తెలంగాణలో రేపే పార్లమెంట్ పోలింగ్...ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే...
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఆదివారమే ఈవీఎంలతోపాటు పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ కంటోన్మెంటు అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ రాజ్ ప్రకటించారు. పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేశామని ఆయన తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లపై సీఈఓ వికాస్ రాజ్ అందించిన వివరాలివి...
మారుమూల ప్రాంతాల్లో 4 గంటలకే ముగియనున్న పోలింగ్
మారుమూల సమస్యాత్మక ప్రాంతాలైన ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి లోక్ సభ పరిధిలోని చెన్నూర్,బెల్లంపల్లి, మంచిర్యాల,మంథని, వరంగల్ ఎంపీ పరిధిలోని భూపాలపల్లె,మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు,భద్రాచలం, పినపాక,యెల్లందు, ఖమ్మం లోక్ సభ పరిధిలోని కొత్తగూడెం,అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. ఈ 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచార వ్యవధి శనివారం సాయంత్రం 4.00 గంటలకే ముగిసింది.
సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్
సికింద్రాబాద్ కంటోన్మెంటుతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కొనసాగుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 13 మారుమూల అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా మిగతా రాష్ట్రం మొత్తం పోలింగ్ ఆరుగంటల దాకా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆరుగంటల దాకా జరిగే పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
పోలింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమలు
పోలింగ్ సందర్భంగా మే 13వతేదీ సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా నలుగురి కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటాన్ని నిషేధిస్తూ సీఆర్పీసీ సెక్షన్ 144 కింద ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వులు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ రాష్ట్రం అంతటా అమలు అవుతుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి ప్రచారం ఆరు గంటల నుంచి చేయొద్దు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం అమలులో ఉంటుంది.
160 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలు
పోలింగ్ సందర్భంగా 160 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలను మోహరించామని తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. పోలింగ్ బందోబస్తుకు 72000 మంది రాష్ట్ర పోలీసులు, 20 వేలమంది పొరుగు రాష్ట్రాల పోలీసులు, 4వేల మంది ఇతర యూనిఫాం సేవలను ఉపయోగించుకుంటున్నామని సీఈఓ చెప్పారు.
రాష్ట్రంలో 8,600కోడ్ ఉల్లంఘన కేసులు
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 8,600 కేసులు నమోదు చేసినట్లు ఎన్నికల అధికారుల చెప్పారు. రాష్ట్రంలో రూ.320 కోట్ల డబ్బు, మద్యం, బంగారాన్ని సీజ్ చేశారు.
ప్రతీ అసెంబ్లీ సెగ్మెంటుకు ముగ్గురు ఈసీఐఎల్ ఇంజినీర్లు
పార్లమెంట్ పోలింగ్ సందర్భంగా ఈవీఎంలలో ఏర్పడిన సాంకేతిక లోపాలను సరిచేసేందుకు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటుకు ముగ్గురు ఈసీఐఎల్ ఇంజినీర్లను అందుబాటులో ఉంచారు. పోలింగ్ సిబ్బంది, ఈవీఎంల చేరవేతకు 1,05,019 బస్సులు 44,569 ఈవీఎంలు, 48,134 వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రాలకు పంపించారు.
1,96,000మంది పోలింగ్ సిబ్బంది
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కోసం 1,96,000 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.3,522 మంది సెక్టార్ అధికారులు, రూట్ ఆఫీసర్లను నియమించారు. రాష్ట్రంలో 35,809 పోలింగ్ స్టేషన్లు, 453 సహాయక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.మూడు చిన్న పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. చిన్న పోలింగ్ కేంద్రాల్లో 10, 12, 14 మంది ఓటర్లు ఉన్నారు.11 పోలింగ్ స్టేషన్లలో 25మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్నారు.22 పోలింగ్ స్టేషన్లలో ఒక్కొక్కటి 50 కంటే తక్కువ ఓటర్లు ఉన్నారు.54 పోలింగ్ స్టేషన్లలో ఒక్కొక్కటి 100 కంటే తక్కువ ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 12,909మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
సి విజిల్ ద్వారా 2,342 ఫిర్యాదులు
ఎన్నికల నియమావళి ప్రకారం 559 ఎన్నికల ప్రకటనలకు ఈసీ ఆమోదం తెలిపింది. సువిధ కింద 11,112 అనుమతులు
ఇచ్చారు. సి-విజిల్ ద్వారా ఈసీకి 2,342 ఫిర్యాదులు అందాయి.1950 కాల్ సెంటర్ ద్వారా 511 ఫిర్యాదులను స్వీకరించారు. పోలింగ్ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన బల్క్ ఎస్ఎంఎస్ ల ప్రసారం నిషేధించారు. రాష్ట్రంలో 20,163 ఇంటి ఓటింగ్,1.88 లక్షల పోస్టల్ బ్యాలెట్-ఓటింగ్ జరిగింది.
ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ సౌకర్యం
పార్లమెంట్ పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ సదుపాయం కల్పించామని తెలంగాణ ఎన్నికల కమిషన్ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. సీఈఓ ఆఫీస్ కు వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని సీఈఓ పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలు మే 13వ తేదీన సెలవు ఇవ్వడం లేదని తెలిసిందని, అలా సెలవు ఇవ్వకపోతే ఆయా కంపెనీలపై చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ హెచ్చరించారు.కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లలో ఉన్న ఇతర జిల్లాల వ్యక్తులు వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలని సీఈఓ ఆదేశించారు. పోలింగ్ సందర్భంగా పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది.
Next Story