ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఒక విచిత్రం కనిపించింది. కాంగ్రెస్, బీజేపీలు రాజీలేని పోరాటం చేస్తున్నపుడు, కాంగ్రెస్ ముక్త్ భారత్ బీజేపీ దూసుకుపోతున్నపుడు ఒక వేదిక మీద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కనిపించారు. కనిపించడమే కాదు, వాళ్లు ముచ్చట్లు చెప్పుకున్న తీరు చూస్తే చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. ఇందులో రెండో అర్థం ఏమీ లేదు అంతా అభివృద్ధి కోసమే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్లు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేంద్రం తెలంగాణ సర్కారు తీరు మారిందా.
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు ప్రధాని మోదీతోపాటు కేంద్రంతో ఎప్పుడూ ఘర్షణాత్మక వైఖరి అవలంభించారు. ఆయన ప్రధాని కార్యక్రమాలను బహిష్కరించే వారు. స్వాగతం కూడా పలికేవారు కాదు.
కానీ రేవంత్ సీఎం అయ్యాక తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా పనిచేస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
సోమవారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి స్వాగతం చెప్పి, అధికారిక సభలో పాల్గొని చాకచక్యం ప్రదర్శించారు. పార్టీలు వేరైనా అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టాలనే విషయాన్ని సీఎం రేవంత్ స్పష్టం చేసి అపర చాణుక్యుడిలా నిలిచారు. సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు రెండు రోజుల పర్యటనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి స్వయంగా స్వాగతం పలికి ఆయనతో పాటు సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీని ‘పెద్దన్న’ అంటూ సంభోదించిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సాయం కోరారు. ‘‘5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి మీ దార్శనికతలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.. గుజరాత్ మాదిరిగానే తెలంగాణను కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం’’ అని రేవంత్ ప్రధాని మోదీకి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాని మోదీకి శాలువ కప్పి స్వాగతం చెప్పి ఆయనతో వేదిక పంచుకున్నారు. దీంతో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం వెచ్చించిన నిధులను గురించి వివరిస్తూ, కార్యక్రమానికి హాజరైనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి చాకచక్యంగా వ్యవహరించారు...
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఎలాంటి భేషజాలు, పార్టీలు వేరు అని చూడకుండా సోమవారం మోదీతో కలిసి అధికారిక సమావేశంలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ ప్రగతి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని సీఎం ప్రకటించారు. పార్టీలు వేరైనా ఎన్నికల సమయంలోనేనని, అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తామనే అంశాన్ని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మలు భట్టివిక్రమార్కతో పాటు ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర సమస్యలు విన్నవించి నిధులు కోరారు. అనంతరం ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా కేంద్ర మంత్రులతో పాటు కేంద్ర కార్యదర్శులకు తెలంగాణకు నిధులు విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. నీతి ఆయోగ్ ను సైతం సీఎం కలిసి మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. మోదీతో వేదిక పంచుకోవడంతో పాటు పెద్దన్నయ్య అంటూ సంబోధించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారని తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి
‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం కలిసి మెలసి పనిచేయాల్సిన అవసరముందనే విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి అపర చాణుక్యుడిలా వ్యవహరించారు’’ అని సింగిరెడ్డి నరేష్ రెడ్డి చెప్పారు.
నాడు కేసీఆర్ మోదీ సమావేశాలకు డుమ్మా
2023వ సంవత్సరానికి ముందు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభించారు. కేంద్రంపై, ప్రధాని నరేంద్రమోదీపై ఎప్పుడూ విమర్శల వర్షం కురిపించిన కేసీఆర్ ఆయన పెట్టే సమావేశాలకు హాజరు కాకుండా పంతం పట్టారు. మోదీని లక్ష్యంగా చేసుకొని నిత్యం కేసీఆర్ విమర్శలు చేశారు. జీ 20 దేశాల కూటమి సమావేశానికి, నీతి ఆయోగ్ సమావేశానికి సైతం కేసీఆర్ డుమ్మా కొట్టారు. తెలంగాణకు నాలుగుసార్లు ప్రధాని హోదాలో మోదీ వస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పాల్గొన్న అధికారిక సమావేశాలకు గైర్హాజరు అయ్యారు.
గతంలో కేసీఆర్ ప్రోటోకాల్ ను ఉల్లంఘించారు...
ప్రోటో కాల్ ప్రకారం ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు వస్తే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ విమానాశ్రయానికి వెళ్లి,ఆయనకు స్వాగతం పలకాలి. అనంతరం అధికారిక కార్యక్రమంలో కూడా సీఎం పాల్గొనాలి. కానీ ప్రోటోకాల్ నిబంధనను సైతం గాలికొదిలేసి కేసీఆర్ మోదీ పర్యటనలకు దూరంగా ఉన్నారు. గతంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రోడ్లు, రైల్వే కార్యక్రమాలకు సైతం కేసీఆర్ దూరంగా ఉన్నారు. తన ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలికేందుకు బేగంపేట విమానాశ్రయానికి పంపించారు. కేసీఆర్ లాగా కేంద్రంతో ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకొని మూర్ఖంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన టీపీసీసీ ఎన్నారై విభాగం కన్వీనర్ మంద భీంరెడ్డి చెప్పారు. ‘‘కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యవహరించిన తీరును తెలంగాణ సమాజం హర్షిస్తుంది’’ అని భీంరెడ్డి వివరించారు.
సీఎం రేవంత్ వినతులకు కేంద్రం నుంచి సానుకూల స్పందన
ముఖ్యమంత్రి రేవంత్ గతంలో ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సందర్భంగా రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామి ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖ ఇచ్చారు. దీంతో భూములను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో సీఎం మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇలా రేవంత్ ఇచ్చిన వినతులపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుండటం విశేషం. గతంలో కేసీఆర్ లాగా కాకుండా కేంద్రంతో రాష్ట్రం సఖ్యతగా ఉంటే అభివృద్ధి పనులకు కేంద్రం ఎల్లప్పుడూ సహకరిస్తుందని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘ఎన్నికల సమయంలో తప్ప, మిగతా సమయాల్లో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న మా పార్టీ చేదోడు వాదోడుగానే ఉంటుంది’’ అని పాయల శంకర్ పేర్కొన్నారు.