హైదరాబాద్‌లో సరస్సుల సంరక్షణకు నడుం కట్టిన అధికారులు
x
హైదరాబాద్ నగరంలో సుందరంగా తీర్చిదిద్దిన సరస్సు

హైదరాబాద్‌లో సరస్సుల సంరక్షణకు నడుం కట్టిన అధికారులు

తెలంగాణలోని నగరాల్లో ఉన్న చెరువుల సంరక్షణకు రేవంత్ సర్కార్ ప్రాధాన్యమిస్తోంది.చెరువులను కబ్జాలు, కలుషితం బారి నుంచి కాపాడేందుకు మున్సిపల్ శాఖ నడుం కట్టింది.


హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోనే 3,500 చెరువులున్నాయి. ఈ చెరువులను కబ్జాల బారి నుంచి సంరక్షించడమే కాకుండా అందులోని నీరు కలుషితం కాకుండా చూసేందుకు మున్సిపల్ శాఖ అధికారులు వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

- మూసీ ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. మూసీ నదిని కాలుష్య రహితంగా చేసి, నదీ తీర ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదద్దనున్నారు.
- హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోని ఇతర నగరాలు,పట్టణాల్లోని చెరువులకు మున్సిపల్ అధికారుల చొరవతో మహర్దశ పట్టనుంది. దీనిలో భాగంగా మంగళవారం నాడు హైదరాబాద్ నగర ప్రాంతాల్లోని చెరువులు, సరస్సుల సంరక్షణ, పునరుజ్జీవనంపై జరిగిన సదస్సులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ సీనియర్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సరస్సుల రక్షణరంగ నిపుణులు పాల్గొన్నారు.

సరస్సుల పరిరక్షణకు ప్రాధాన్యం
తెలంగాణలోని నగరాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని సరస్సుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ చెప్పారు. సరస్సులు, వాటి పరివాహక ప్రాంతాలను రక్షించాలనే లక్ష్యంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని సరస్సుల సంరక్షణ కోసం సరస్సుల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. సరస్సులు మనకు అనేక పర్యావరణ ప్రయోజనాలను అందించడమే కాకుండా,మన జీవన నాణ్యతను ప్రభావితం చేస్తాయని దానకిషోర్ పేర్కొన్నారు.

కలుషితం అవుతున్న చెరువులు
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 4,234కు పైగా చెరువులు ఉన్నాయని మున్సిపల్ శాఖ అధికారిక రికార్డులే చెబుతున్నాయి. వేగవంతమైన పట్టణీకరణ ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు సరస్సులు తీవ్రంగా కలుషితమయ్యాయి. కొన్ని చెరువులు ఆక్రమణల పాలవుతున్నాయి,దీంతో రాష్ట్రంలో భూగర్భజలమట్టాన్ని పెంచడానికి సరస్సుల పునరుద్ధరణ చేపట్టారు. చెరువుల్లోని మురుగునీటిని శుద్ధి చేసేందుకు సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్లను నిర్మించడం, బఫర్ జోన్‌లు, నదీతీర ప్రాంతాల్లో మొక్కల పెంపకం చేపట్టడం, నీటి వనరులను సంరక్షించాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సరస్సుల రక్షణ, పునరుజ్జీవన కోసం దీర్ఘకాలిక ప్రయత్నాలు చేయాలని దానకిషోర్ కోరారు.

సుందర సరస్సులు...
సరస్సులు కేవలం సుందరమైన ప్రకృతి దృశ్యాలు మాత్రమే కాదని, అవి జీవవైవిధ్యానికి తోడ్పడే కీలక పర్యావరణ వ్యవస్థలు. భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం, వాతావరణాన్ని క్రమబద్ధీకరించడం,కమ్యూనిటీలకు వినోదభరితమైన ప్రదేశాలను సరస్సులు అందిస్తాయని మున్సిపల్ డైరెక్టర్ దివ్య చెప్పారు. పట్టణీకరణ, కాలుష్యం,నిర్లక్ష్యం వల్ల సరస్సులు కబ్జాల పాలవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

చెరువులను సంరక్షిద్దాం...
మున్సిపల్ ఇంజనీర్లు, కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్.జి.ఓలతో కలిసి అర్బన్ ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణ, పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కోరారు. చెరువుల పునరుద్ధరణ, పరిరక్షణ పై ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. దృవాన్ష్ ఎన్.జి.ఓ ప్రతినిధి శ్రీమతి మధులిక, సహే ఎన్.జి.ఓ ప్రతినిధి కల్పన రమేష్, సకి వాటర్ ఎన్.జి.ఓ కె.శర్మ, ఇతర ఎన్.జి.ఓ ప్రతినిధులతో ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొన్నారు. చెరువులను సంరక్షించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవడం అనందాన్నిస్తుందని చెరువుల సంరక్షణ ఉద్యమకారిణి డాక్టర్ లూబ్నా సర్వత్ చెప్పారు. అధికారులు చిత్తశుద్ధిగా పనిచేసి చెరువులు కబ్జాలు కాకుండా నిరోధించి, కలుషిత నీరు చెరువుల్లోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని లూబ్నా సర్వత్ సలహా ఇచ్చారు.

భూగర్భజలమట్టం పెంచడానికి...
హైదరాబాద్ నగరంలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో బోర్లు ఎండిపోయి ప్రజలు నీటి ఇక్కట్లు పడుతున్నారు. అదే సమయంలో చిన్నపాటి వర్షానికే నగరంలోని వీధులన్నీ జలమయమవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అమృత్ పథకంలో భాగంగా జీహెచ్ఎంసీ పైలట్ ప్రాతిపదికన 'షాలో అక్విఫర్ రీఛార్జ్ ప్రాజెక్ట్ (నిస్సార జలాశయ రీఛార్జ్)'ను చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని ఐదు మున్సిపల్ పార్కులను ఎంపిక చేశారు. ఎల్ బీ నగర్ మండలంలో రెండు పార్కులు, హబ్సిగూడలోని కాకతీయ పార్కు, సైనిక్‌పురి వద్ద ఈ-సెక్టార్ పార్క్, ఖైరతాబాద్ కేఎల్ఎన్ యాదవ్ పార్కు,ఇందిరాపార్కులను ఎంపిక చేశారు.

భూగర్భ జలమట్టం పెంచేందుకు చర్యలు
100-120 అడుగుల లోతు వరకు నిస్సారమైన నీటి ఇంజెక్షన్ బోర్‌వెల్‌లను డ్రిల్ చేశారు. లోతులేని జలాశయాల్లోని నీటిని బయటకు పంపించడం ద్వారా వర్షం కురిసినప్పుడల్లా దిగువ పొరలు రీఛార్జ్ అవుతుంటాయి. జల సంరక్షణపై నిపుణులు హైదరాబాద్ నగరంలోని కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. భూగర్భ జల మట్టం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై తాము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సునందరాణి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రీఛార్జ్ పిట్‌ల ద్వారా నీటిని పంపడం. వల్ల భూగర్భ పొరలు రీఛార్జ్ అవుతుంటాయి. దీనివల్ల భూగర్భ జలమట్టం పెరుగుతోంది.


Read More
Next Story