అమిత్ షా సహా ఐదుగురి బీజేపీ నేతలపై పోలీసు కేసు...ఎందుకంటే...
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. దీంతో అమిత్ షాతో సహా ఐదుగురు బీజేపీ నేతలపై పోలీసులు కేసు పెట్టారు.
బీజేపీ ప్రచారంలో చిన్న పిల్లలు...నియమావళి ఉల్లంఘన
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మే 1వతేదీన లాల్ దర్వాజా నుంచి సుధా టాకీసు దాకా జరిగిన అమిత్ షా ఎన్నికల ప్రచార ర్యాలీలో బీజేపీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ జి నిరంజన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీల్లో చిన్న పిల్లల సేవలను రాజకీయ పార్టీలు ఉపయోగించుకోరాదని ఎన్నికల కమిషన్ నియమావళి చెబుతోంది. చిన్నపిల్లలతో బీజేపీ ర్యాలీలో ప్రచారం చేశారని తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
ఈసీకి ఫొటో ఆధారంతో ఫిర్యాదు
కానీ సుధా టాకీసు వద్ద జరిగిన అమిత్ షా ర్యాలీ వేదికపై కొందరు పిల్లలు దర్శనమిచ్చారని, అందులో పిల్లల చేతిలో బీజేపీ ఎన్నికల గుర్తు కమలం కూడా ఉందని నిరంజన్ ఈసీకి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. చిన్న పిల్లలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని తెలంగాణ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. అమిత్ షా ర్యాలీలో చిన్న పిల్లలు పాల్గొన్న చిత్రాన్ని కూడా నిరంజన్ ఎన్నికల అధికారులకు పంపించారు. అమిత్ షా ర్యాలీలో మాట్లాడుతుంటే చిన్న పిల్లలు ఆయన పక్కన నిలబడి ప్రచారంలో పాల్గొన్నారు.
మొఘల్‌పురా పోలీసుస్టేషనులో కేసు
మొఘల్ పురాలోని సుధా లైబ్రరీ వద్ద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార సభలో చిన్న పిల్లలను ఉపయోగించారని కాంగ్రెస్ నాయకుడు గోపిశెట్టి నిరంజన్ ఫిర్యాదు మేర మొఘల్ పురా పోలీసులు 77/2024 నంబరుతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో అమిత్ షాతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత, బీజేపీ నేత టీ యమన్ సింగ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు ఇచ్చిన ఫిర్యాదుపై నివేదిక పంపించాలని ఈసీ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్, మొఘల్ పురా పో్లీసులకు కోరింది. కాంగ్రెస్ నాయకుడి ఫిర్యాదు మేర మొఘల్ పురా ఇన్ స్పెక్టరుర పీఎన్ దుర్గా ప్రసాద్ ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశారు.
పోలీసు కేసుపై కోర్టుకు వెళతాం : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా చిన్నపిల్లలను ప్రచారంలో ఉపయోగించుకున్నారనే ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత, తనపై మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే టి రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ఫిర్యాదు ఆధారంగా తమపై పోలీసులు కేసు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసుపై తాము కోర్టుకు వెళతామని రాజాసింగ్ చెప్పారు.
Next Story