పార్లమెంట్ ఎన్నికల్లో కాలనీల సమస్యలతో పీపుల్స్ మ్యానిఫెస్టో
x
హైదరాబాద్ నగరంలో కాలనీ సంఘాల పీపుల్స్ మ్యానిఫెస్టోనే కీలకం

పార్లమెంట్ ఎన్నికల్లో కాలనీల సమస్యలతో పీపుల్స్ మ్యానిఫెస్టో

పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాలనీల సమస్యలు ప్రధాన ఎన్నికల అంశాలుగా మారాయి.రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు కాలనీ సమస్యలతో పీపుల్స్ మ్యానిఫెస్టోను రూపొందించాయి.


హైదరాబాద్ నగరంలో కాలనీల సమస్యలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కీలక అంశాలుగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు,ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓట్లు అభ్యర్థించేందుకు తమ కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు వస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కాలనీ సమస్యలను ఏకరవు పెట్టి వాటి పరిష్కారానికి వారి నుంచి హామీలు పొందుతున్నారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించాలని, ట్రాఫిక్, వరద, మంచినీటి, డ్రైనేజీ సమస్యలను తీర్చాలని కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు అభ్యర్థులను కోరుతున్నారు.


సైబరాబాద్ లో 68 గేటెడ్ కమ్యూనిటీల వినతి
సైబరాబాద్ ప్రాంతంలోని 68 గేటెడ్ కమ్యూనిటీలకు చెందిన 20 లక్షల జనాభాతో కూడిన ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ సంస్థ పలు సమస్యలను అభ్యర్థుల ముందు ఉంచింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో సమావేశమైన ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ పలు సమస్యలను ప్రస్థావించింది. సైబరాబాద్ ప్రాంతంలో జనాభా పెరిగినందున మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు సాయి రవిశంకర్ చెప్పారు. దీంతోపాటు తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా మెదక్ పార్లమెంటు అభ్యర్థులతో సమావేశమై తమ ప్రాంతంలో మంచినీటి నల్లా కనెక్షన్లు లేవని, నీటి సరఫరాకు పైపు లైన్లు వేయించాలని కోరారు.ఆస్తి పన్నులు పెంచినా సౌకర్యాలు కల్పించలేదని కాలనీ సంఘాల ప్రతినిధులు ఆవేదనగా చెప్పారు.

మౌలిక సదుపాయాలు కల్పించండి
సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ఒకేసారి జరుగుతుండటంతో పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు తమ కాలనీల సమస్యలను అభ్యర్థుల ముందుంచారు. తమ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఫెడరేషన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ కాలనీస్ ఆఫ్ సికింద్రాబాద్ కార్యదర్శి చంద్రశేఖర్ కోరారు. అమ్ముగూడ, బొలారం, ఆర్కేపురం, గౌడ్ వల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో రోడ్డు ఓవర్ బ్రిడ్జీలు నిర్మించాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నివాసితులు కోరారు. మిలటరీ అధికారులు మూసివేసిన రోడ్లను తిరిగి తెరిపించాలని కాలనీ సంఘాలు కోరుతున్నాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఏరియాల వారీగా కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ప్రచారం చేయడంతోపాటు సమస్యలపై అభ్యర్థుల నుంచి హామీలు పొందుతున్నారు.

పీపుల్స్ మ్యానిఫెస్టో
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో ఉన్న వేలాది కాలనీ సంఘాలు తమ సమస్యల పరిష్కారానికి ఈ ఎన్నికల సందర్భంగా పీపుల్స్ మ్యానిఫెస్టోను రూపొందించాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల నియోజకవర్గాల పరిధిలో ఉన్న కాలనీ సంక్షేమ సంఘాలు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న సమస్యలతో పీపుల్స్ మ్యానిఫెస్టోను రూపొందించాయి. ఓట్లు అడిగేందుకు వచ్చిన అభ్యర్థులకు ఈ పీపుల్స్ మ్యానిఫెస్టోను ఇచ్చి అభ్యర్థుల సమాధానాలను తీసుకొని కాలనీ సంక్షేమ సంఘాల సర్వసభ్య సమావేశాల్లో పెట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని ఓట్లు వేస్తామని కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

సమస్యలెన్నో...
సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రధానంగా ఆర్వోబీ, ఆర్ యూబీ సమస్యలున్నాయి. సఫిల్ గూడ, ఈస్ట్ మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి, కంటోన్మెంట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కంటోన్మెంటు అధికారులు రోడ్లను మూసివేస్తుండటంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే వంతెనలు, రైల్వే క్రాసింగుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్లు పెండింగులోనే ఉన్నాయి. పారిశుద్ధ్య సమస్యలు, పెరిగిన వాయు కాలుష్యం సమస్యలున్నాయి. అపార్టుమెంట్ వాసులకు సమస్యలున్నాయి. అపార్టుమెంట్లలో సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాలనీ సంక్షేమ సంఘాలు కీలక పాత్ర పోషిస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో కాలనీ సంక్షేమ సంఘాలు ఏ పార్టీ అభ్యర్థులకు మద్ధతు ఇస్తారో జూన్ 4వతేదీ ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.


Read More
Next Story