తెలంగాణ స్థానిక ఎన్నికల్లో కీలకం కానున్న ‘నోటా’
x
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి పార్థసారథికి వినతిపత్రాన్ని సమర్పిస్తున్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు యం పద్మనాభ రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు

తెలంగాణ స్థానిక ఎన్నికల్లో కీలకం కానున్న ‘నోటా’

ఎన్నికల్లో ‘నోటా’కు ఓటు వేయడం అంటే పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం. ఈ నోటా తెలంగాణ గ్రామ ఏకగ్రీవ ఎన్నికలకు ఆటంకం కానుందా?


పార్లమెంట్ ఎన్నికల పర్వం ముగియగానే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నోటా ఓటు కీలక చర్చనీయాంశంగా మారింది.

- ఎన్నికల్లో ఏ అభ్యర్థి కూడా నచ్చనప్పుడు ఓటర్లు నోటాకు ఓటు వేస్తుంటారు. నోటాకు ఓటు వేయడం అంటే ఏ పార్టీ అభ్యర్థి కూడా నచ్చలేదని అర్థం. నోటాకు ఎన్ని ఓట్లు వచ్చినా ఎన్నికలను ప్రభావితం చేయడం లేదు. అయితే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఈ నోటా ఓటు ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికలకు ఆటంకంగా మారనుంది.

ఏకగ్రీవ ఎన్నికలకు నోటా ఆటంకమా? సుప్రీం విచారణ
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతోపాలు మిగిలిన అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికలయ్యారని ఎన్నికల అధికారి ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో నోటాను కూడా ఒక కల్పిత అభ్యర్థిగా గుర్తించి ఏకగ్రీవ ఎన్నికను ఆపాలని సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది.

నోటా కూడా కల్పిత అభ్యర్థి...పలు రాష్ట్రాల ఎన్నికల కమిషన్ల ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కూడా కల్పిత అభ్యర్థిగా పలు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ప్రకటించాయి. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు నోటా కల్పిత అభ్యర్థిగా బరిలో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎన్నికలు జరపాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ఆదేశించారు.

సర్పంచ్ పదవులకు వేలంపాట...ఏకగ్రీవాలు
తెలంగాణలో 2019 లో జరిగిన గ్రామ పంచాయితీల ఎన్నికల్లో కొన్ని గ్రామాల సర్పంచ్ పదవులకు వేలంపాట జరిగింది. గ్రామాభివృద్ధికి అత్యధికంగా డబ్బు చెల్లించిన అభ్యర్థిని గ్రామస్థులే ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ దుష్ట సంప్రదాయం వల్ల ప్రజలు వారికున్న ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు.

ఎన్నికల కమిషనరుకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వినతి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నోటాను కూడా ఒక కల్పిత అభ్యర్థిగా గుర్తించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నిక ఏకగ్రీవం కాకుండా పోలింగ్ నిర్వహించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి పార్థసారథిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభ రెడ్డి నేతృత్వంలో కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి, జాయింట్ సెక్రటరీ పి భాస్కర్ రెడ్డి, సభ్యురాలు పాషం విద్యలు కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాకు అధిక ఓట్లు వస్తే ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు. గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తావివ్వకుండా నోటాను కూడా కల్పిత అభ్యర్థిగా పరిగణించి ఎన్నికలు నిర్వహించాలని పద్మనాభరెడ్డి కోరారు.

నోటాపై నిష్ణాతులతో చర్చావేదిక
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ప్రాధాన్యంపై చర్చించేందుకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నిష్ణాతులతో ఈ నెల 28వతేదీన ప్రెస్ క్లబ్ లో చర్చావేదిక నిర్వహించాలని నిర్ణయించినట్లు యం పద్మనాభరెడ్డి చెప్పారు. నోటాపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండటం, కొన్ని రాష్ట్రాలు నోటాను కల్పిత అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ స్థానిక పోరులో నోటా అంశంపై ఎన్నికల కమిషనర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.


Read More
Next Story