మెదక్ యుద్ధ ట్యాంకర్      మహా స్పీడు
x
మల్కపూర్ చెరువులో పరీక్షించిన యుద్ధ ట్యాంకర్ ఇదే

మెదక్ యుద్ధ ట్యాంకర్ మహా స్పీడు

1984 జూలై 19.. మెదక్ నుంచి గెలిచి ప్రధాని అయిన ఇందిరా గాంధీ. ఎద్దుమైలారం ఫ్యాక్టరీని స్థాపిస్తే ఇప్పుడది ప్రైవేట్ పరం కానుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి


1984 జూలై 19.. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి. అప్పటికే ఆమె మెదక్ నుంచి గెలిచిన పార్లమెంటు సభ్యురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మెదక్ లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. తన పదవీ కాలం ముగియబోయే దశలో ఆమె మెదక్ వచ్చారు. హైదరాబాద్ కి కూతవేటు దూరంలోని ఎద్దుమైలారం వద్ద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. యుద్ధ రంగంలోని పదాతిదళాలకు ట్యాంకులు, తుపాకులు తయారు చేసే ఫ్యాక్టరీ అది. ఆ తర్వాత మూడేళ్లకు ఫ్యాక్టరీ ఏర్పాటైంది. 1987లో తొలి రథాలు బయటకి వచ్చాయి.

2023 డిసెంబర్ 22.. సంగారెడ్డి జిల్లా మల్కపూర్ చెరువు.. నీళ్లతో నిండుగా ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ


లో తయారైన యుద్ధ ట్యాంకర్లు నీళ్లలో వడివడిగా తిరుగాడుతున్నాయి. దీన్నే ఫ్లోటింగ్ టెస్ట్ అంటారు. ఓ యుద్ధ ట్యాంకర్ బాగుందని చెప్పాలంటే ఆటెస్ట్ పాస్ కావాలి. ట్యాంక్ పైన కూర్చున్న అధికారులు అన్నీ పరీక్షిస్తున్నారు. అందరూ బొటనవేళ్ళు పైకెత్తి చూపుతున్నారు. కొందరు ఓకే అంటున్నారు. రెడీ ఫర్ ఆపరేషన్ అనే సంకేతం వచ్చింది. సిబ్బంది ఊపిరి పీల్చారు. ఇప్పుడీ ట్యాంకులు భారతీయ ఆర్మీ అమ్ములపొదిలోకి చేరనున్నాయి. భారతీయ సైన్యం కోసం తయారు చేసిన యుద్ధ ట్యాంకర్లకి ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది.

3023 ఎకరాల్లో ఏర్పాటైన ఫ్యాక్టరీ ఇది...

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. చుట్టుపక్కల గ్రామాల వాళ్లకు తప్ప మిగతా జిల్లాల ప్రజలకు పెద్దగా తెలియదు. ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఫ్యాక్టరీలలో ఇదొకటి. కేంద్ర ప్రభుత్వం నడిపే సంస్థల్లో ఇదొకటి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల బోర్డు కిందున్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ముఖ్యమైంది . 3023 ఎకరాల విస్తీర్ణం, 3000 మంది సిబ్బంది దీని సొంతం. యుద్ధ ట్యాంకర్ల తయారీలో సత్తా చాటుతోంది.

ప్రతి ఏటా 120 యుద్ధ ట్యాంకర్లు...

ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి ప్రతి ఏటా 120 యుద్ధ ట్యాంకర్ల వరకు తయారవుతాయి. గత 39 ఏళ్లలో ఈ ఫ్యాక్టరీ నుంచి ఇప్పటివరకు 2500కి పైగా యుద్ధ ట్యాంకర్లు ఆర్మీకి చేరాయి. ప్రస్తుత జనరల్ మేనేజర్ కె. సుధాకర్ చెప్పిన దాని ప్రకారం “ఎద్దుమైలారం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో యుద్ధ ట్యాంకర్లే కాక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, వార్‌ అంబులెన్స్‌లు, మైన్ ప్రొటెక్టర్లు తయారవుతాయి. ఇప్పటి వరకు తయారు చేసిన ఒక్క యుద్ధ ట్యాంక్ కూడా విఫలం కాకపోవడం ఈ ఫ్యాక్టరీ ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే ఈ ఫ్యాక్టరీ ప్రతిష్టను మరింత పెంచింది”. దశాబ్దాలుగా ఉత్పత్తుల్ని విస్తరించింది. భూమి పై నుంచి గాల్లోకి, ఆకాశం నుంచి భూమిపైకి ప్రయోగించే మిసైల్స్ లాంచర్లు ఇక్కడ తయారవుతాయి. ఆర్మర్డ్ లైట్ రికవరీ వాహనాలు, బుల్డోజర్లు, సాయుధ రాడార్లు, నౌకాదళ ఆయుధాలు కూడా ఇక్కడ తయారు చేస్తారు.

ప్రస్తుత యుద్ధ ట్యాంకర్ల ప్రత్యేకలు ఇవీ...

ప్రస్తుతం సిద్ధమైన యుద్ధ ట్యాంకర్‌లో 10 మంది సైనికులు కూర్చోవచ్చు. 30 మిల్లీమీటర్ల గన్ తో పాటు రైఫిల్‌, మిస్సైల్స్‌ లాంఛర్ సదుపాయం ఉంది. ట్యాంకర్‌కి ఇరువైపులా బుల్లెట్ ప్రూఫ్ బాడీ, స్మోక్ గ్రెనేడ్ లాంఛర్, ఆల్ రౌండ్ ఫైర్ ప్రొటెక్షన్ ని ఈ యుద్ధ ట్యాంకర్లకు ఉంది. బరువు 14 టన్నులు. నేలపైన గంటకి 60 కిలోమీటర్ల వేగం. నీళ్లలో 7 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో ఈ ట్యాంకర్ ప్రయాణిస్తుంది. ఎటువంటి వాతావరణంలోనైనా ఇవి పని చేస్తాయి.

ఇక్కడ తయారైన తొలి వాహనం శరత్...

1987లో ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన తొలి ట్యాంకర్ శరత్ (క్యారియట్ ఆఫ్ విక్టరీ). ఆనాటి సోవియెట్ యూనియన్ సహకారంతో నిర్మితమైంది. 1999 నాటికి 90% పూర్తి స్వదేశీ టెక్నాలజీతో యుద్ధట్యాంకర్లు తయారవుతున్నాయి. 2007 నాటికి 1,250 యుద్ధ ట్యాంకర్లు తయారైనట్టు అంచనా. ఇప్పుడా సంఖ్య దాదాపు 2500లకు చేరింది.

నాగ్ మిసైల్స్ లాంఛర్ ఇక్కడి నుంచి వెళ్లిందే...

భారతీయ సైనికదళంలో చెప్పుకోదగిన మిసైల్స్ వ్యవస్థలో ఒకటైన NAMICA (నాగ్ మిస్సైల్ క్యారియర్) లాంఛర్ ఇక్కడ తయారైందే. నాగ్ (కోబ్రా) క్షిపణిలోని నాలుగు ప్రయోగ గొట్టాలు, ఇతర ప్యాకేజీని ఈ ఫ్యాక్టరీయే అందించింది. ఆకాష్, త్రిశూల్ క్షిపణి లాంచర్ క్షిపణి లాంచర్ కూడా ఇక్కడివే కావడం గమనార్హం.

ఈ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తారా...

ఎంతో ఘనకీర్తి కలిగిన ఎద్దుమైలారం ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొత్త రిక్రూట్మెంట్లు ఆగాయి. సిబ్బంది క్వార్టర్లు కొత్తవి రావడం లేదు. విడిభాగాల తయారీని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని ఈ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ నాయకుల్లో ఒకరైన మీసాల ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ రంగాన్ని ప్రైవేటీకరించవద్దని కార్మికులు ఇప్పటికే ఫ్యాక్టరీ యాజమాన్యానికి నివేదించారు.

Read More
Next Story