కెసిఆర్ దర్శకత్వం లో ‘కూతురి కోసం’ : సరికొత్త కాపీ విడుదల
x
మాజీ డీసీపీ రాధాకిషన్ రావు (ఫోటో : ఎక్స్ సౌజన్యంతో)

కెసిఆర్ దర్శకత్వం లో ‘కూతురి కోసం’ : సరికొత్త కాపీ విడుదల

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ బాగోతంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారో బయటపెట్టారు.


తెలంగాణ రాష్ట్రంలో వెలుగుచూసిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో పలు కీలక విషయాలు తాజాగా వెలుగుచూశాయి. ఈ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో సంచలన విషయాలు బయటపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా బయటపడిన విషయాలను పోలీసు వర్గాలు సోమవారం వెల్లడించారు.

- బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిన నేతల ఫోన్లపై నిఘా పెట్టినట్లు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తాజాగా వెల్లడించారు. ఒకే నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో విభేదాలున్న పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని తేలింది.
- కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే పి వివేకానందతో విభేదాలున్న శంబీర్ పూర్‌ రాజుపై రాధాకిషన్‌రావు నిఘా వేసినట్లు చెప్పారు.
- పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరితో అప్పటి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు విభేదాలున్న నేపథ్యంలో వారి ఫోన్లపై నిఘా వేశారు.
- తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా ఫోన్ ట్యాపింగ్ నిఘా వేశారని వెల్లడైంది.
- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపైన కూడా నిఘా వేసినట్లు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అంగీకరించారు.
- గతంలో బీఎస్పీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేతలు తీగల కృష్ణారెడ్డి, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ఫోన్లను ట్యాప్ చేసినట్లు రాధాకిషన్‌రావు తెలిపారు.

పలువురి నేతల ఫోన్ల ట్యాపింగ్
తెలంగాణలో తమకు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలు జానారెడ్డి కొడుకు రఘువీర్‌ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు,వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ల ట్యాపింగ్ చేశారు. ఇతర నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ఎంపీ అరవింద్ తో పాటు వారి అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. మీడియా యజమానుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు రాధాకిషన్‌రావు వాగ్మూలంలో పేర్కొన్నారు. నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు వారి కదలికలను ట్రాక్ చేయడానికి కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆయన చెప్పారు.

స్నాప్‌చాట్‌లో వివరాల సేకరణ
కొందరు నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని వాట్సాప్ కాల్స్ చేశారు. దీంతో స్నాప్‌చాట్‌ వివరాలను కూడా సేకరించారని సమాచారం. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్స్‌ను విశ్లేషించినట్లు ప్రణీత్‌రావు అంగీకరించారు. మాజీ మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో ఓ మీడియా యజమాని ప్రణీత్‌రావుతో డైరెక్ట్‌గా టచ్‌లోకి వచ్చారని దర్యాప్తులో వెల్లడైంది.మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతో పలువురు నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని తేలింది.

వీఐపీలపై పోలీసు నిఘా
ఓ న్యూస్ ఛానల్ యజమాని అక్టోబర్, నవంబర్‌ నెలల్లో వీఐపీల సమాచారాన్ని ప్రణీత్‌రావుకు అందించారని తేలింది. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ధన సహాయం చేసే వారిపై నిఘా వేశారని దర్యాప్తులో వెలుగు చూసింది. సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్‌ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని తాము టార్గెట్ చేసినట్లు ప్రణీత్‌రావు అంగీకరించారు.

కవితను తప్పించేందుకు బీఎల్ సంతోష్ పై కేసు?
పైలెట్ రోహిత్ రెడ్డితోపాటు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించారని దర్యాప్తులో వెల్లడైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు యత్నం కేసులో బీజేపీ కీలక నాయకుడు బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బీఎల్ సంతోష్ ను అడ్డు పెట్టుకొని ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితురాలైన కవితను తప్పించేందుకు పథకం పన్నారని దర్యాప్తులో తేలింది. తాజాగా వెలుగుచూసిన ట్యాపింగ్ బాగోతంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే.

నా ఫోన్ ట్యాపింగ్ చేశారని వాంగ్మూలంలో తేలింది : కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ను ట్యాపింగ్ చేసి తన కదలికలను తెలుసుకున్నారని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన రాధాకిషన్ రావు తాజాగా ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయం బయటపెట్టారని జువ్వాడి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికల్లో గెలిచారని ఆయన విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా తప్పే : బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత‌కు సంబంధించిన విషయమని, ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా తప్పే అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే ఎవరైనా చట్ట ప్రకారం శిక్షర్హులేనని ఆయన స్పష్టం చేశారు. ఒక మాజీ పోలీసు అధికారిగా నేను ఈ మాట చెబుతున్నానని ప్రవీణ్ కుమార్ చెప్పారు. రాజకీయ పరంగా ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేసినా తప్పేనని ఆర్ఎస్ స్పష్టం చేశారు.

Read More
Next Story