‘మోదీ ఘనత..శ్రీమంతుల రూ. 16 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేయడం’
x
పార్టీ అభ్యర్థి గుర్జిత్ సింగ్ ఔజ్లాకు మద్దతుగా ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ | PTI

‘మోదీ ఘనత..శ్రీమంతుల రూ. 16 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేయడం’

శ్రీమంతులకు లక్షల కోట్లు రుణాలను మాఫీ చేసిన ప్రధానికి హిమాచల్ ప్రదేశ్ బాధితులను ఆదుకోడానికి మనసు అంగీకరించడం లేదని రాహుల్ అన్నారు.


కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత పదేళ్లలో తన బిలియనీర్ మిత్రులు 22 మందికి రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో గతేడాది సంభవించిన విపత్తుకు రూ.9 వేల కోట్లు సాయం కోరితే కేటాయించలేదని విమర్శించారు. సాయం చేయడానికి బదులుగా రాష్ట్రంలో ఏర్పాటయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర వరద సహాయాన్ని సరిగా పంపిణీ చేయలేదని మోదీ ఆరోపించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లా నహాన్‌లో సిమ్లా (ఎస్‌సి) పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ సుల్తాన్‌పురికి మద్దతుగా ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ఆపిల్ ధరలను నియంత్రించే పనిని మోదీ ఒక వ్యక్తికి అప్పగించారని ఆరోపించారు.

'అదానీ షేర్‌ ధరలు పెరిగాయి'

నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ కంపెనీల షేర్ల ధరలు పెరుగుతాయని రాహుల్ అన్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

అర్హులైన పేద కుటుంబాలను ఏటా రూ.లక్ష అందజేస్తామన్నారు. దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాన్నారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు 'పెహ్లీ నౌక్రీ పక్కి అధికార్' కార్యక్రమం కింద ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

‘బీజేపీ కుట్రను తిప్పికొట్టండి’

రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ నేతల ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నాలుగు లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. .

Read More
Next Story