అమరావతికి సాయం కాదు అప్పు మాత్రమే!
x

అమరావతికి సాయం కాదు అప్పు మాత్రమే!

ఏపీ ప్రజలు ఈ ప్రకటనపై ఆశాభంగానికి గురవుతారని ఒక పారిశ్రామికవేత్త అన్నారు. కేంద్రం ఒక భారీ గ్రాంట్ ఇస్తుందేమనని ఆశిస్తే, అప్పుగా ఇస్తామని చెప్పారని అన్నారు.


కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెడుతోంది మనమే కాబట్టి ఈ బడ్జెట్‌లో ఏదో ఒక పెద్ద లపక వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఏపీ ప్రజలకు మళ్ళీ నిరాశే ఎదురయింది. చంద్రబాబునాయుడు లక్ష కోట్ల సాయం అడిగితే నిర్మలమ్మ 15 వేల కోట్లు వివిధ సంస్థలనుంచి అప్పుగా ఇప్పిస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు.

బడ్జెట్‌పై భారత పరిశ్రమల సమాఖ్య - సీఐఐ ఇవాళ నిర్వహించిన సమీక్షా సమావేశంలో సభ్యులైన పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు స్పందించారు. సర్దా మెటల్స్ అండ్ అల్లాయ్స్ సంస్థ డిప్యూటీ ఎండీ నీరజ్ సర్దా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రకటనపై ఆశాభంగానికి గురవుతారని అన్నారు. అమరావతి అనేది ఏపీకి ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అని చెప్పారు. దీని నిర్మాణానికి కేంద్రం ఒక భారీ గ్రాంట్ ఇస్తుందేమనని ఆశిస్తే, అప్పుగా ఇస్తామని చెప్పారని అన్నారు.

ఆర్‌హెచ్ఐ క్లాసిల్ సంస్థ ఛైర్మన్ ఆర్‌వీఎస్ రుద్రరాజు మాట్లాడుతూ, తాము కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యామని చెప్పారు. అయితే 15,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరానికే కాబట్టి మున్ముందు మరిన్ని ప్రయోజనాలు వస్తాయని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అప్పుగా ఇవ్వటం తప్పు అని తాను అనుకోనని, అయితే అప్పుకంటే గ్రాంట్‌గా ఇస్తే బాగుండేదని అన్నారు.

సీఐఐ వైజాగ్ ఛైర్మన్ గ్రంథి రాజేష్ బడ్జెట్‌పై స్పందిస్తూ, మా అంచనాలకు తగ్గట్టుగా లేకపోవటంతో నిరుత్సాహపడిన మాట నిజం అని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి, కొత్త రాజధానికి నిధుల గురించి పలకటమే గొప్పలాగా అనిపించిందని, గత పది సంవత్సరాలుగా ఈ చట్టాన్ని పట్టించుకున్న నాథుడు లేడని, ఇప్పుడు అది తిరిగి ప్రాణం పోసుకుందని రాజేష్ చెప్పారు. ఇంకా ఐదేళ్ళు ఉంది కాబట్టి అమరావతికి కావలసిన లక్ష కోట్ల రూపాయల కల నెరవేరుతుందని ఆశించవచ్చని అన్నారు.

ఇదిలా ఉంటే, రాజ‌ధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు గ్రాంటా? లేక అప్పా? అనేది తేల్చాల‌ని తిరుపతి ఎంపీ, వైసీపీ నేత గురుమూర్తు డిమాండ్ చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అప్పు భారాన్ని మోప‌వ‌ద్ద‌ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రాంట్ రూపంలోనే ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. పోల‌వరాన్ని పూర్తి చేస్తామ‌ని ప‌దేళ్లుగా కేంద్రం చెబుతోందని అన్నారు. పోల‌వ‌రానికి నిధులిస్తున్న పాపాన పోలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. పోల‌వ‌రాన్ని నిర్దేశిత స‌మ‌యంలోపు పూర్తి చేస్తామ‌ని ఇప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం చెప్ప‌లేద‌ని గురుమూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ 15,000 కోట్లు కాకుండా, ఏపీలో మౌలిక వసతులు, విద్యుత్, రవాణా రంగాలకు నిధులు మంజూరు చేస్తామని నిర్మల సీతారామన్ ప్రకటించారు. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఈ రెండింటిపై స్పష్టంగా ఎంత నిధులు, ఎప్పుడు అని మాత్రం చెప్పలేదు. చేపలు, రొయ్యల దాణాపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించటం మాత్రం ఏపీలోని అక్వా పరిశ్రమ ఎగుమతులకు ఊతమిచ్చినట్లవుతుందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

Read More
Next Story