తెలంగాణ నయాగరా కుంటాల జలపాతానికి కొత్త అందాలు
x
తెలంగాణ నయాగరా కుంటాల జలపాతం అందాలు (ఫొటో క్రెడిట్ : ఫేస్ బుక్)

తెలంగాణ నయాగరా కుంటాల జలపాతానికి కొత్త అందాలు

తెలంగాణ నయాగరాగా పేరొందిన కుంటాల జలపాతానికి కొత్త అందాలు సంతరించుకోనున్నాయా? అంటే అవునంటున్నారు ఆదిలాబాద్ అధికారులు.కుంటాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.


చుట్టూ ఎతైన పచ్చని టేకు, ఇతర రకాల చెట్లు...నిత్యం సంచరించే వివిధ రకాల జంతువులు...వివిధ రంగురంగుల పక్షులు...వాటి కిలకిల రావాలతో కూడిన ఎతైన సహ్యాద్రి పర్వతాలు... 45 మీటర్ల పర్వతాల నుంచి జలజల జాలువారుతున్న జలాలు...నీటి గలగలల చప్పుళ్లు...తెలంగాణ నయాగరా జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

- సహ్యాద్రి పర్వత శ్రేణులపై కడెం నదిపై కుంటాల గ్రామం వద్ద అభయారణ్యంలో ఉన్న కుంటాల జలపాతాన్ని వీక్షించేందుకు తెలంగాణ ,పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ప్రకృతి ప్రేమికులు తరలివస్తుంటారు.సుందరమైన ప్రకృతి అందాలతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది.కుంటాలలో పర్యాటకులకు వసతి, హోటళ్లు, మరుగుదొడ్లు,పార్కింగ్‌లు మొదలైన కనీస సౌకర్యాలు లేవు.
ఎక్కడ ఉందంటే...
ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్- నిర్మల్ జాతీయ రహదారిలోని నేరడిగొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంటాల జలపాతం ఉంది. అభయారణ్యంలో ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది.
శకుంతల స్నానమాడిన ప్రాంతమిది...
నాడు పురాతన కాలంలో కుంటాల జలపాతంలో దుష్యంతుడి భార్య శకుంతల స్నానమాడినట్లు కుంటాల ప్రజల విశ్వాసం. ఈ జలపాతం అందాలను చూసిన శకుంతల ఇక్కడి పరిసరాలను చూసి మైమరచిపోయారని చెబుతుంటారు. అన్ని కాలాల్లోనూ నీళ్లు జాలువారుతున్న ఈ జలపాతంతోపాటు ప్రకృతి అందాల సోయగాలను వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తుంటారు.

జలపాతం రాతి గుహల్లో శివలింగాలు
కుంటాల జలపాతం రాతి గుహల్లో శివలింగాలు ఉన్నాయి. ఈ జలపాతం గుండాన్ని సోమన్న గుండంగా పిలుస్తుంటారు. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన జలపాతం వద్ద సోమన్న జాతర నిర్వహిస్తుంటారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ జాతర సందర్భంగా శివలింగాలకు భక్తులు పూజలు చేస్తుంటారు.

ప్రమాదాలకు నిలయం..35 మంది మృత్యువాత
కుంటాల జలపాతం దిగువ సమతల బండరాళ్లతో నునుపు దేలి జారుడుగా ఉన్నాయి. జలపాతం గుండాలు అత్యంత లోతుగా ఉండి నీళ్లు సుడులు తిరుగుతుంటాయి. జలపాతంలో నీళ్లు సుడులు తిరగడం వల్ల దీనిలో ఈదేవారు తరచూ నీళ్లలో మునిగిపోతూ ప్రమాదాల పాలవుతున్నారు. గతంలో 35 మంది పర్యాటకులు జలపాతంలో ఈతకు దిగి మరణించారు. దీంతో ఈ జలపాతంలో ఈత కొట్టడాన్ని నిషేధించారు.

జాలువారుతున్న కుంటాల జలపాతం

వర్షాకాలంలో వరదనీటి ఉగ్రరూపం దాల్చనున్న జలపాతం
వర్షాకాలంలో భారీవర్షాలు కురిసినపుడు, ప్రాజెక్టుల గేట్లు తెరచినపుడు కుంటాల జలపాతం వరదనీటి గలగలలతో ఉగ్రరూపం దాలుస్తుంటోంది. జలపాతం వద్ద ఎగసిపడుతున్న నీటి శబ్ధం కిలోమీటరు దూరం వరకు వినిపిస్తుంటుంది. ఈ జలపాతంలో వరదనీరు ప్రవహిస్తున్నపుడు ఇక్కడకు పర్యాటకులను అనుమతించరు. జలహోరు పెరిగినపుడు పోలీసులు నో ఏంట్రీ బోర్డులు పెడుతుంటారు.

