్లు వచ్చాయి. టివిలో ఎన్ని గంటల పాటు చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఎంత దుమ్ము రేగింది. ఇక కెసిఆర్ ఢిల్లో మకాం అని ఎన్ని సార్లు రాశారు. బ్యానర్లు పెట్టారు.కెసిఆర్ పిఎం అని ఎన్ని నినాదాలిచ్చారు.ఫ్లెక్సీలు పెట్టారు.

కెసిఆర్ ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని కట్టుకున్నపుడు, రాజశ్యామల యాగం చేసినపుడే అంతా అనుకున్నారు, ఆయన ఢిల్లీకి మకాం మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని. కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కెసిఆర్ ఆశిస్తున్నారని, ఆశీర్వదించాలని తనని అడిగారని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు.

అయితే, ఎందుకో గాని కెటిఆర్ పట్టాభిషేకం వాయిదా పడుతూ వస్తున్నది. ఏ స్వామీజీ దీనికి ముహూర్తం పెట్టలేకపోయారు. చివరకు అంతా ఒక నిర్ణయానికి వచ్చారు, అందేంటే, క 2023 ఎన్నికల్లో కెసిఆర్ మూడో సారి గెల్చి హాట్రిక్ కొట్టగానే కెటిఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం పెడతారని, 2024 జూన్ లో లోక్ సభ ఎన్నికలయిపోగానే, కెటిఆర్ ముఖ్యమంత్రి అవుతారని చాలా మంది కెసిఆర్ అభిమానులు, కెటిఆర్ అభిమానులు ఆశించారు.

అయితే,ఒక్కొక్కసారి అనుకున్నవేవీ జరగవు. ‘అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని’ చక్కటి పాట ఒకటుంది. అదిపుడు గుర్తొచ్చే లా తెలంగాణ జాతకం మారిపోయింది.

భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్) 2023 ఎన్నికల్లో ఓడిపోయింది. కెటిఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మరొక అయిదేళ్లు వాయిదా పడింది.

ఎన్నికల క్యాలెండరలో అయిదేండ్లండే అయిదు యుగాలు. అయిదు యుగాల్లో ఎన్ని పరిణామాలు వస్తాయో. ఇపుడే కెసిఆర్ వయసు 70 సంవత్సరాలు. అప్పటికి ఆయన 75 సంవత్సరాలవుతాయి. అపుడు పార్టీని మరొక సారి ఎన్నికల్లో నడిపించగలెగే సత్తాతో ఉండాలి. అప్పటికి కాంగ్రెస్ ఇంకా బలపడవచ్చు. రేవంత్ తిరుగులేని శక్తి కావచ్చు. అయితే, ఇదే కాంగ్రెస్ బలహీన పడవచ్చు కూడా. ఇదే బిఆర్ ఎస్ అభిమానుల ఆశ.

నిన్న బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి మాట్లాడుతూ, రెండు మూడు నెలలు చాలు మళ్లీ కెసిఆరే సిఎం అన్నారు. ఎట్టాగంటే, బిఆర్ ఎస్, బిజెపి, ఎంఐం కలిపితే, 54 మంది ఎమ్మెల్యేలవుతారు. (ఈమూడు పార్టీలు ఒకటేనని తెలిసే ఓడించారు కదా) అపుడు

అధికారానికి చాలా దగ్గిరగా వస్తాం. వచ్చేందుకు చిన్న గ్యాప్ మాత్రమే అడ్డం, ఇలాగే కాంగ్రెసోల్లు తన్నుకుంటారు, కూలిపోతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే, ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండాలి, మంచి ప్రభుత్వం ఇవ్వలేక విఫలం కావాలి, ప్రజల్లో బిఆర్ ఎస్ రావాలనే కోరిక పుట్టాలని పాజిటివ్ థింకింగ్ శ్రీహరికి రాలేదు. సరే అది వేరే విషయం.

మొత్తానికి ఈ ఎన్నికల్లో పెద్ద ఎదురు దెబ్బతగిలింది బిఆర్ ఎస్ కాదు, కెసిఆర్ కు కాదు, మరెవరికి? 2023 ఎన్నికల్లో క్రాష్ అయింది ఒక పెద్ద కల. కెసిఆర్ కుమారుడు, ఇంతవరకు అప్రకటిత ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్నినడిపిన కెటి రామారావు ఎలియాస్ కెటిఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష.

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమతిగా పేరు మార్చిన రోజున ‘నేను ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నాను’ అని మాత్రమే కెసిఆర్ చెప్పారు. అలా కాకుండా, కెటిఆర్ ను సీఎం ను చేస్తున్నానని చెప్పి కెటిఆర్ ను సీఎం ను చేసి,తాను బిఆర్ ఎస్ రథమెక్కి వుంటే ఎంత బాగుండేదని చాలా మంది అంటున్నారు. ఈ రోజు ‘రేవంత్ అనే నేను’ అనే హెడ్ లైన్ వచ్చి ఉండేది కాదేమో. ఎంత పొరపాటు జరిగింది.

