వెల్లివిరిసిన మానవత్వం, మసీదుల్లో రోగులకు ఉచితంగా వైద్యసేవలు
x
మసీదులో రోగులకు చికిత్స

వెల్లివిరిసిన మానవత్వం, మసీదుల్లో రోగులకు ఉచితంగా వైద్యసేవలు

హైదరాబాద్‌లోని కొన్ని మసీదులు ఆథ్యాత్మిక సేవలే కాకుండా రోగులకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాయి. ఐదు పూటలా నమాజులతో పాటు రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.


రోగులను పరామర్శిస్తేనే పుణ్యం వస్తుందని ఇస్లాం చెబుతోంది. అదే రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తే ఇంకెంతో పుణ్యకార్యం చేసినట్లు అవుతుందని, అందుకే హైదరాబాద్ మసీదుల్లో కొందరు దాతలు ముందుకు వచ్చి రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారని ప్రముఖ ఇస్లాం రచయిత ముహమ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

- హైదరాబాద్ నగరంలోని సహహీన్ నగర్‌ ప్రాంతంలోని మసీదు...ఈ మసీదులో ప్రార్థనలు చేయడానికే కాకుండా ఉచితంగా వైద్యం చేయించుకునేందుకు రోగులు బారులు తీరుతున్నారు. ఇదేమిటీ? మసీదులో వైద్యం ఏమిటి అనుకుంటున్నారా?
- కొన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి పలు మసీదుల్లో రోగులకు ఉచితంగా వైద్యసేవలు,డయాలసిస్ సేవలు అందిస్తున్నారు.
- సహహీన్ నగర్‌ ప్రాంతంలోని మసీదులో రోగులకు చికిత్స అందించడానికి 20 పడకల ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
- మసీదులోనే ఆక్సిజన్ పైప్‌లైన్, పారా మానిటర్లు, డీఫిబ్రిలేటర్లతో సహా ఆధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేసి, సమర్థులైన వైద్యులు,నర్సుల బృందం 24x7 రోగులకు సేవలు అందిస్తున్నారు.

అంటువ్యాధులకు మసీదు ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స
హైదరాబాద్ పాత బస్తీలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం లేని కారణంగా టైఫాయిడ్, డెంగీ, చికున్‌గున్యా, డయేరియా వంటి కాలానుగుణ వ్యాధులు అధికంగా ప్రబలుతున్నాయి. దీంతో ఈ రోగులకు ఉచితంగా చికిత్స అందించేందుకు మసీదులోనే ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు.స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఏఎంపీఐ యూఎష్ఏ, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల పూర్వ విద్యార్థులు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు.

విరాళాలతో ఉచిత వైద్యసేవలు
మసీదులో ఆసుపత్రి నిర్వహణ కోసం ఏఎంపీఐ విరాళం అందించింది.తాము మసీదులోనే ఆసుపత్రితో పాటు ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని నడుపుతున్నామని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముజ్తబా హసన్ అస్కారీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
-

మసీదులో కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్
హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతం సర్దార్ బాగ్ మహమ్మదీయ అహ్లే హదీస్ మసీదులో కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అహ్లే హదీస్ హైదరాబాద్ నగర కార్యదర్శి తాహేర్ ఉమ్రీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మసీదులో డయాలసిస్ సెంటరు నిర్వహణ వ్యయాన్ని తల్లిదండ్రులు లేట్ ఎం హెచ్ అస్కరీ,సాధియా అస్కరీల స్మారకార్థం ప్రారంభించామని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముజ్తబా హసన్ అస్కారీ ‘ఫెడరల్ తెలంగాణ’కు తెలిపారు.

హైదరాబాద్ లో పెరుగుతున్న కిడ్నీ రోగులు
హైదరాబాద్ నగరంలో బీపీ, షుగర్ ప్రభావాల వల్ల కిడ్నీలు ఫెయిలై డయాలసిస్ కు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది.నగరంలో కిడ్నీ రోగుల సంఖ్య 50 వేల మంది ఉన్నారని, కిడ్నీ రోగులకు వారానికి రెండు రోజులు లేదా మూడు రోజులపాటు డయాలసిస్ చేయించుకోవాలని నెఫ్రాలజిస్టులు సూచించారని మసీదులోని డయాలసిస్ కేంద్రం ఇన్ చార్జి , సీనియర్ టెక్నీషియన్ వెంకటేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మహమ్మదీయ మసీదు లో 25శాతాన్ని డయాలసిస్ రోగుల కేంద్రం కోసం కేటాయించారని ఆయన పేర్కొన్నారు.



ఒకవైపు ప్రార్థనలు...మరో వైపు డయాలసిస్

మసీదులో ఒకవైపు భక్తులు ప్రార్థనలు చేస్తుండగా, మరో వైపు కిడ్నీ రోగులకు ఉచితంగా తాము డయాలసిస్ చేస్తున్నామని ఆయన వివరించారు. డయాలసిస్ కోసం కావాల్సిన డయాలజైర్, ట్యూబింగ్ లను కూడా తామే ఉచితంగా సమకూరుస్తున్నామని ఆయన తెలిపారు. మసీదులో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సహకారంతో తాము రోజుకు 18 మందికి రెండు షిప్టుల్లో డయాలసిస్ చేస్తున్నామని వెంకటేష్ చెప్పారు.

25వేల మంది రోగులకు వైద్యసేవలు
హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ విప్రో కేర్‌తో కలిసి 11 గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ క్లినిక్‌లను నిర్వహించడంతోపాటు 25వేల మంది రోగులకు వైద్యసేవలు అందిస్తోందని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధి చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయని, అలాంటి రోగులను గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తాము ఉచితంగా కంటిశుక్లం శస్త్రచికిత్సలు,దంత చికిత్స కూడా చేపిస్తున్నామని ప్రతినిధి వివరించారు.


Read More
Next Story