ప్రతిపాదనల్లోనే కుంటాల జలపాతం అభివృద్ధి
ఈ ఏడాది ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించినా కుంటాల జలపాతం అభివృద్ధి ప్రతిపాదనలు ప్రతిపాదనల్లోనే ఉన్నాయి. కుంటాల జలపాతం ప్రకృతి సోయగాలకు నెలవైనా, సౌకర్యాలు కల్పించక పోవడంతో ప్రకృతి ప్రేమికులు నిరాశకు గురవుతున్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలతొ ఈ జలపాతం పరవళ్లు తొక్కుతోంది.

పెండింగ్ ప్రతిపాదలనకు మోక్షం కల్పించండి
కుంటాల జలపాతాన్ని అభివృద్ధి చేసి, జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తే పర్యాటకుల ద్వారా ఆదాయం పెరగడంతో పాటు గిరిజనులకు ఉపాధి లభిస్తుందని నేరడిగొండకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మీర్జా ముజతబా బేగ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జలవిద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఆదిలాబాద్ జిల్లాలో విద్యుత్ వెలుగులు ప్రసరిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పెండింగ్ ప్రతిపాదనలను తక్షణం అమలు చేయాలని బోధ్ ప్రాంతంలోని సోనాల ప్రాంతానికి చెందిన సోషల్ యాక్టివిస్టు భాస్కర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కుంటాలలో పరవశిస్తున్న పర్యాటకులు

కుంటాల వాటర్‌ఫాల్స్‌లో హోటల్‌ నిర్మాణానికి రూ.3.98 కోట్లు
గిరిజనాభివృద్ధి శాఖకు చెందిన ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ 2019వ సంవత్సరంలో కుంటాల వాటర్‌ఫాల్స్‌లో హోటల్‌ను ఏర్పాటు చేయడానికి, హెచ్చరిక బోర్డులు, కంచెలు మరియు వ్యూపాయింట్‌లను ఏర్పాటు చేయడానికి రూ.3.98 కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ ఏజెన్సీని ఎంపిక చేశారు. దీనికోసం డీపీఆర్ ను కూడా సిద్ధం చేశారు.

త్వరలో పనులు ప్రారంభిస్తాం : ఉట్నూర్ ఐటీడీఏ అధికారి భీమ్ రావు
కుంటాల జలపాతం అభివృద్ధి ప్రతిపాదనలు 2022లో తమకు వచ్చాయని ఉట్నూర్ ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారి భీమ్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ పనుల కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని జులై నెలలో పనులు ప్రారంభిస్తామని ఇంజినీరింగ్ అధికారి వివరించారు. 2023లో అమల్లోకి వచ్చిన మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ వల్ల పనులు ఆలస్యమయ్యాయని డివిజనల్‌ ఇంజినీర్‌ భీమ్‌రావు చెప్పారు.

కాగితాల్లోనే కుంటాల జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ప్రతిపాదనలు
రెండున్నర దశాబ్దాల క్రితం కుంటాల జలపాతం వద్ద విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మించాలని ప్రస్థుత ఆదిలాబాద్ ఎంపీ, నాటి బోధ్ ఎమ్మెల్యే, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గోడం నగేష్ అధికారులను ఆదేశించి ప్రతిపాదనలు రూపొందించారు. కుంటాల వద్ద ఏడాది పొడవునా నీరు జాలువారుతున్న నేపథ్యంలో దాని నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి గిరిజన గ్రామాలకు అందించాలని నిర్ణయించినా ఈ ప్రాజెక్టు నిర్మాణం మాత్రం ప్రతిపాదనల్లోనే మగ్గుతోంది.

ఎండమావిగా మారిన కేబుల్ సస్పెన్షన్ వంతెన నిర్మాణం
కుంటాల జలపాతం వద్ద కేబుల్ సస్పెన్షన్ వంతెన, చెక్-డ్యామ్‌లు నిర్మించాలనే ప్రతిపాదనలు ఇప్పటికీ కాగితంపైనే ఉన్నాయి. 2018వ సంవత్సరంలో దశలవారీగా రూ.10 కోట్లు వెచ్చించి కుంటాలలో పలు సౌకర్యాలను కల్పించాలని ప్రతిపాదించారు.ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కుంటాల జలపాతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందించినా పనులు మాత్రం నత్తనడకగా సాగుతున్నాయి.


Read More
Next Story