మక్కా మసీదు పేలుడు ఘటన, 17 ఏళ్లు గడచినా బాధితులకు అందని న్యాయం
హైదరాబాద్ మక్కా మసీదులో పేలుడు ఘటన జరిగి నేటికి 17 ఏళ్లు అయింది. ఇన్నేళ్లు గడిచినా బాధితులకు న్యాయం అందలేదు. ఈ కేసును తిరిగి తెరవాలని కార్యకర్తలు కోరారు.
హైదరాబాద్ మక్కా మసీదులో బాంబు పేలుడు ఘటన జరిగి శనివారం నాటికి సరిగ్గా 17 సంవత్సరాలు...
2007వ సంవత్సరం మే 18వతేదీ...శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని మక్కా మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత 1:25 గంటల సమయంలో ఒక ఈఐడీ బాంబు పేలింది. ఈ పేలుడులో 9 మంది మరణించారు. ఆ తర్వాత జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 58 మంది గాయపడ్డారు.
- బాంబు పేలుడు కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసును పునఃప్రారంభించి సమగ్ర విచారణ జరిపించాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
- మసీదులో పేలుడు జరిగి 17 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పోలీసుల తీరుపై హేయమైన పరిశీలనలు చేసిన భాస్కర్‌రావు కమిషన్ నివేదికను ప్రజల ముందు ఉంచాలని ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
న్యాయం కోసం ఎదురుచూపు
శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు మసీదుకు వచ్చిన భక్తులపై బాంబు దాడి జరిగింది. ఇంతటి దారుణమైన నేరానికి పాల్పడిన వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు.మక్కా మసీదు పేలుడు జరిగి 17 సంవత్సరాల తర్వాత కూడా బాధితులు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉగ్రదాడి జరిగి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం సామాజిక కార్యకర్తలు ఎస్‌క్యూ మసూద్, మౌనిస్ అబిది, కనీజ్ ఫాతిమా, సారా మాథ్యూస్, ఖలీదా పర్వీన్, అలీ అస్గర్‌లు భాస్కర్‌రావు కమిషన్ నివేదికను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
17th Anniversary of Macca Masjid Bomb blast.
— S.Q.Masood | مسعود (@SQMasood) May 18, 2024
"Victims' Justice Thwarted: NIA Obstructs Appeal in High Court"
We demand @revanth_anumula to
reopened and conduct retrial of the Macca Masjid blast case.
Tabulation of Bhaskar Rao Commission report in the state assembly. pic.twitter.com/WpMcBcgn62
అప్పీలు చేయకూడదట...
ఈ తీర్పుపై అప్పీల్ చేయకూడదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించడం పట్ల సామాజిక కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక కార్యకర్తలు, బాధితులు నిర్దోషులకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఎన్ఐఏ ప్రత్యేక ప్రాసిక్యూటర్ దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
భాస్కర్ రావు కమిషన్ నివేదిక ఏది?
ఈ పేలుడు ఘటన, పోలీసుల కాల్పులపై దర్యాప్తు చేసేందుకు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2007వ సంవత్సరంలో వి భాస్కర్ రావు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లేదా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కొన్ని నెలల క్రితం వరకు ఈ నివేదికను విడుదల చేయలేదని సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు.
నిర్దోషులైన ముస్లిం యువకుల అరెస్ట్
ఈ బాంబు పేలుడుకు పాల్పడింది పాకిస్థాన్ దేశానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతున్న ఛాందసవాద బృందమని పోలీసులు భావించారు.ఈ కోణంలోనే తొలుత దర్యాప్తును కొనసాగించారు. హైదరాబాద్ నగరానికి చెందిన హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామీ కమాండర్ మొహమ్మద్ షాహిద్ బిలాల్ ఈ దాడికి కుట్ర పన్నాడని కథనాలు ప్రచారమయ్యాయి.ఈ దాడితో సంబంధముందన్న అనుమానంతో హైదరాబాద్ పోలీసులు పలువురు ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. వీరు నిర్దోషులని తేలడంతో వారిని విడుదల చేశారు.
పేలుళ్లలో హిందూ అతివాదుల ప్రమేయం
మక్కా మసీదు కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ కు బదిలీ చేశారు. మక్కా మసీదు ఆవరణలో పేలకుండా ఉండిపోయిన ఒక ఈఐడీ ద్వారా సీబీఐకి క్లూ దొరికింది. ఈఐడీలను పేల్చటం కోసం టైమర్లుగా సిమ్‌కార్డులను ఉపయోగించినట్లు గుర్తించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా దగ్గర జరిగిన బాంబు దాడికి కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. ఆ ఆధారాలతో హిందూ అతివాద బృందం ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డట్లు సీబీఐ కనుగొంది.
ఎన్ఐఏకు కేసు బదిలీ
2011లో కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి బదిలీ చేశారు.మక్కా మసీదు బాంబు దాడి కేసులో మొత్తం 10 మంది నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. ముస్లిం మతస్థులు సమావేశమయ్యే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని నిందితులు దాడులు చేయటానికి 2004-2007 మధ్య కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
ఐదుగురు అరెస్ట్
గుజరాత్ రాష్ట్రానికి చెందిన నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసీమానంద్, రాజస్థాన్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ దేవేంద్ర గుప్తా, మధ్యప్రదేశ్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త లోకేశ్ శర్మ, గుజరాత్ ప్రైవేటు ఉద్యోగి భరత్ మోహన్‌లాల్ రాటేశ్వర్, మధ్యప్రదేశ్ రైతు రాజేందర్ చౌదరిలపై కేసు నమోదైంది. నిందితుల్లో ఒకరైన సునీల్ జోషి కేసు దర్యాప్తులో ఉండగానే హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్‌కే చెందిన మరో ఇద్దరు నిందితులుఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు సందీప్ వి డాంగే, రామచంద్ర కల్సంగ్రా పోలీసులకు ఇంకా పట్టుపడలేదు. మధ్యప్రదేశ్‌కే చెందిన మరో ఇద్దరు నిందితులు తేజ్‌రామ్ పర్మార్, అమిత్ చౌహాన్‌లపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
నిర్దోషులని ఎన్ఐఏ కోర్టు తీర్పు
హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయ స్థానం ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.తగిన సాక్ష్యాధారాలు లేనందున కోర్టు ఐదుగురు నిందితులు అసీమానంద, దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మ, భరత్ మోహన్‌లాల్ రాటేశ్వర్, రాజేందర్ చౌధరిలను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది.
Next Story