మళ్లీ అలాంటి అవకాశం రావడం చాలా కష్టం. కడియం శ్రీహరి కీ ఈ విషయం తెలియక కాదు, బాగా తెలుసు, ఏదో నాయకత్వం మెప్పుపొందడానికి, అనుకోని పరిణామానికి హతాశులైన ఎర్రవల్లి ఫామ్ హౌస్ వాసులను ఓదార్చేందుకు చేసిన ప్రకటన లాగా అది కనిపిస్తుంది.

తెలంగాణ కూడా పెరిగి పెద్దవుతూ ఉంది. పిల్లలు పెరిగి పెద్ద వాళ్లయ్యో కొద్ది ఆలోచనలు మారుతుంటాయి. తెలంగాణ ఆలోచనలు అంతే, తెలంగాణ పుట్టాక పదేళ్లలో ఉత్తర తెలంగాణలో ఎంత మార్పు వచ్చింది! అక్కడి ప్రజలు కాంగ్రెస్ ను కోరుతున్నట్లున్నారు. కాంగ్రెస్ నచ్చని వాళ్లు చాలా మంది బిజపి వైపు చూస్తున్నట్లున్నారు. బిజెపికి ఎన్నిసీట్లొచ్చాయి, ఎన్ని ఓట్లొచ్చాయి! ఎవరైనా కలగన్నారా. తెలంగాణ పసి రాష్ట్రం పెరిగి పెద్దై ఈ ఆలోచన ముదిరితే, తెలంగాణ రాష్ట్రం రెండు జాతీయ పార్టీల బరి అవుతుంది తప్ప బిఆర్ ఎస్ కు అవకాశం రానిస్తారా. బిఆర్ ఎస్ బలహీనపడితే, మనం బలపడతాం అని తెలిస్తే, మోదీషాలు చంకలెగరేసుకుంటూ నిప్పు రాజేయరా.

ఇక దక్షిణ తెలంగాణ మాటలేమిటి? మొదటినుంచీ ఈ జిల్లాల్లో బిఆర్ ఎస్ కు ఉన్న బలం అంతంత మాత్రమేనాయే.

ఇపుడు చెప్పండి, ఉత్తరాన్నుంచి బిజెపి తరుముకొస్తుంటే, దక్షిణాదినుంచి కాంగ్రెస్ దాడి చేస్తుంటే, వాతావరణం వేడెక్కవచ్చు, తుఫాన్ లాగా మారవచ్చు. బిఆర్ ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేసే మేఘాలు కమ్ముకుంటున్నట్లు లేదూ!

హైదరాబాద్ బయటి తెలంగాణ ముస్లింలు ఎంఐఎం మాట వినడం లేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. అంతేకాదు, హైదరాబాద్ లో కూడా ఒవైసీల పట్టు కొద్ది కొద్దిగా సడలుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక హైదరాబాద్ వోటర్లు పాదరసం లాంటి వాళ్లు. ఎటు దొర్లుతారో ఎవరికి తెలియదు. వాళ్లు జిహెచ్ ఎంసి ఎన్నికల్లో బిజెపికి వోటేసినపుడు జనమంతా అవాక్కవ్వలేదూ! ఇపుడు బిఆర్ ఎస్ కు వేశారు. దీన్ని చూసి చీర్స్ అంటే చేతులు కాలిపోతాయి. ఈ సెటిలర్స్ ని నమ్ముకుంటే మునిగిపోతారు.

వీటన్నింటిని బట్టి చూస్తే సమర్థుడు,మంచి మాటకారి, ఎవరినైనా ఆకట్టుగోల ఆకర్షణ ఉన్నవాడుగా పేరున్న కెటిఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిందని అనిపించడం లేదూ! దీనికి కారణం కెసిఆరేనా!

దక్షిణాదిన వరుసగా ‘మూడుసార్లు గెల్చి హ్యాట్రిక్ కొట్లిన ముఖ్యమత్రి’ అనే రికార్డ్ కోసమే కెటిఆర్ని ముఖ్యమంత్రిగా ప్రకటించకుండా కెసిఆర్ జాప్యం చేశాడని కొంతమంది కెటిఆర్ అభిమానుల అనుమానం. ఇందులో నిజం ఎంతో తెలియదు గాని, జరిగిందదే.

సిఎం హ్యాట్రిక్ చేజారి పోయింది, తండ్రి తర్వాత కుమారుడు ముఖ్యమంత్రి అయిన మరొక డబల్ ధమాకా కూడా పోయింది. ఈ మేరకు రేవంత్ అభిమానులు చిందులేయ వచ్చు.

అయితే, ఒకటి గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, దేన్నైనా అందుకోవచ్చు. ఎపుడూ నెక్స్టు బెస్టు కోసం చూడటమే. “Politics is the art of the possible, the attainable — the art of the next best” అన్నది ఎవరు? బిస్మార్క్ కదూ! ఓటో వన్ బిస్మార్క్ (Otto von Bismarck).

Read More
Next Story