తెలంగాణలో పోలింగ్ బందోబస్తుకు భారీ పోలీసు బలగాలు
x
పోలింగ్ బందోబస్తుకు తరలివచ్చిన పోలీసు బలగాలు

తెలంగాణలో పోలింగ్ బందోబస్తుకు భారీ పోలీసు బలగాలు

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ బందోబస్తు కోసం కేంద్ర పారామిలటరీతోపాటు రాష్ట్ర పోలీసులు శనివారం తరలివచ్చారు.బందోబస్తు విధులకు సాయుధ పోలీసులను మోహరించారు.


తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సమాయత్తం అయ్యారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాలు అందించిన సమాచారంతో క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కేంద్ర పారామిలటరీ బలగాలను హైదరాబాద్ లాంటి సున్నిత ప్రాంతాల్లో మోహరించారు. హైదరాబాద్ నగరంలోని పలు పోలీసు పరేడ్ గ్రౌండ్లలో పోలీసులకు ఎన్నికల విధులను కేటాయించారు.
- హైదరాబాద్ నగరంతోపాటు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలింగ్ కేంద్రాల్లో పోలీసు బందోబస్తుకు సిబ్బందిని నియమించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా పోలీసు ఉన్నతాధికారులు శ్రీనివాసరెడ్డి, తరుణ్ జోషి, మహంతిలు బందోబస్తు వ్యూహాలు రూపొందించారు.
బందోబస్తు పోలీసులకు శిక్షణ
హైదరాబాద్ పోలీసు కమిషనరుతో పాటు అదనపు పోలీసు కమిషనర్లు, లా అండ్ ఆర్డర్, హెడ్ క్వార్టర్స్ అండ్ శిక్షణ కమాండెంట్లు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్‌లోని హోంగార్డులు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన హోంగార్డులకు ఎన్నికల బందోబస్తు విధులకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియం, గోషామహల్ స్టేడియాలు బందోబస్తు కోసం వచ్చిన పోలీసులతో కళకళలాడాయి.

ఎన్నికల విధుల్లో అన్ని విభాగాల పోలీసులు
ఎన్నికల విధుల్లో లా అండ్ ఆర్డర్, హెడ్ క్వార్టర్స్ అండ్ ట్రైనింగ్,హైదరాబాద్ సిటీ పోలీస్, టీఎస్ న్యాబ్, ట్రాఫిక్, ఉమెన్ సేఫ్టీ వింగ్, సీసీఎస్ విభాగాలకు చెందిన పోలీసు అధికారులను నియమించారు. పోలింగ్ సందర్భంగా అక్రమ మద్యం, నగదు పంపిణీ, ఉచిత బహుమతుల పంపిణీపై దృష్టి సారించాలని నగర పోలీసు కమిషనర్ శ్రీనివాసరెడ్డి కోరారు.

లాడ్జీలు, కల్యాణ మండపాలను తనిఖీ చేయండి
లాడ్జీలు, కల్యాణ మండపాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆయన ఆదేశించారు. ఈవీఎంల భద్రతపై ప్రాధాన్యమివ్వాలని కోరారు. రిటర్నింగ్ అధికారులు జారీ చేసిన బూత్ లెవల్ ఆఫీసర్లు మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించడానికి అనుమతించనున్నారు.పోలింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్‌ను అనుమతించరు.

వేలమంది పోలీసులతో బందోబస్తు
పోలింగ్ బందోబస్తుకు వివిధ విభాగాలకు చెందిన 8వేలమంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆరువేల మంది పోలీసులతో పోలింగ్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 1063మంది పోలీసు ట్రెయినీలు, 50 మంది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది, 12 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.

పోలింగ్ కేంద్రాల జియోట్యాగింగ్
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జియోట్యాగింగ్ చేసి, 72 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నలుగురు జోనల్ అధికారులు, 9 మంది డీసీపీలు, 47 మంది ఏసీపీలను పర్యవేక్షణకు నియమించారు. 1114 లైసెన్సు తుపాకులను పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేశారు. రాచకొండ పరిధిలో 11.9 కోట్ల నగదు, 75 లక్షల విలువగల మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు.

రైల్వే పోలీసు ఫోర్స్ ఏర్పాట్లు
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు సికింద్రాబాద్ రైల్వే పోలీసు ఫోర్స్ సన్నాహాలు చేసింది. ఎన్నికల సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, ఎలాంటి భద్రతా ఉల్లంఘనలు జరగకుండా అప్రమత్తంగా ఉండటానికి అదనంగా 60 మంది సిబ్బందిని నియమించారు. ప్రయాణికులు ఆర్‌పిఎఫ్ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 139కి కాల్ చేయవచ్చని సికింద్రాబాద్‌లోని ఆర్‌పిఎఫ్ అధికారి సరస్వత్ తెలిపారు.


Read More
Next Story