మిస్టరీ : లాస్యనందిత కారు ప్రమాదంలో పలు ట్విస్టులు
x
MLA Lasya nandita (ఫేస్ బుక్ ఫొటో)

మిస్టరీ : లాస్యనందిత కారు ప్రమాదంలో పలు ట్విస్టులు

కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం ఘటనలో పలు ట్విస్టులు వెలుగుచూశాయి. కారును ఢీకొన్న లారీ ఆగకుండా పోవడం మిస్టరీగా మారింది.


కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై పటాన్‌చెరు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సదాశివపేటలో ఓ ప్రైవేటు పార్టీకి హాజరై తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 5.15 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదం అసలు ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు ప్రత్యక్ష సాక్షులను సైతం ఆరా తీస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో రోడ్డు ప్రమాద ఘటనలో పలు విషయాలు వెలుగుచూశాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొని 100 మీటర్ల దూరం లాక్కెళ్లిందనే కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగినపుడు కారు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఉందని పోలీసులు చెప్పారు. కారును ఢీకొన్న లారీ ఆగకుండా పోవడం మిస్టరీగా మారింది. దీంతో పోలీసులు ఆ లారీ గురించి సీసీటీవీ ఫుటేజీలో పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే కారును ఢీకొన్న లారీని గుర్తిస్తే అసలు విషయాలు వెలుగుచూస్తాయని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురై రెయిలింగ్ ను ఢీకొందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

కారు పీఏ ప్రకాశ్ నడిపారా?

ఎమ్మెల్యే లాస్య కారును ఆమె స్నేహితుడైన పీఏ ఆకాష్ నడిపాడని చెబుతున్నారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనలో పీఏ ఆకాష్ తో పాటు ఆమె డ్రైవరు కూడా గాయపడ్డారు. ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేస్తున్న ఆకాష్ ఇటీవల కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడని సమాచారం. గతంలో లాస్య కారు డ్రైవరు వల్ల రెండు సార్లు ప్రమాదాలు జరిగాయి. ఎమ్మెల్యే అయ్యాక కార్ఖానాలో కారులో వెళుతుండగా స్వల్ప ప్రమాదం జరిగి కారు దెబ్బతిందని లాస్య కుటుంబ సన్నిహితులు చెప్పారు. మరోసారి ఫిబ్రవరి 13వతేదీన నల్గొండలో జరిగిన బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా రెండోసారి కారు ప్రమాదానికి గురై హోంగార్డు మరణించాడు.

తండ్రి సాయన్న మరణం తర్వాత...

లాస్యనందిత తండ్రి అయిన జి సాయన్న గత ఏడాది ఫిబ్రవరి 19వతేదీన మరణించారు. తండ్రి సాయన్న మరణించాక ఏడాది తర్వాత ఆయన కూతురు లాస్యనందిత ఎమ్మెల్యే అయ్యాక ఫిబ్రవరి 23వతేదీన చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయింది. సాయన్న మరణం తర్వాత ఆయన కుటుంబంలో లాస్యనందితను మూడు సార్లు కాదు అయిదు సార్లు ప్రమాదాలు వెంటాడాయని ఆమె సన్నిహితులు, బీఆర్ఎస్ అభిమానులు చెబుతున్నారు. వెంటాడిన వరుస ప్రమాదాలు, లాస్యనందిత తుదిశ్వాస విడిచిన ఘటనలతో ఆమె కుటుంబ సన్నిహితులు, స్నేహితులు, బీఆర్ఎస్ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగారు. లాస్యకు గతంలో వెంటాడిన ప్రమాదాల గురించి గుర్తు చేసుకుంటూ కార్యకర్తలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.




మూడు ప్రమాదాలు కాదు అయిదు ప్రమాదాలు వెంటాడాయా?

సాయన్న మరణించగానే ఇంట్లో లాస్య చిన్న ప్రమాదానికి గురై గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అనంతరం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన లాస్య లిఫ్ట్ ఎక్కగా అది కాస్తా కూలి స్టక్ అయింది. దీంతో కార్యకర్తలు రాడ్లతో లిఫ్ట్ ను బలవంతంగా తెరిచి ఎమ్మెల్యేను కాపాడారు. అనంతరం కార్ఖానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత కారు దెబ్బతింది. కార్ఖానా ప్రమాదం తర్వాత ఫిబ్రవరి 13వతేదీన నల్గొండలో జరిగిన ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య గాయపడ్డారు. మళ్లీ శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రాణాలు కోల్పోయారు.

సీటు బెల్టు పెట్టుకోక పోవడంతోనే...

మారుతీ సుజుకీ ఎక్స్ ఎల్ కారు మిడిల్ సీటులో కూర్చున్న లాస్యనందిత సీటు బెల్టు పెట్టుకోక పోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఎమ్మెల్యే లాస్య తలకు తీవ్ర గాయం కావడంతోనే మరణించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతోనే లాస్య మృతి చెందిందని పోలీసులు చెబుతున్నారు. గతంలో వరుసగా మూడు ప్రమాదాలు జరిగినా లాస్య తన డ్రైవరును మాత్రం మార్చలేదని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానించారు. గతంలో తన తండ్రి అయిన సాయన్న వద్ద పనిచేసిన సిబ్బందిని వదిలి లాస్య ఎమ్మెల్యే అయ్యాక కొత్త వారిని డ్రైవరు, పీఏలను నియమించుకుందని ఓ బీఆర్ఎస్ అనుచరుడు చెప్పారు.

Read More
Next Story